ఉద్యోగి ఏకపక్ష తొలగింపు చట్టవిరుద్ధం
ABN , Publish Date - Feb 03 , 2026 | 03:32 AM
సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉద్యోగిని ఏకపక్షంగా తొలగించడం చట్ట విరుద్ధమని హైకోర్టు ధర్మాసనం ప్రకటించింది.
సహజ న్యాయసూత్రాల ప్రకారం నోటీసులివ్వాలి
అందుకు విరుద్ధంగా ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవు
ఇంటర్ బోర్డుకు హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ
గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులకు సమర్థన
అమరావతి, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉద్యోగిని ఏకపక్షంగా తొలగించడం చట్ట విరుద్ధమని హైకోర్టు ధర్మాసనం ప్రకటించింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఆ ఉద్యోగి వివరణ తీసుకోకుండా సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా జారీ చేసిన ఉత్తర్వులు చెల్లుబాటుకావని స్పష్టం చేసింది. ఓ కాలేజీలో పనిచేస్తున్న ఇద్దరు రికార్డు అసిస్టెంట్లు, ఓ వాచ్‌మెన్‌ను తొలగిస్తూ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ 2005, ఫిబ్రవరిలో జారీచేసిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేస్తూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. సింగిల్ జడ్జి తీర్పులో జోక్యానికి నిరాకరించింది. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ అవధానం హరిహరనాథశర్మతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చింది. పశ్చిమగోదావరి జిల్లా, ఆకివీడు మండలం, దుంపగడప గ్రామంలోని ఏకేపీఎస్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కేవీఆర్ శ్రీనివాసు, జి. శ్రీనివాసాచార్యులు రికార్డు అసిస్టెంట్లుగా, ఐ. నాగరాజు నైట్ వాచ్‌మెన్‌గా చేస్తున్నారు. వీరిని ఉద్యోగాల నుండి తొలగిస్తూ 2005, ఫిబ్రవరి 7న ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ 2005లో వీరు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. ఆ ప్రొసీడింగ్స్‌ను రద్దు చేశారు. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ ఇంటర్మీడియట్ కమిషనర్, విద్యాశాఖ కార్యదర్శి ధర్మాసనం ముందు అప్పీల్ వేశారు. విచారణ జరిపిన ధర్మాసనం ఇంటర్‌మీడియట్ బోర్డు అధికారుల వైఖరిని తప్పుబట్టింది.