హెరిటేజ్ విస్తరణకు 59.69 కోట్ల ప్రోత్సాహకాలు
ABN , Publish Date - Mar 18 , 2026 | 06:40 AM
రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ విధానం 4.0 (2024-29) కింద తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కాశిపెంట్ల గ్రామంలో హెరిటేజ్ సంస్థ విస్తరణ పనులు చేపట్టేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రోత్సాహకాలు మంజూరుచేసింది.
ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కింద ప్రభుత్వ ఉత్తర్వు
అమరావతి, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ విధానం 4.0 (2024-29) కింద తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కాశిపెంట్ల గ్రామంలో హెరిటేజ్ సంస్థ విస్తరణ పనులు చేపట్టేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రోత్సాహకాలు మంజూరుచేసింది. రూ.59.69 కోట్ల మేర ప్రోత్సాహకాలిస్తూ పాలసీ-పెట్టుబడుల విభాగం ముఖ్యకార్యదర్శి చిరంజీవి చౌదరి మంగళవారం ఉత్తర్వు జారీ చేశారు. తాము రూ.209.69 కోట్ల మేర పెట్టుబడులు పెట్టామని.. యువతకు ఉద్యోగాలూ కల్పిస్తున్నామని.. సంస్థను విస్తరిస్తున్నందున రాష్ట్ర ఆహార తయారీ పాలసీ కింద రాయితీలు ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి హెరిటేజ్ సంస్థ దరఖాస్తు చేసుకుంది. దీనిని గత నెల 18వ తేదీన జరిగిన సమావేశంలో రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) పరిశీలించింది. సుదీర్ఘ చర్చ తర్వాత సంస్థకు రూ.59.69 కోట్లు రాయితీలివ్వాలని తీర్మానించింది. స్థిర మూలధన పెట్టుబడిలో 25 శాతం కింద టెక్నాలజీ అప్‌గ్రెడేషన్ కోసం రూ.34.93 కోట్ల సబ్సిడీ ఇవ్వాలని.. నూరు శాతం ఎస్‌జీఎస్టీ రాయితీ కింద రూ.17.80 కోట్లు.. విద్యుత్ చార్జీల రీయింబర్స్‌మెంట్ కింద యూనిట్‌కు రూపాయి చొప్పున ఐదేళ్లలో రూ.0.98 కోట్లు.. వడ్డీ రాయితీ రెండు శాతం చొప్పున రూ.5 కోట్లు.. మొత్తంగా రూ.59.69 కోట్లను ప్రోత్సాహకాల కింద ఇవ్వాలని పేర్కొంది. ఇందుకు క్యాబినెట్ కూడా ఆమోదించడంతో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.