6 నెలల్లో ముగించండి
ABN , Publish Date - May 21 , 2026 | 04:14 AM
రాష్ట్రంలో యాసిడ్ దాడులకు సంబంధించి నమోదైన కేసులను వేగంగా పరిష్కరించేందుకు విచారణ కోర్టులకు కాలపరిమితిని నిర్ణయిస్తూ హైకోర్టు సర్క్యులర్ జారీ చేసింది.
యాసిడ్ దాడి కేసుల్లో విచారణకు కాలపరిమితి
హైకోర్టు సర్క్యులర్ జారీ
రెండు నెలల్లోపు చార్జిషీట్ దాఖలు చేయాలని పోలీసులకూ ఆదేశం
అమరావతి, మే 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో యాసిడ్ దాడులకు సంబంధించి నమోదైన కేసులను వేగంగా పరిష్కరించేందుకు విచారణ కోర్టులకు కాలపరిమితిని నిర్ణయిస్తూ హైకోర్టు సర్క్యులర్ జారీ చేసింది. ఆరు నెలల్లోపు కేసుల విచారణలు ముగించాలని విచారణ కోర్టులకు స్పష్టం చేసింది. కేసు నమోదైన నాటి నుంచి రెండు నెలల్లోపు దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. చార్జిషీట్ దాఖలు చేసిన తేదీ నుంచి నెల రోజుల్లో చార్జెస్ ఫ్రేమ్ చేయాలని, తదనంతరం మూడు నెలల్లోపు విచారణను ముగించాలని పేర్కొంది. విచారణ అనంతరం ప్రాసిక్యూషన్, డిఫెన్స్ వాదనలను సాధ్యమైనంత త్వరగా నెలరోజుల్లోపు పూర్తి చేయాలని తెలిపింది. ఆ తరువాత నెల రోజుల్లో తీర్పు వెలువరించాలని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా యాసిడ్ దాడుల కేసులు పరిష్కరించేలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని క్రిమినల్ కోర్టుల న్యాయాధికారులకు సూచనలు చేయాలని సంబంధిత జిల్లాల ప్రధాన న్యాయమూర్తులను ఆదేశించింది. ఉత్తర్వుల అమలును జిల్లా పోర్ట్‌ఫోలియో/అడ్మినిస్ట్రేటివ్ జడ్జిలు పర్యవేక్షిస్తారని పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి యాసిడ్ దాడి కేసులు వేగంగా పరిష్కరించేందుకు నిర్దిష్ట కాలపరిమితులతో రిజిస్ట్రార్(జ్యుడీషియల్) ఇటీవల సర్క్యులర్ జారీ చేశారు. దర్యాప్తు అధికారులు అందరూ సర్క్యులర్‌ను కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు.