Share News

సునీల్‌ నాయక్‌కు తాత్కాలిక ఊరట

ABN , Publish Date - Mar 13 , 2026 | 03:30 AM

బిహార్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి సునీల్‌ కుమార్‌ నాయక్‌కు హైకోర్టులో తాత్కాలిక ఉపశమనం లభించింది. ఆయన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో...

సునీల్‌ నాయక్‌కు తాత్కాలిక ఊరట

  • 22 వరకు దర్యాప్తు అధికారి ముందు హాజరు నుంచి మినహాయింపు

అమరావతి, మార్చి 12(ఆంధ్రజ్యోతి): బిహార్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి సునీల్‌ కుమార్‌ నాయక్‌కు హైకోర్టులో తాత్కాలిక ఉపశమనం లభించింది. ఆయన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ఆమె బాగోగులు చూసుకొనేందుకు అనుమతిచ్చింది. ఈ నెల 22 వరకు దర్యాప్తు అధికారి ముందు హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ నెల 23న ఉదయం 10 గంటలకు తిరిగి దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని ఆదేశించింది. గురువారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ ఎంపీ, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజును కస్టోడియల్‌ టార్చర్‌కు గురిచేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ సునీల్‌ నాయక్‌ హైకోర్టులో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. గురువారం ఈ పిటిషన్‌ మరోసారి విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌ వాదనలు వినిపించారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సునీల్‌ నాయక్‌ బుధవారం (11వ తేదీ) వరకు దర్యాప్తు అధికారి ముందు హాజరయ్యారని వివరించారు. గత రాత్రి పట్నాలో ఉన్న పిటిషనర్‌ తల్లికి ఆరోగ్యం బాగోలేదని సమాచారం వచ్చిందన్నారు. తల్లి బాగోగులను చూడాల్సిన బాధ్యత పిటిషనర్‌పై ఉందన్నారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. 22 వరకు దర్యాప్తు అధికారి ముందు హాజరు నుంచి సునీల్‌ నాయక్‌కు మినహాయింపు ఇచ్చారు. 18న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ విచారణార్హతపై వాదనలు వింటామని పేర్కొన్నారు.

Updated Date - Mar 13 , 2026 | 03:31 AM