Share News

ఆమె రూటే సపరేటు!

ABN , Publish Date - Mar 18 , 2026 | 12:50 AM

నందివాడ ఎంపీడీవో తీరు వివాదాస్పదంగా ఉందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2020లో కుదరవల్లి గ్రామ సచివాలయ నిర్మాణానికి స్థలాన్ని దానమిచ్చి రిజిస్ర్టేషన్‌ చేసిన దాతలకు సరైన గుర్తింపును ఇవ్వకుండా, అక్కడి వైసీపీ సర్పంచ్‌కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ కూటమి నాయకులు ఆరోపిస్తున్నారు. తమిరిశ సర్పంచ్‌ తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం వ్యవహారంలోనూ సదరు అధికారి ఉదాసీనంగా వ్యవహరించారనే ఆరోపణులున్నాయి. వీటన్నింటినీ ఎమ్మెల్యే దృష్టికి స్థానిక నాయకులు తీసుకెళ్లినట్టు సమాచారం.

ఆమె రూటే సపరేటు!

- వివాదాస్పదంగా నందివాడ ఎంపీడీవో తీరు

- స్థలదాతల పేర్లతో శిలాఫలకం ఏర్పాటులో మీనమేషాలు

- నకిలీ కులధ్రువీకరణ పత్రం విచారణ విషయంలోనూ అంతే..

- సచివాలయాలపై జగన్‌ బొమ్మల తొలగింపులోనూ నిర్లక్ష్యం

- ఎంపీడీవోపై ఎమ్మెల్యేకు కూటమి నేతల ఫిర్యాదు

నందివాడ ఎంపీడీవో తీరు వివాదాస్పదంగా ఉందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2020లో కుదరవల్లి గ్రామ సచివాలయ నిర్మాణానికి స్థలాన్ని దానమిచ్చి రిజిస్ర్టేషన్‌ చేసిన దాతలకు సరైన గుర్తింపును ఇవ్వకుండా, అక్కడి వైసీపీ సర్పంచ్‌కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ కూటమి నాయకులు ఆరోపిస్తున్నారు. తమిరిశ సర్పంచ్‌ తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం వ్యవహారంలోనూ సదరు అధికారి ఉదాసీనంగా వ్యవహరించారనే ఆరోపణులున్నాయి. వీటన్నింటినీ ఎమ్మెల్యే దృష్టికి స్థానిక నాయకులు తీసుకెళ్లినట్టు సమాచారం.

ఆంధ్రజ్యోతి-గుడివాడ:

నందివాడ మండలం కుదరవల్లి గ్రామంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సచివాలయం, ఆర్‌బీకేల నిర్మాణానికి మాజీ సర్పంచ్‌ తుమ్మల ఉమామహేశ్వరరావుతో సహ ఆరుగురు సుమారు 22.5 సెంట్ల స్థలాన్ని, ప్రస్తుత సర్పంచ్‌ వసంతాల సత్యవతి, ఆమె భర్త వెంకట కృష్ణారావు 4.50 సెంట్ల స్థలాన్ని విరాళమిచ్చారు. భవనాలపై స్థలదాతల పేర్ల ఏర్పాటు విషయంలో రగడ జరిగింది. శిలాఫలకం ఏర్పాటు విషయంలో గ్రామ సర్పంచ్‌ సత్యవతి, ఆమె భర్త వెంకటకృష్ణారావు వ్యవహారంపై గ్రామ ఉపసర్పంచ్‌ జి.సుధారాణి, వార్డు సభ్యులు పలుమార్లు జిల్లా కలెక్టర్‌, డీపీవో, జెడ్పీ సీఈవోలకు ఫిర్యాదు చేశారు. గుడివాడ డీఎల్‌పీవో సంపతకుమారి ద్వారా విచారణ చేయించిన ఉన్నతాధికారులు వెంటనే శిలాఫలకాన్ని మార్పు చేసి, ఎవరు, ఎంత స్థలాన్ని విరాళమిచ్చారో పేర్కొంటూ శిలాఫలకాన్ని ఏర్పాటు చేయాలని ఎంపీడీవో నాగమల్లేశ్వరని ఆదేశించారు. కానీ నేటికి ఆ శిలాఫలాకాన్ని మార్చిన దాఖలాలు లేవు. ఫిర్యాదు చేసిన ప్రతిసారి ఎంపీడీవో నాగమల్లేశ్వరి గ్రామ కార్యదర్శులను మార్చేసారని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు. వైసీపీ సర్పంచ్‌కి అనుకూలంగా వ్యవహరించి శిలాఫలకాన్ని ఏర్పాటు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఉపసర్పంచ్‌ సుధారాణి, వార్డు సభ్యులు ఆరోపిస్తున్నారు.

నకిలీ కుల ధ్రువీకరణ పత్రం విషయంలో కోర్టును బురిడి కొట్టించి..

తమిరిశ సర్పంచ్‌ తప్పెట ధనలక్ష్మి బీసీ అని, ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రంలో సర్పంచ్‌గా ఎన్నికయ్యారని టీడీపీ సర్పంచ్‌ అభ్యర్థి రమణమ్మ ఆరోపిస్తూ ధనలక్ష్మి విద్యాభ్యాస సమయంలో జారీ చేసిన టీసీ, ఇతర ఆధారాలతో ఉన్నతాధికారులకు పిర్యాదు చేశారు. 2024 నవంబరు 29వ తేదీన ఎంపీడీవో నాగమల్లీశ్వరి, ఈవోపీఆర్డీ అబ్దుల్‌ బాషాలతో కూడిన విచారణ బృందం తమిరిశ గ్రామ పంచాయతీ కార్యాలయంలో పోలీస్‌ బందోబస్తు నడుమ విచారణ చేసింది. కానీ ఆ నివేదికను జెడ్పీ సీఈవోకు సమర్పించలేదని ఫిర్యాది రమణమ్మ ఆరోపిస్తున్నారు. సర్పంచ్‌ ధనలక్ష్మి నకిలీ కులధ్రువీకరణ పత్రాన్ని పొందారని, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ అధికారులు కోర్టుకు సైతం తప్పుడు నివేదికలిచ్చి కోర్టునే బురిడీ కొట్టించారని రమణమ్మ ఆరోపించారు.

సచివాలయాలపై ఇంకా జగన్‌ ఫొటోలు

గత వైసీపీ హయాంలో కట్టిన పలు సచివాలయాలు, ఆర్‌బీకేలపై జగన్‌ బొమ్మతో ఉన్న నవరత్నాల లోగోలు నేటికి దర్శనమిస్తున్నాయి. వీటిని తొలగించాలని పలుమార్లు కూటమి నాయకులు ఫిర్యాదు చేసినా, వాటిని తొలగించకుండా మండల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కూటమి నాయకులు గుర్రుగా ఉన్నారు.

జి.ఎస్‌.టి కట్‌ చేసి..

కుదరవల్లి గ్రామంలో మండల పరిషత నిధులు రూ.2.60 లక్షలతో పంప్‌ హౌస్‌ నిర్మాణం చేయగా, ఎక్కడా లేనివిధంగా తనకు జి.ఎస్‌.టి పేరుతో రూ.47వేలు కట్‌ చేసి బిల్లు చెల్లించారని మాజీ సర్పంచ్‌ మసిముక్కు వేణుగోపాలరావు ఆరోపించారు. తనకు జి.ఎస్‌.టి నెంబరు ఉందని, ఎటువంటి జీఎస్టీని కట్‌ చేయాల్సిన ఆవశ్యకతలేదని ఆయన పేర్కొన్నారు. ఏడు నెలలుగా తనను కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారని వేణుగోపాలరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే దృష్టికి విషయం

మండల పరిషత అధికారులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పలుమార్లు కూటమి నాయకులు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము దృష్టికి తీసుకువచ్చారు. నందివాడ ఎంపీడీవో నాగమల్లేశ్వరి పనితీరుపై ఎమ్మెల్యే వెనిగండ్ల అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.

శిలాఫలకం మార్చమని కార్యదర్శులకు ఆదేశాలిచ్చా : ఎంపీడీవో

ఆమెపై వచ్చిన పలు ఆరోపణలపై ఎంపీడీవో నాగమల్లేశ్వరిని వివరణ కోరగా, తన పరిధి కాదంటూ దాటవేశారు. కుదరవల్లిలో నెలకొన్న శిలాఫలకం వివాదంలో శిలాఫలకాన్ని మార్చాలని ముగ్గురు పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలిచ్చానని తెలిపారు. గ్రామంలో నెలకొన్న రాజకీయ ఘర్షణలకు భయపడి కార్యదర్శులు విధులు నిర్వర్తించేందుకు ముందుకు రావడం లేదని చెప్పారు. మొదట్లో సర్పంచ్‌ భర్త వసంతాల కృష్ణారావు శిలాఫలకాన్ని మార్చేందుకు సుముఖత వ్యక్తం చేశారని, తర్వాత ఎందుకు మారుస్తున్నారో రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆయన కోరినట్లు తెలిపారు. తమిరిశ సర్పంచ్‌ తప్పెట ధనలక్ష్మి కులధ్రువీకరణ పత్రం విషయంలో ఈవోపీఆర్డీ అమీర్‌ బాషాతో కలిసి విచారించి, ఇరువర్గాల నుంచి పత్రాలను తీసుకున్నామని, నివేదికను జిల్లా పంచాయతీ అధికారికి పంపినట్లు పేర్కొన్నారు. కాంట్రాక్టర్‌ బిల్లులో జీఎస్‌టీ కట్‌ చేసిన వ్యవహారంలో తనకు సంబంధంలేదని, సదరు కాంట్రాక్టర్‌ తనను అసలు కలవలేదని వివరించారు.

Updated Date - Mar 18 , 2026 | 12:50 AM