పూడి శ్రీహరి అరెస్ట్‌పై వివరాలివ్వండి: హైకోర్టు
ABN , Publish Date - Apr 17 , 2026 | 05:55 AM
వైసీపీ మీడియా ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్టునకు సంబంధించిన వివరాలు తమ ముందు ఉంచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
అమరావతి/కుప్పం, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): వైసీపీ మీడియా ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్టునకు సంబంధించిన వివరాలు తమ ముందు ఉంచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ మెడమల్లి బాలాజీతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. శ్రీహరి తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ అరెస్ట్ విషయంలో పోలీసులు చట్ట నిబంధనలు పాటించలేదన్నారు. పోలీసుల తరఫున సహాయ ప్రభుత్వ న్యాయవాది కృష్ణ ప్రణీత్ వాదనలు వినిపించారు.
కోర్టుకు శ్రీహరి.. బెయిల్ మంజూరు
సీఎం చంద్రబాబు చేతిలో కత్తిపెట్టి, గ్రాఫిక్ ఫొటోలతో దుష్ప్రచారం సాగించిన కేసులో మాజీ సీఎం జగన్ సీపీఆర్వో, వైసీపీ సోషల్ మీడియా చీఫ్ శ్రీహరిని చిత్తూరు జిల్లా కుప్పం పోలీసులు గురువారం కోర్టులో హాజరు పరచగా బెయిల్ మంజూరు చేసింది.