Visakhapatnam: వెనుక కూర్చున్న వారూ హెల్మెట్ పెట్టాల్సిందే
ABN , Publish Date - Jan 03 , 2026 | 04:54 AM
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించే విషయంలో నిబంధనలను విశాఖ ట్రాఫిక్ పోలీసులు కచ్చితంగా అమలు చేస్తున్నారు.
విశాఖలో మొదలైన నిబంధన అమలు
హెల్మెట్ లేకపోతే రూ.1,035 జరిమానా
వేలాది మందికి ఈ-చలాన్‌లు జారీ
గగ్గోలు పెడుతున్న ద్విచక్ర వాహనదారులు
విశాఖపట్నం, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించే విషయంలో నిబంధనలను విశాఖ ట్రాఫిక్ పోలీసులు కచ్చితంగా అమలు చేస్తున్నారు. వాహనం నడిపేవారే కాదు, వెనుక కూర్చున్నవారు (పిలియన్ రైడర్) హెల్మెట్ పెట్టుకోకపోయినా రూ.1,035 జరిమానా విధిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ నెల 1నుంచి విశాఖ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చున్న వ్యక్తికి హెల్మెట్ లేకపోతే సెల్‌ఫోన్‌లో ఫొటో తీసి ఈ-చలాన్ జారీ చేస్తున్నారు. ఇప్పటి వరకు మోటార్ సైకిల్ నడిపే వ్యక్తికి హెల్మెట్ లేకపోతే జరిమానా విధిస్తున్నారు. ఇప్పుడు వెనుక వ్యక్తికి హెల్మెట్ లేకపోయినా చలానా వస్తుండటంతో వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. గత రెండు రోజుల్లో పిలియన్ రైడర్‌కు హెల్మెట్ కారణంతో వేలాది ఈ-చలాన్‌లు జారీఅయినట్టు పోలీసులు చెబుతున్నారు. గత ఏడాది సెప్టెంబరు నుంచి డిసెంబరు 31వరకు దీనిపై విస్తృతంగా అవగాహన కల్పించామని, జనవరి 1 నుంచి ఈ-చలాన్‌లు జారీ ప్రక్రియ ప్రారంభించామని ఉన్నతాధికారులు వివరించారు.