అధికారులపై చర్యలు తీసుకోరేం!
ABN , Publish Date - Feb 13 , 2026 | 03:52 AM
సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా విశాఖ జిల్లా భీమునిపట్నంలో సముద్రానికి అతిసమీపంలో కాంక్రీట్ గోడ నిర్మాణం జరుగుతోందని తెలిసినా.. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోకపోవడాన్ని...
విజయసాయిరెడ్డి కుమార్తె ఆక్రమణల కేసులో హైకోర్టు తీవ్ర ఆక్షేపణ
అమరావతి, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా విశాఖ జిల్లా భీమునిపట్నంలో సముద్రానికి అతిసమీపంలో కాంక్రీట్ గోడ నిర్మాణం జరుగుతోందని తెలిసినా.. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోకపోవడాన్ని హైకోర్టు ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించింది. బాధ్యులైన అధికారులను రక్షించేందుకు జీవీఎంసీ కమిషనర్ ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిషనర్ ప్రవర్తనతో తాము సంతృప్తిగా లేమంది. అక్రమంగా కాంక్రీట్ గోడ నిర్మాణం చేస్తున్నా... నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను గుర్తించి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది. గోడ కూల్చడం ద్వారా పోగైన వ్యర్థాలను మూడువారాల్లో తొలగించాలని జీవీఎంసీ కమిషనర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగువారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్.రఘునందనరావుతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. మరోవైపు సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేసిన రెస్టోబార్ల విషయంలో లోతైన విచారణ జరుపుతామని పేర్కొంది. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె సీఆర్‌జడ్ నిబంధనలను ఉల్లంఘంచినా అధికారులు పట్టించుకోవడంలేదంటూ జనసేన కార్పొరేటర్ మూర్తి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అలాగే రెస్టోబార్ల గంటా నూకరాజు పిల్ దాఖలు చేశారు.