Share News

ఉత్పత్తి చేసే ఎల్‌పీజీ దేశీయ అవసరాలకే

ABN , Publish Date - Mar 20 , 2026 | 04:41 AM

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా దేశంలోని చమురు శుద్ధి కంపెనీలు ఉత్పత్తి చేసే ఎల్‌పీజీని దేశీయ అవసరాల కోసమే వినియోగించాలని హైకోర్టు తేల్చిచెప్పింది.

ఉత్పత్తి చేసే ఎల్‌పీజీ దేశీయ అవసరాలకే

  • చమురు శుద్ధి కంపెనీలకు రాష్ట్ర హైకోర్టు స్పష్టీకరణ

  • లేదంటే సామాన్య ప్రజలకు నష్టమని వ్యాఖ్య

అమరావతి, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా దేశంలోని చమురు శుద్ధి కంపెనీలు ఉత్పత్తి చేసే ఎల్‌పీజీని దేశీయ అవసరాల కోసమే వినియోగించాలని హైకోర్టు తేల్చిచెప్పింది. యుద్ధం కారణంగా దేశంలో ఎల్‌పీజీ ఉత్పత్తులకు తీవ్ర కొరత ఉన్నట్లు వార్తా కథనాలు వస్తున్నాయని గుర్తు చేసింది. ఈ నేపఽథ్యంలో చమురు శుద్ధి సంస్థలు ఉత్పత్తి చేసే ఎల్‌పీజీని అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయించేందుకు అనుమతిస్తే, దేశంలోని సామాన్య ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతుందని ప్రాథమికంగా అభిప్రాయపడింది. దీనిపై ఈనెల 5న జారీ చేసిన ఉత్తర్వులను కచ్చితంగా అమలయ్యేలా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. వినియోగదారులకు సరఫరా చేసేందుకు వీలుగా ఉత్పత్తి చేసే ఎల్‌పీజీని పిటిషనర్లకు సరఫరా చేయాలని కాన్ఫిడెన్స్‌ పెట్రోలియం ఇండియా లిమిటెడ్‌ సంస్థను (సీపీఐఎల్‌) ఆదేశించింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న కేంద్ర పెట్రోలియం-సహజవాయువు మంత్రిత్వశాఖ, కాన్ఫిడెన్స్‌ పెట్రోలియం ఇండియా లిమిటెడ్‌ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. వ్యాజ్యం పై తదుపరి విచారణను ఏప్రిల్‌ 2కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఈనెల 5న జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి, కాన్ఫిడెన్స్‌ పెట్రోలియం ఇండియా లిమిటెడ్‌ సంస్థ ఉత్పత్తి చేసిన ఎల్‌పీజీని అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయించకుండా నిరోధించడంతో పాటు భారత మార్కెట్‌లో పంపిణీదారుల ద్వారా వినియోగదారులకు సరఫరా చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ విజయవాడకు చెందిన మేథ హిమజశ్రీ ఎంటర్‌ప్రైజెస్‌, నిహాన్ష్‌ గ్యాస్‌ ఏజెన్సీ హైకోర్టును ఆశ్రయించాయి. ఈ వ్యాజ్యం ఇటీవల విచారణకు రాగా, పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ఓ.మనోహర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘‘పిటిషనర్లు కాన్ఫిడెన్స్‌ పెట్రోలియం ఇండియా లిమిటెడ్‌ సంస్థ నుండి గ్యాస్‌ కొనుగోలు చేసి వినియోగదారులకు సరఫరా చేస్తున్నారు.


పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, సైనిక ఉద్రిక్తతల వల్ల ప్రపంచ వ్యాప్తంగా చమురు, ఎల్‌పీజీ సరఫరాకు అంతరాయం నెలకొంది. దీంతో దేశీయ మార్కెట్‌లో ఎల్‌పీజీ సరఫరా- డిమాండ్‌ మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడింది. తమ వద్ద అందుబాటులో ఉన్న ప్రొపేన్‌, బ్యూటేన్‌ వాయువులతో ఎల్‌పీజీని ఉత్పత్తి చేసి ప్రభుత్వరంగ సంస్థలైన ఐవోసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌కు సరఫరా చేయాలని దేశంలోని చమురుశుద్ధి సంస్థలను కేంద్రం ఆదేశించింది. ఈ ఎల్‌పీజీని కేవలం గృహావసరాల కోసం సరఫరా చేయాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా కాన్ఫిడెన్స్‌ పెట్రోలియం ఇండియా సంస్థ ఎల్‌పీజీని అధిక ధరలకు అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయిస్తూ, లాభాలు పొందుతుందన్నారు.

Updated Date - Mar 20 , 2026 | 04:42 AM