Share News

అన్నీ తప్పుడు ఆరోపణలు

ABN , Publish Date - Feb 19 , 2026 | 04:19 AM

హెరిటేజ్‌ సంస్థపై తప్పుడు ఆరోపణలు చేసినందుకుగాను వైసీపీ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు ఆ సంస్థ లీగల్‌ నోటీసులు ఇచ్చింది.

అన్నీ తప్పుడు ఆరోపణలు

  • బొత్సకు హెరిటేజ్‌ లీగల్‌ నోటీసులు

  • వెంటనే క్షమాపణలు చెప్పండి

  • సంస్థ ప్రతిష్ఠ దెబ్బతీసేలా కుట్ర

  • మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి

  • లేకుంటే సివిల్‌, క్రిమినల్‌ చర్యలు

  • నోటీసుల్లో హెచ్చరించిన సంస్థ

అమరావతి, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): హెరిటేజ్‌ సంస్థపై తప్పుడు ఆరోపణలు చేసినందుకుగాను వైసీపీ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు ఆ సంస్థ లీగల్‌ నోటీసులు ఇచ్చింది. హెరిటేజ్‌ సంస్థ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ సాంబమూర్తి తరఫున న్యాయవాది మల్లికార్జున్‌ లీగల్‌ నోటీసులు పంపారు. అసత్య, నిరాధార ఆరోపణలతో సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్రకు పాల్పడ్డారని నోటీసుల్లో పేర్కొన్నారు. అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ దశాబ్దాలుగా ప్రజల నమ్మకాన్ని పొందిన సంస్థపై చేసిన తప్పుడు ప్రచారంపై వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. ‘హెరిటేజ్‌ సంస్థ చట్టబద్ధంగా నడుస్తూ పారదర్శక విధానాలతో పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రశంసలు, గుర్తింపు పొందింది. పూర్తి స్థాయిలో ఫుడ్‌ సేఫ్టీ నిబంధనలు పాటిస్తూ దేశంలోనే ప్రీమియం బ్రాండ్‌గా గుర్తింపు పొందింది. శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న మీరు ఇతర వైసీపీ నేతలతో కలిసి మీడియాలో తప్పుడు వ్యాఖ్యలతో సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగేలా అసంబద్ధ ఆరోపణలు చేశారు. ఇందాపూర్‌ డెయిరీతో ఎటువంటి సంబంధం లేకపోయినా 2014-19 మధ్య ఆ సంస్థ పేరుతో హెరిటేజ్‌ టీటీడీకి నెయ్యి సరఫరా చేసిందంటూ తప్పుడు ఆరోపణలు చేశారు. 22 సంస్థలతో హెరిటేజ్‌ సిండికేట్‌ ఏర్పాటు చేసిందంటూ నిరాధార ఆరోపణలు చేశారు. తక్షణమే క్షమాపణ చెప్పి మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో హెరిటేజ్‌ మీపై సివిల్‌, క్రిమినల్‌ చర్యలు తీసుకుంటుంది’ అని బొత్సకు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు.

Updated Date - Feb 19 , 2026 | 04:21 AM