జాతీయ భద్రతకు ముప్పు
ABN , Publish Date - May 22 , 2026 | 05:35 AM
నౌకాదళానికి చెందిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లకు చేరవేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత నౌకాదళ నావికుడు అశోక్ కుమార్ దేగ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది.
ఇలాంటి తీవ్రమైన కేసుల్లో బెయిల్ ఇవ్వలేం: హైకోర్టు
సెయిలర్ అశోక్ కుమార్ దేగ్‌కు బెయిల్ నిరాకరణ
పాక్ ఇంటెలిజెన్స్‌కు నేవీ సమాచారం చేరవేసిన కేసు
అమరావతి, మే 21(ఆంధ్రజ్యోతి): నౌకాదళానికి చెందిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లకు చేరవేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత నౌకాదళ నావికుడు అశోక్ కుమార్ దేగ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరిస్తూ విశాఖ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన వేసిన అప్పీల్‌ను ధర్మాసనం కొట్టివేసింది. జాతీయ భద్రతకు ముప్పుతో ముడిపడి ఉన్న ఇలాంటి తీవ్రమైన కేసుల్లో బెయిల్ మంజూరు చేయలేమని స్పష్టం చేసింది. అప్పీల్‌దారు ఆరేళ్లుగా కస్టడీలో ఉన్నందున సాధ్యమైనంత త్వరగా కేసు విచారణను ముగించాలని విశాఖ ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టును ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ కె.సురేశ్ రెడ్డి, జస్టిస్ జి.తుహిన్ కుమార్‌తో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. విశాఖ నావల్ బేస్‌లో సెయిలర్‌గా పనిచేస్తున్న అశోక్ కుమార్ దేగ్‌ను.. భారత నౌకలు, జలాంతర్గాముల కదలికల సమాచారాన్ని వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లకు చేరవేశాడన్న ఆరోపణలతో 2019 నవంబరులో కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు విశాఖపట్నంలో అరెస్ట్ చేశారు. కేసును ఎన్‌ఐఏకు బదిలీ చేశారు. ఆరేళ్లకుపైగా అశోక్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు. అయితే బెయిల్ మంజూరుకు విశాఖ ప్రత్యేక కోర్టు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... పిటిషనర్ ఆరేళ్లకుపైగా జైల్లో ఉన్నందున బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఎన్‌ఐఏ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ వాదనలు వినిపిస్తూ... పిటిషనర్‌కు వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లతో సంబంధాలు ఉన్నాయని వివరించారు. భారతీయ నౌకల సమాచారాన్ని వారికి పంపారన్నారు. వారినుంచి పిటిషనర్ ఖాతాకు సొమ్ము బదిలీ అయ్యిందని చెప్పారు. పిటిషనర్‌కు బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు. జాతీయ భద్రతతో ముడిపడి ఉన్న నేపథ్యంలో బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది.