Share News

పవన్‌ కల్యాణ్‌పై పిటిషన్‌ కొట్టివేత

ABN , Publish Date - Mar 25 , 2026 | 05:28 AM

సినిమాల్లో నటించకుండా ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను నిలువరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

పవన్‌ కల్యాణ్‌పై పిటిషన్‌ కొట్టివేత

  • ఉపముఖ్యమంత్రి సినిమాల్లో నటించడం అనైతికం

  • మాజీ ఐఏఎస్‌ అధికారి విజయ్‌కుమార్‌ పిటిషన్‌

అమరావతి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): సినిమాల్లో నటించకుండా ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను నిలువరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి మంగళవారం తీర్పు ఇచ్చారు. పవన్‌ తన హరిహర వీరమల్లు సినిమా, వాణిజ్య కార్యక్రమాలను ప్రమోట్‌ చేసుకొనేందుకు ప్రభుత్వ నిధులు, అధికార యంత్రాంగాన్ని వినియోగించడంపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ మాజీ ఐఏఎస్‌ అధికారి విజయ్‌కుమార్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల హైకోర్టు తుది విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది బి.బాలయ్య వాదనలు వినిపించారు. ఉపముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ సినిమాల్లో నటించడం అనైతికమన్నారు. హరిహరవీరమల్లు సినిమా టికెట్‌ ధరల పెంపు విషయంలో చట్టనిబంధనలు అనుసరించలేదని, వాణిజ్య కార్యక్రమాలు ప్రమోట్‌ చేసుకొనేందుకు పవన్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌, అదనపు ఏజీ సాంబశివ ప్రతాప్‌ వాదనలు వినిపిస్తూ... ముఖ్యమంత్రి, మంత్రుల హోదాల్లో ఉన్న వ్యక్తులు సినిమాల్లో నటించడంపై ఎలాంటి నిషేధం లేదని తెలిపారు. నిర్మాత అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని హరిహర వీరమల్లు సినిమా టికెట్‌ ధరల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వివరించారు. వ్యాజ్యానికి విచారణార్హత లేదని, దీనిని కొట్టివేయాలని కోరారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి వ్యాజ్యాన్ని కొట్టివేశారు.

Updated Date - Mar 25 , 2026 | 05:29 AM