498ఏ కేసులో ‘లుకవుట్’ ఉత్తర్వులా?
ABN , Publish Date - Feb 17 , 2026 | 04:11 AM
భార్యపై భర్త, అతడి బంధువులు క్రూరంగా ప్రవర్తించారనే ఆరోపణలతో నమోదయ్యే ఐపీసీ సెక్షన్ 498 (ఏ) కేసుల్లో సైతం పోలీసులు ఇష్టారీతిన లుకవుట్ సర్క్యులర్(ఎల్‌వోసీ)లు జారీచేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.
పోలీసులు యాంత్రికంగా వ్యవహరిస్తున్నారు: హైకోర్టు
తీవ్ర నేరాల్లోనే వాటిని జారీ చేయాలి
ప్రస్తుత కేసులో పిటిషనర్ విచారణకు సహకరిస్తున్నారు
విదేశాలకు అనుమతించకుంటే అతడి కెరీర్ దెబ్బతింటుంది
న్యాయమూర్తి స్పష్టీకరణ.. ఎల్‌వోసీ కొట్టివేత
అమరావతి, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): భార్యపై భర్త, అతడి బంధువులు క్రూరంగా ప్రవర్తించారనే ఆరోపణలతో నమోదయ్యే ఐపీసీ సెక్షన్ 498 (ఏ) కేసుల్లో సైతం పోలీసులు ఇష్టారీతిన లుకవుట్ సర్క్యులర్(ఎల్‌వోసీ)లు జారీచేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఈ విషయంలో పోలీసులు యాంత్రికంగా వ్యహరిస్తున్నారని ఆక్షేపించింది. నిందితుడు దర్యాప్తునకు సహకరిస్తున్నారా.. లేదా? అరెస్టు నుంచి తప్పించుకుంటున్నారా అనే అంశాలను పరిశీలించకుండా ప్రతి కేసులోనూ ఎల్‌వోసీ జారీ చేస్తున్నారని పేర్కొంది. తీవ్రమైన నేరాలు, ఆర్థిక అక్రమాలు, దేశ భద్రత, ప్రయోజనాలు ఇమిడి ఉన్న కేసులు.. దౌత్య సంబంధాలు, ఆర్థిక ప్రయోజనాలకు భంగం కలిగించడం, ఉగ్రవాద చర్యలకు పాల్పడే తీవ్ర నేరస్థుల విషయంలో మాత్రమే లుకవుట్ ఉత్తర్వులు జారీ చేయాలని కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు సూచిస్తున్నాయని గుర్తుచేసింది. వ్యక్తులు స్వేచ్ఛగా సంచరించే ప్రాథమిక హక్కును ఎల్‌వోసీ హరిస్తుందని తెలిపింది. ప్రస్తుత కేసులో పిటిషనర్ ఎల్‌వీ అరుణ్‌కిరణ్‌పై నమోదైన 498ఏ కేసు తీవ్రమైనదేమీ కాదని.. వైవాహిక వివాదాలకు సంబంధించి నమోదయ్యే కేసుల్లో ఎక్కువ రాజీతో ముగుస్తాయని, కొన్ని సందర్భాల్లో కేసులు విచారణకు రావడానికే చాలా సమయం పడుతుందని పేర్కొంది. వ్యక్తిని నిర్బంధించడంతో పాటు దర్యాప్తునకు అతడు సహకరించేలా చూడడానికి మాత్ర మే పోలీసులకు ఎల్‌వోసీ జారీచేసే అధికారం ఇచ్చారని తెలిపింది. ఈ కేసులో పిటిషనర్ దర్యాప్తునకు సహకరిస్తున్నారని, అన్ని వాయిదాలకు క్రమం తప్పకుండా హాజరవుతున్నారని, అతడిపై ఎటువంటి నాన్‌బెయిలబుల్ వారెంటూ పెండింగ్‌లో లేదని గుర్తుచేసింది. ఎల్‌వోసీ కారణంగా విదేశాలకు వెళ్లేందుకు అనుమతించకుంటే పిటిషనర్ వృత్తిజీవితం దెబ్బతినడమే కాకుండా అతడికి పూడ్చుకోలేని నష్టం జరుగుతుందని తెలిపింది.
భార్యాభర్తల గొడవ కారణంగా పిటిషనర్ కెరీర్ దెబ్బతినడం సరికాదని పేర్కొం టూ ఎల్‌వోసీని కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి ఇటీవల తీర్పు ఇచ్చారు. అబూధాబీలో ఎలక్ట్రికల్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న విశాఖకు చెందిన ఎల్‌వీ అరుణ్‌కిరణ్‌పై అతడి భార్య ఫిర్యాదు ఆధారంగా విశాఖ అర్బన్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో బీఎన్‌ఎస్ సెక్షన్ 85 (ఐపీసీ 498ఏ), వరకట్న వేధింపులు తదితర సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులో నోటీసు అందుకున్న అరుణ్ కిరణ్ పోలీసుల ముందు హాజరై బెయిల్ పొందారు. పోలీసులు కేసు దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీటు కూడా దాఖలు చేశారు. కేసు విచారణ నిమిత్తం గత నెల 14న అబూధాబీ నుంచి విశాఖకు రాగా.. ఎల్‌వోసీ జారీ అయ్యిందని చెబుతూ పోలీసులు అరుణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఎల్‌వోసీ జారీని సవాల్ చేస్తూ అతడు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి పిటిషనర్‌పై పోలీసులు జారీ చేసిన ఎల్‌వోసీని కొట్టివేశారు.