Share News

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో

ABN , Publish Date - Mar 11 , 2026 | 04:44 AM

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో

  • ఏసీబీ కోర్టు ఉత్తర్వులపై హైకోర్టు స్టే

అమరావతి, మార్చి 10(ఆంధ్రజ్యోతి): ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల నుండి స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను నామమాత్రపు పూచికత్తుతో విడుదల చేయాలని, బ్యాంక్‌ ఖాతాలను డీఫ్రీజ్‌ చేయాలంటూ విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల పై హైకోర్టు పై ఆదేశాలిచ్చింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమ వద్ద స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను విడుదల చేయడంతో పాటు వినియోగానికి వీలుగా బ్యాంక్‌ ఖాతాలను డీఫ్రీజ్‌ చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ పలువురు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్లు వేశారు. విచారణ జరిపిన కోర్టు వినియోగానికి వీలుగా బ్యాంక్‌ ఖాతాలను డీఫ్రీజ్‌ చేయాలని, అలాగే పూచికత్తు తీసుకొని ఆభరణాలను విడుదల చేయాలని ఏసీబీ అధికారులను ఆదేశించింది. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ విజయవాడ రేంజ్‌ ఏసీబీ డీఎస్పీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కేసుల దర్యాప్తు దశలో ఉండగా బ్యాంక్‌ ఖాతాలను డీఫ్రీజ్‌ చేయాలని, ఆభరణాలు విడుదల చేయాలని ఆదేశించడం సరికాదని ఏసీబీ స్టాండింగ్‌ కౌన్సిల్‌ శ్యాంసుందరరావు వాదించారు. ఆదాయానికి మించిన ఆస్తుల అభియోగాలు నిరూపణ అయితే సదరు ఆస్తులు ప్రభుత్వానికి చెందుతాయన్నారు. నామమాత్రపు పూచికత్తులు తీసుకొని ఆభరణాలను విడుదల చేయాలని ఏసీబీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఆభరణాలు అవసరమైతే అంతే విలువతో బ్యాంక్‌ గ్యారెంటీ ఇవ్వాలన్నారు. ఏసీబీ కోర్టు ఉత్తర్వుల పై స్టే విధించాలని కోరారు.

Updated Date - Mar 11 , 2026 | 04:45 AM