Share News

తొలకరి పలకరింత

ABN , Publish Date - Jun 12 , 2026 | 04:04 AM

రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావం మొదలైంది. గడిచిన 24 గంటల్లో కోస్తాలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు కురిశాయి.

తొలకరి పలకరింత

అమరావతి, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావం మొదలైంది. గడిచిన 24 గంటల్లో కోస్తాలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు కురిశాయి. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. దీంతో రైతన్నను తొలికరి పలకరించినట్లైంది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు అత్యధికంగా విజయవాడ ఉత్తర ప్రాంతంలో 102 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఎన్టీఆర్‌ జిల్లాలో 57.1, ఏలూరు జిల్లాలో 37, బాపట్ల జిల్లాలో 34.9, కృష్ణాజిల్లాలో 32.4, గుంటూరు జిల్లాలో 30.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గురువారం సాయంత్రానికి గుంటూరు జిల్లా వంగిపురంలో 27.5, చిత్తూరు జిల్లా గంగవరంలో 23.5 మిల్లీమీటర్ల వాన పడింది. మెట్టప్రాంత రైతులు కొందరు వర్షాధారంగా అప్పుడే పత్తి, అపరాల విత్తనాలను ఎదలు ప్రారంభించారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తగ్గుతుందని ఐఎండీ హెచ్చరించింది. అయితే జూన్‌లో మధ్య ఆంధ్రప్రదేశ్‌లో సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఖరీఫ్‌ సాగును ముందుగానే చేపట్టాలని వ్యవసాయశాఖ సూచించింది. ఈ మేరకు పంట కాలువలకుు నీటి విడుదలకు ప్రభుత్వం షెడ్యూల్‌ ప్రకటించింది. మే 4న పెన్నా డెల్టాకు, జూన్‌ 1న గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేయగా, 15న వంశధార, తెలుగు గంగ(కడప), ఎస్పీవీబీఆర్‌ ఆయకట్టుకు, 16న గాలేరు-నగరి సుజల స్రవంతి ఆయకట్టుకు, జూలై 1న కృష్ణాడెల్టా, తోటపల్లి ఆయకట్టుకు, 10న ఏలేరు ఆయకట్టుకు, 15న కేసీకెనాల్‌, ఎస్‌ఆర్‌బీసీ, టీబీపీఎల్‌సీ, తాడిపూడి, పుష్కర ఆయకట్టుకు, 20న టీబీపీహెచ్‌ఎల్‌సీకి, 31న హెచ్‌ఎన్‌ఎ్‌సఎల్‌కు, నాగార్జునసాగర్‌ జోన్‌-1(పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లా)లకు నీటిని విడుదల చేయనున్నట్లు జలవనరుల శాఖ ప్రకటించింది. ఈ నెల 29న ఏరువాక పౌర్ణమి తర్వాత డెల్టా ప్రాంతాల అన్నదాతలు వరి సాగు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

బెజవాడలో కుండపోత

విజయవాడలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకూ ఏకధాటిగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు, ప్రధాన కూడ ళ్లు, వీధులు, రోడ్లు జలమయమయ్యాయి. దుకాణాలు, అపార్ట్‌మెంట్ల సెల్లార్లలోకి నీరు చేరింది. బుడమేరులోనూ కొంత నీరు అధికంగా రావడంతో పాయకాపురం, సింగ్‌నగర్‌లోని లోతట్టు ప్రాంతాలు గజగజ వణికాయి. ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో అత్యధికంగా 10.9, విజయవాడ రూరల్‌లో 9.5, విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 9.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా, ఉత్తరకోస్తాలో పలుచోట్ల గురువారం వడగాడ్పులు వీయగా, దక్షిణ కోస్తాలో వేడి వాతావరణం నెలకొంది. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తాలో ఎక్కువచోట్ల, ఉత్తర కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వర్షంలేని ప్రాంతాల్లో వడగాడ్పులు, వేడి వాతావరణం కొనసాగుతాయని పేర్కొంది.

Updated Date - Jun 12 , 2026 | 04:04 AM