రాజీకి అనుసరించిన విధానమేంటి?
ABN , Publish Date - Jan 30 , 2026 | 04:37 AM
పరకామణిలో చోరీ కేసు రాజీకి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని టీటీడీ ఈవోను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
పరకామణి కేసులో వివరాలతో కౌంటర్ వేయండి... టీటీడీ ఈవోకు హైకోర్టు ఆదేశం
అమరావతి, జనవరి 29(ఆంధ్రజ్యోతి): పరకామణిలో చోరీ కేసు రాజీకి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని టీటీడీ ఈవోను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. కేసు రాజీకి అథారిటీ ఎవరు? రాజీకి అనుసరించిన విధానమేంటి? ఈ విషయంలో టీటీడీ నిబంధనలు ఏం చెబుతున్నాయి? తదితర వివరాలను కౌంటర్‌లో పొందుపర్చాలని స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి వద్ద పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌ను ప్రస్తుత అప్పీల్‌కు జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. విచారణను ఫిబ్రవరి 5కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్.రఘునందనరావుతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. పరకామణిలో చోరీకి సంబంధించిన నమోదైన కేసును టీటీడీ బోర్డు తీర్మానం, ఈవో అనుమతి లేకుండానే 2023 సెప్టెంబరు 9న లోక్ అదాలత్ వద్ద ఏవీఎ్‌సవో వై.సతీశ్‌కుమార్, నిందితుడు రవికుమార్‌తో రాజీ చేసుకున్న వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయాలని సీఐడీని ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇటీవల ఆదేశాలు ఇచ్చారు. రవికుమార్, ఆయన కుటుంబ సభ్యుల స్థిర, చరాస్తులను, వారి బ్యాంకు ఖాతాలను పరిశీలించడంతో పాటు ఆ ఆస్తులు వారి ఆదాయానికి తగినట్టే ఆర్జించారా అనే కోణంలో లోతైన దర్యాప్తు చేయాలని ఏసీబీని ఆదేశించారు. కేసు రాజీకి సంబంధించి లోక్ అదాలత్ జారీ చేసిన ఉత్తర్వుల చట్టబద్ధతను తేల్చాల్సింది ధర్మాసనమేనని, అందువల్ల ఈ వ్యవహారాన్ని తేల్చేందుకు వీలుగా ఉత్తర్వుల ప్రతిని సీజే ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించిన విషయం తెలిసిందే. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిందితుడు రవికుమార్ వేసిన అప్పీల్‌తో పాటు లోక్ అదాలత్ అవార్డ్ చట్టబద్ధత తేల్చేందుకు నమోదైన సుమోటో వ్యాజ్యంపై సీజే ధర్మాసనం గురువారం విచారణ జరిపింది.