అక్కడ దశాబ్దాలుగా రామాలయం
ABN , Publish Date - May 06 , 2026 | 05:40 AM
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయం నిర్మాణాన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తున్న వారికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.
రామాలయం నిర్మాణ అనుమతులపై వ్యాజ్యం కొట్టివేసిన హైకోర్టు
అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయం నిర్మాణాన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తున్న వారికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. రామాలయం నిర్మాణానికి జిల్లా కలెక్టర్ నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) జారీ చేయడం, తదనుగుణంగా నగర పంచాయతీ కమిషనర్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ పెదపేటకు చెందిన వంగా జ్యోత్స్న మరో ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం హైకోర్టు కొట్టివేసింది. విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రామాలయం నిర్మించ తలపెట్టిన స్థలం విషయంలో వివాదం ఎక్కడుందని పిటిషనర్లను ప్రశ్నించింది. రెవెన్యూ రికార్డులు, ఆధారాలను పరిశీలిస్తే ఎనిమిది దశాబ్దాలకు పైగా అక్కడ రామాలయం ఉన్నట్లు స్పష్టమౌతోందని పేర్కొంది. రెవెన్యూ రికార్డుల్లో సంబంధిత భూమిని ప్రభుత్వ పోరంబోకుగా, పట్టాదార్ కాలమ్‌లో గుడికి చెందినదిగా పేర్కొన్నారని తెలిపింది. స్థలానికి ఆనుకుని ఉన్న మరో భూమికి సంబంధించిన ఇన్‌కంబరెన్స్ సర్టిఫికెట్‌ను పరిశీలిస్తే ఉత్తరం వైపు హద్దు రామాలయం ఉన్నట్లు పేర్కొన్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో అక్కడ రామాలయం ఉన్నట్లు స్పష్టమౌతోందని తేల్చి చెప్పింది. తహసీల్దార్, ఆర్డీవో నివేదికలు, రెవెన్యూ రికార్డులు పరిశీలించిన తర్వాతే రామాలయం నిర్మాణానికి కలెక్టర్ ఎన్‌వోసీ జారీ చేశారని తెలిపింది. గత 80ఏళ్లుగా రామాలయం ఉన్న స్థలంలోనే నిర్మాణం చేపడుతున్నారని, దానిని ఆక్రమణగా పరిగణించలేమని పేర్కొంది. ఈ నేపథ్యంలో వాజ్యాన్ని కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ ఉత్తర్వులిచ్చారు. కాగా, ప్రభుత్వ భూమిలో మతపరమైన నిర్మాణం జరపడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని పిటిషనర్ జ్యోత్స్నతరఫు న్యాయవాది జడశ్రవణ్‌కుమార్ వాదనలు వినిపించారు.