హైకోర్టు తీర్పుపై దుర్గగుడి అర్చకుల తర్జనభర్జన
ABN , Publish Date - Apr 07 , 2026 | 04:45 AM
విదేశీ ప్రయాణం చేసిన అర్చకులు గర్భాలయంలోకి ప్రవేశించకూడదంటూ.. ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై దుర్గగుడి అర్చకులు మల్లగుల్లాలు పడుతున్నారు.
విదేశీ ప్రయాణం చేసిన అర్చకులు గర్భాలయంలోకి ప్రవేశించకూడదని హైకోర్టు ఉత్తర్వులు
కొందరు ప్రభుత్వం తరఫునే వెళ్లారని వాదన
ఇంద్రకీలాద్రి(విజయవాడ), ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): విదేశీ ప్రయాణం చేసిన అర్చకులు గర్భాలయంలోకి ప్రవేశించకూడదంటూ.. ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై దుర్గగుడి అర్చకులు మల్లగుల్లాలు పడుతున్నారు. న్యాయ సలహా కోసం వీరంతా సీనియర్ న్యాయవాదులను సంప్రదిస్తున్నారు. వారి సూచనలతో హైకోర్టు ఉత్తర్వులపై ముందుకు వెళ్లాలనుకుంటున్నారు. శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్ధానంగర్భాలయంలో విధులు నిర్వహిస్తున్న పలువురు అర్చకులు విదేశీ ప్రయాణం చేస్తున్నారని, విదేశాలకు వెళ్లి వచ్చిన తర్వాత గర్భాలయంలో ప్రవేశించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని శ్రీచక్ర నవావరణార్చన పారాయణదారు డి.ఎస్.ఎస్.ఎస్.సుబ్రహ్మణ్య సోమయాజి ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరపున న్యాయవాది కేఆర్ శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ విదేశాలకు వెళ్లినవారు, సంప్రదాయాలకు విరుద్ధంగా జుత్తు కత్తిరించుకున్నవారు, గర్భాలయంలోకి ప్రవేశించి పూజలు చేయటానికి వీల్లేదని తెలిపారు. దీనిపై హైకోర్టు పూర్తి విచారణ చేసి విదేశీ ప్రయాణం చేసిన అర్చకులు గర్భాలయంలోకి ప్రవేశించటానికి వీల్లేదని, ఈ విషయంలో శృంగేరీ పీఠం ప్రామాణికాన్ని అమలు చేయాలని దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై దుర్గగుడి అర్చకులు స్పందిస్తూ.. కొందరు కావాలనే తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు.
విదేశాలకు వెళ్లిన కొందరు అర్చకులు పూర్వ ఆలయ ఈవో నరసింగరావు, పూర్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ ఇచ్చిన ఆదేశాల మేరకే అమెరికా వెళ్లి దుర్గమ్మ పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రభుత్వమే అనుమతి ఇవ్వటంతో ఉన్నతాధికారులు తమను అమెరికా పంపారని చెబుతున్నారు. మరికొందరు అర్చకుల కుమారులు, కుమార్తెలు అమెరికాలో ఉద్యోగం చేస్తుండటం వల్ల వెళ్లి వస్తున్నామని అంటున్నారు. కొందరు స్వామీజీలు, మఠాధిపతులు.. విదేశాల్లో హిందూ ధర్మ ప్రచారం చేసి, అక్కడి నుంచి వచ్చాక గర్భాలయాల్లో ప్రవేశిస్తున్నారని తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులపై తమకు గౌరవం ఉందని, వీటిపై సీనియర్ న్యాయవాదుల సలహాలు తీసుకుని తగిన కార్యచరణకు సిద్ధపడతామని దుర్గగుడి అర్చకులు చెబుతున్నారు. కాగా విదేశీ ప్రయాణం చేసి గర్భాలయంలో ప్రవేశించిన వారిలో పది మంది వరకు అర్చకస్వాములు ఉన్నట్టు తెలిసింది.