High Court: సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నారు
ABN , Publish Date - Jan 08 , 2026 | 05:02 AM
సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా అధికార పార్టీ నాయకులు, మంత్రుల ఫొటోలను ప్రభుత్వ ప్రకటనల్లో ముద్రించడాన్ని తప్పుపడుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది.
ప్రభుత్వ ప్రకటనల్లో అధికార పార్టీ నేతల ఫొటోలపై పిల్
శిక్షించే పరిధి మాకు లేదు.. సుప్రీంకు వెళ్లండి: హైకోర్టు
అమరావతి, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా అధికార పార్టీ నాయకులు, మంత్రుల ఫొటోలను ప్రభుత్వ ప్రకటనల్లో ముద్రించడాన్ని తప్పుపడుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టునే ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించినవారిని శిక్షించే పరిధి హైకోర్టుకు ఉండదని స్పష్టం చేసింది. పిల్‌ను కొట్టివేసింది. బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడకు చెందిన రైల్వే ఉద్యోగి వై.కొండలరావు ఈ పిల్‌ను దాఖలు చేశారు. బుధవారం ఈ పిల్ విచారణకు రాగా, న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల్లో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సీజేఐ, రాష్ట్రస్థాయిలో గవర్నర్, ముఖ్యమంత్రి, సంబంధిత శాఖల మంత్రులు, జిల్లా ఇంచార్జ్ మంత్రుల ఫొటోలను మాత్రమే ముద్రించాలన్నారు. అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ మంత్రుల ఫొటోలతో ప్రకటనలు ఇస్తోందన్నారు.