రుతుపవనాలు తిరిగొస్తున్నాయ్..!
ABN , Publish Date - Jul 20 , 2026 | 03:52 AM
నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించి నెలన్నర రోజులకు పైగా గడిచినా.. ఇప్పటి వరకూ చాలా రాష్ట్రాల్లో సరైన వర్షాల జాడ లేదు. .
వచ్చే వారం రోజుల్లో తూర్పు, ఉత్తర, మధ్య భారత ప్రాంతాల్లో భారీ వర్షాలు
దక్షిణాదిలో కొన్ని ప్రాంతాల్లోనే వానలు:ఐఎండీ
నేడు రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు
విశాఖపట్నం/అమరావతి, జూలై 19 (ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించి నెలన్నర రోజులకు పైగా గడిచినా.. ఇప్పటి వరకూ చాలా రాష్ట్రాల్లో సరైన వర్షాల జాడ లేదు. ఎన్‌నినో పరిస్థితులే ఇందుకు కారణం. గత కొన్ని వారాలుగా మేఘాలు పలచబడి, మైదాన ప్రాంతాలు ఎండలతో ఉడికిపోగా, వర్షాలు కేవలం హిమాలయ పర్వత ప్రాంతాలకే పరిమితమయ్యాయి. ఈ క్రమంలో దేశంలో వర్షాల కోసం వేచిచూస్తున్న వారికి భారత వాతావరణ శాఖ(ఐఎండీ) చల్లటి కబురు చెప్పింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనానికి అనువైన వాతావరణం ఏర్పడిన కారణంగా రుతుపవనాలు తిరిగి బలంగా పుంజుకోవడానికి సిద్ధమవుతున్నాయని తెలిపింది. ఈ నెల 23 లేదా 24 తేదీల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్‌కు ఆనుకుని అల్పపీడనం ఏర్పడనున్నదని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. రుతుపవనాల పునరుజ్జీవం ఈశాన్య భారతంలో మొదలై.. ఆ తర్వాత వచ్చే వారం ప్రారంభంలో తూర్పు, మధ్య, ఉత్తర భారత ప్రాంతాలకు విస్తరించనుందని ఐఎండీ అంచనా వేసింది. ఉరుములతో కూడిన వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. వారాల తరబడి అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో అల్లాడిన గంగా మైదాన, మధ్య భారత ప్రాంతాలకు ఇది ఉపశమనం కానుంది. అయితే మధ్య, తూర్పు, ఉత్తర భారతంతో పోల్చితే దక్షిణాదిలో కొన్ని ప్రాంతాలు తప్ప మిగిలిన ప్రాంతాల్లో వచ్చే వారం రోజుల వరకు చెప్పుకోదగ్గ వర్షాలు ఉండవని పేర్కొంది. ఈ నెలలో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 24 శాతం లోటు వర్షపాతం నమోదైంది. వాతావరణ నిపుణుల ప్రకారం.. భారతదేశం ప్రస్తుతం ‘బ్రేక్ మాన్‌సూన్’ దశను ఎదుర్కొంది. రుతుపవనాలు తిరిగి క్రియాశీలం కానున్న క్రమంలో ఆదివారం దేశంలోని మూడింట రెండొంతుల ప్రాంతాల్లో మేఘాలు ఆవరించి ఉన్నట్లు ఇస్రోకు చెందిన ఇన్సాట్-3డీఆర్ ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయి. దక్షిణ భారతం మీదుగా కూడా మేఘాలు విస్తరించి ఉన్నాయి.
నేడు పలు జిల్లాల్లో వర్షాలు
కాగా, ఆదివారానికి ఉత్తర కోస్తా, దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇంకా రాష్ట్రంలో పలుచోట్ల ఎండ తీవ్రత నెలకొంది. కొన్ని చోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిశాయి. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్నూలు జిల్లా నందవరంలో 22.54, దివమిదిన్నెలో 21 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, పలు చోట్ల ఎండ తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున సోమవారం మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరించింది. శ్రీకాకుళం, మన్యం, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.