జలాశయాలకు జలకళ
ABN , Publish Date - Sep 24 , 2026 | 04:56 AM
రాష్ట్రంలో భారీ వర్షాలతో పలు జిల్లాలోని జలాశయాలు జలకళను సంతరించుకుంటున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో అటుగంటిపోతున్న రిజర్వాయర్లు తిరిగి జీవ కళను సంతరించుకుంటున్నాయి.
(న్యూస్ నెట్‌వర్క్- ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భారీ వర్షాలతో పలు జిల్లాలోని జలాశయాలు జలకళను సంతరించుకుంటున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో అటుగంటిపోతున్న రిజర్వాయర్లు తిరిగి జీవ కళను సంతరించుకుంటున్నాయి. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలో జీఎన్‌ఎ్‌సఎ్‌స (గాలేరు-నగరి సుజల స్రవంతి) కెనాల్ నిండుగా ప్రవహిస్తోంది. కడప, చిత్తూరు జిల్లాల తాగునీటి అవసరాల కోసం జీఎన్‌ఎ్‌సఎ్‌స కాలువకు 5,500 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. దీంతో అవుకు రిజర్వాయర్ నుంచికొలిమిగుండ్ల మండలం మీదుగా ప్రవహిస్తున్న జీఎన్‌ఎ్‌సఎ్‌స కాలువ నీటి ప్రవాహంతో ఆకట్టుకుంటోంది. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో నంద్యాల జిల్లా గోరుకల్లు రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలు అవుకు రిజర్వాయర్‌కు మూడు టీఎంసీలు చేరాయి. చాగలమర్రి మండలంలోని రాజోలి ఆనకట్ట వద్ద కుందూనది బుధవారం వరద నీటితో ఉగ్రరూపం దాల్చింది.
బనకచర్ల నుంచి నీరు నిలిపి వేశారని, వర్షపు నీరే కుందూలో ప్రవహిస్తోందని అధికారులు చెప్పారు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలో హంద్రీ నది ఉప్పొంగింది. ఇక ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం సమీపంలోని కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయంలోకి 100 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఎర్రకాలువ జలాశయం నీటిమట్టం 77.80 మీటర్లుగా ఉంది. విజయనగరం జిల్లాలో మడ్డువలస, ఆండ్ర, తాటిపూడి, టీపీఆర్ నారాయణపురం జలాశయాలకు జలకళ సంతరించుకుంది. సోమవారం రాత్రి నుంచి బుధవారం వరకు కురిసిన వర్షాలకు జిల్లాలోని చెరువులు, నదులు, సాగునీటి కాలువల్లో నీరు సమృద్ధిగా చేరింది.