Share News

మేలో వర్షాలు

ABN , Publish Date - May 02 , 2026 | 04:13 AM

మే నెలలో దేశంలోని చాలా ప్రాంతాల్లో దీర్ఘకాలిక సగటు (61.4 మిల్లీమీటర్ల) కంటే ఎక్కువగా 110 శాతం వర్షపాతం నమోదు కానుందని ఐఎండీ శుక్రవారం బులెటిన్‌లో అంచనా వేసింది.

మేలో వర్షాలు

  • సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు

  • ఏపీలోని ఉత్తర, మధ్య కోస్తాల్లో సాధారణం లేదా తక్కువగా,దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఎక్కువ ఉష్ణోగ్రతలు: ఐఎండీ

విశాఖపట్నం, మే 1(ఆంధ్రజ్యోతి): మే నెలలో దేశంలోని చాలా ప్రాంతాల్లో దీర్ఘకాలిక సగటు (61.4 మిల్లీమీటర్ల) కంటే ఎక్కువగా 110 శాతం వర్షపాతం నమోదు కానుందని ఐఎండీ శుక్రవారం బులెటిన్‌లో అంచనా వేసింది. తూర్పు, ఈశాన్య, మధ్య భారతంలో కొన్ని ప్రాంతాలు తప్ప దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయి. అయితే ఏపీలోని రాయలసీమ, దక్షిణ కోస్తా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, హిమాచల్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, బిహార్‌, ఉత్తర యూపీ, ఉత్తరాఖండ్‌, గుజరాత్‌, ఈశాన్య భారతంలోని పలు ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతోపాటు సగటు కంటే ఎక్కువ రోజులు వడగాడ్పులు వీయనున్నాయి. ఏపీలో ఉత్తర, మధ్య కోస్తాలో ఉష్ణోగ్రతలు సాధారణం లేదా అంత కంటే తక్కువగా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లోని ఎక్కువ ప్రాంతాల్లో ఎక్కువగా నమోదవుతాయని అంచనా. మేలో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో సాధారణం కంటే 6-7 రోజులు ఎక్కువగా వడగాడ్పుల రోజులు ఉంటాయి. ఏలూరు, ఎన్టీఆర్‌, పశ్చిమగోదావరి, బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో 3-4, కాకినాడ, తూర్పుగోదావరి, రాయలసీమ జిల్లాల్లో సాధారణం కంటే 1-2 రోజులు ఎక్కువ వడగాడ్పులు వీస్తాయి. కాగా, ఎల్‌నినో పరిస్థితులు నెలకొనే దిశగా మార్పులు వస్తున్నాయని, కేరళకు రుతుపవనాలు వారం రోజులు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉందని ఐఐటీఎం డైరెక్టర్‌ ఎ.సూర్యచంద్రరావు వెల్లడించారు. విశాఖలోని ఏయూలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

Updated Date - May 02 , 2026 | 04:13 AM