Share News

వేల సంఖ్యలో క్రమశిక్షణ కేసులు

ABN , Publish Date - Feb 27 , 2026 | 03:37 AM

వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులపై పెండింగ్‌లో ఉన్న క్రమశిక్షణ చర్యల కేసుల పరిష్కారానికి హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పరిష్కారమయ్యేవరకు విచారణలను నిరంతరం పర్యవేక్షిస్తామని తెలిపింది.

వేల సంఖ్యలో క్రమశిక్షణ కేసులు

  • విచారణల పెండింగ్‌పై హైకోర్టు ఆందోళన

  • పురోగతిపై 4 నెలలకోసారి అఫిడవిట్‌

  • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు ఆదేశం

అమరావతి, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులపై పెండింగ్‌లో ఉన్న క్రమశిక్షణ చర్యల కేసుల పరిష్కారానికి హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పరిష్కారమయ్యేవరకు విచారణలను నిరంతరం పర్యవేక్షిస్తామని తెలిపింది. గతేడాది డిసెంబరు 15 నాటికి వివిధ శాఖల్లో 5,424 కేసులు పెండింగ్‌లో ఉండడంపై ఆందోళన వ్యక్తం చేసింది. చార్జ్‌మెమోలతో సంబంధం లేకుండా పదోన్నతి కల్పించాలని, సీనియార్టీ పునరుద్ధరించాలని, పదవీ విరమణ ప్రయోజనాలు కల్పించాలని, జాప్యం కారణంగా క్రమశిక్షణ విచారణలు కొట్టివేయాలని కోరుతూ పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలవుతున్నాయని తెలిపింది. దీంతో కోర్టుపై పెండింగ్‌ కేసుల భారం పెరుగుతోందని వెల్లడించింది. ప్రభుత్వ ఉత్తర్వుల్లో నిర్దేశించిన విఽధంగా 3 నుంచి 6నెలల వ్యవధిలో పెండింగ్‌ కేసులను పరిష్కరించాలంది. ప్రతి నాలుగునెలలకు క్రమశిక్షణ కేసుల విచారణల పురోగతిపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)ని ఆదేశించింది. కంటిన్యూస్‌ మాండమ్‌సను ఉపయోగించి కేసులు పరిష్కారమయ్యేవరకు పర్యవేక్షిస్తామంది. తదుపరి విచారణను జూన్‌ 19కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.విజయ్‌ ఇటీవల తీర్పు ఇచ్చారు. తనపై ఉన్న క్రమశిక్షణ చర్యలకు సంబంధించి ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను సాధ్యమైనంత త్వరగా ముగించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ విజయవాడ ఈఎస్ ఐ ఆసత్రిలో స్పెషల్‌గ్రేడ్‌ సివిల్‌ సర్జన్‌గా పనిచేస్తున్న జి.రవికుమార్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.


సాధారణ కేసులను మూడునెలల్లో, క్లిష్టమైన కేసులు 6నెలల్లో పరిష్కరించాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నప్పటికీ అమలుకావడం లేదన్నారు. పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి.. శాఖలవారీగా ఎన్ని విచారణలు పెండింగ్‌లో ఉన్నాయి? సకాలంలో ఎందుకు ముగించలేకపోతున్నారో చెప్పాలని సీఎస్ ను ఆదేశించారు. దీంతో బదిలీలు, పదవీ విరమణలు, కొత్తనియామకాలు, డేటా అందకపోవడం, ఫైళ్లు వివిధ కార్యాలయాల్లో ఉండడం వల్ల క్రమశిక్షణ చర్యల కేసుల విచారణలో జాప్యం జరుగుతోందని సీఎస్‌ హైకోర్టుకు నివేదించారు. శాఖలవారీగా పెండింగ్‌ కేసుల వివరాలను కోర్టు ముందు ఉంచారు. మొత్తం 5,424 కేసులు పెండింగ్‌లో ఉండగా అత్యధికంగా హోంశాఖలో 1,558, రెవెన్యూశాఖలో 854, రోడ్లు-భవనాలశాఖలో 384, పురపాలక-పట్టణాభివృద్ధిశాఖలో 366 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ స్థాయిలో క్రమశిక్షణ చర్యల కేసులు పెండింగ్‌లో ఉండడం పై న్యాయమూర్తి విస్మయం వ్యక్తం చేశారు. ‘విచారణల్లో జాప్యం కారణంగా ఉద్యోగులు తీవ్ర మానసిక వేదనకు గురవుతారు. పదవీ విరమణ ప్రయోజనాలు నిలిచిపోతాయి. ఇది విశ్రాంతి ఉద్యోగికి రాజ్యాంగం ప్రసాదించిన గౌరవప్రదమైన జీవితాన్ని గడిపే హక్కును హరించడమే. క్రమశిక్షణా విచారణలను వేగంగా ముగించాలనేది ఉద్యోగికి ఉన్న ప్రత్యేకమైన హక్కు కాదు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నిజాయితీ లేని ఉద్యోగులను శిక్షించడంతో పాటు నిజాయితీ కలిగినవారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత ఆయా శాఖలపై ఉంది’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.

Updated Date - Feb 27 , 2026 | 03:38 AM