Share News

దర్యాప్తు అధికారి కోరినప్పుడు విచారణకు హాజరవ్వండి

ABN , Publish Date - Jun 20 , 2026 | 04:43 AM

మాజీ ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన వ్యవహారంలో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ..

దర్యాప్తు అధికారి కోరినప్పుడు విచారణకు హాజరవ్వండి

  • ఐపీఎస్‌ సునీల్‌ నాయక్‌కు హైకోర్టు స్పష్టీకరణ

  • ముందస్తు బెయిల్‌పై విచారణ జూలై 3కి వాయిదా

  • 15 వరకు టైమివ్వలేమని స్పష్టీకరణ

అమరావతి, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): మాజీ ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన వ్యవహారంలో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ బిహార్‌ కేడర్‌ ఐపీఎస్‌ అధికారి సునీల్‌కుమార్‌ నాయక్‌ దాఖలు చేసిన పిటిషన్‌ పై విచారణను హైకోర్టు జూలై 3కి వాయిదా వేసింది. శుక్రవారం విచారణ ప్రారంభమైన వెంటనే.. ఈ వ్యాజ్యంలో సునీల్‌ నాయక్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపిస్తారని, విచారణను జూలై 15కి వాయిదా వేయాలని ఆయన తరఫున జూనియర్‌ న్యాయవాది అభ్యర్థించారు. అంత సమయం ఇవ్వలేమన్న న్యాయస్థానం.. 3వ తేదీకి వాయిదా వేసింది. దర్యాప్తు అధికారి కోరినప్పుడు విచారణకు హాజరుకావాలని సునీల్‌ నాయక్‌కు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ వై.లక్ష్మణరావు ఉత్తర్వులు ఇచ్చారు. తాను నరసాపురం ఎంపీగా ఉన్నప్పుడు 2021లో తనను సీఐడీ అధికారులు కస్టోడియల్‌ టార్చర్‌కు గురిచేశారని పేర్కొంటూ రఘురామరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 2024 జూలై 11న గుంటూరు నగరంపాలెం పోలీసులు నమోదు చేసిన కేసులో ముందుస్తు బెయిల్‌ కోరుతూ అప్పటి సీఐడీ డీఐజీ సునీల్‌ నాయక్‌ హైకోర్టులో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే.

Updated Date - Jun 20 , 2026 | 04:45 AM