Share News

హైలెస్సో.. హైలెస్సా!

ABN , Publish Date - Sep 28 , 2026 | 03:09 AM

రాష్ట్రానికి రెండు జల ప్రాజెక్టులు రానున్నాయి. రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ రాష్ట్రంలోనే అతిపెద్ద జల రవాణా మార్గం అభివృద్ధికి అడుగులు పడ్డాయి. అలాగే విజయవాడ నుంచి రాకపోకలకు వీలుగా అమరావతిని అనుసంధానిస్తూ కృష్ణా నదిలో వాటర్‌ మెట్రో ప్రాజెక్టు ఏర్పాటుకు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది

హైలెస్సో.. హైలెస్సా!
WATERPROJECT

BOAT.jpg

  • ఏపీకి రెండు జల ప్రాజెక్టులు

  • రాష్ట్రంలోనే అతిపెద్ద జల రవాణా మార్గం

  • రాజధాని అమరావతి అనుసంధానంగా ప్రాజెక్టు

  • ముక్త్యాల-మచిలీపట్నం పోర్టు మధ్య ప్రతిపాదన

  • కృష్ణా నది, బందరు కాల్వ ద్వారా 168 కి.మీ. మార్గం

  • 1,700 కోట్లతో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం

  • ఏపీ ఇన్‌ల్యాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీ బిడ్ల ఆహ్వానం

  • అలాగే విజయవాడ-అమరావతిని అనుసంధానిస్తూ

    30 కిలోమీటర్ల మేర వాటర్‌ మెట్రో ప్రాజెక్టు

  • రోడ్డు మార్గానికి ప్రత్యామ్నాయంగా రాకపోకలు

(విజయవాడ-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రానికి రెండు జల ప్రాజెక్టులు రానున్నాయి. రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ రాష్ట్రంలోనే అతిపెద్ద జల రవాణా మార్గం అభివృద్ధికి అడుగులు పడ్డాయి. అలాగే విజయవాడ నుంచి రాకపోకలకు వీలుగా అమరావతిని అనుసంధానిస్తూ కృష్ణా నదిలో వాటర్‌ మెట్రో ప్రాజెక్టు ఏర్పాటుకు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల మీదుగా 168 కిలోమీటర్ల మేర భారీ జలమార్గ అభివృద్ధి ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఎన్టీఆర్‌ జిల్లా ముక్త్యాల నుంచి మచిలీపట్నం పోర్టు వరకు వయా అమరావతి, విజయవాడ మీదుగా పోర్టు కనెక్టివిటీని ఏర్పాటు చేసేందుకు రూ.1,700 కోట్ల అంచనాతో ఏపీ ఇన్‌ల్యాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీ ఆర్‌ఎఫ్‌పీని విడుదల చేసింది. ఈ భారీ జలరవాణా మార్గం ప్రాజెక్టును పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్(పీపీపీ), డిజైన్‌-బిల్డ్‌-ఫైనాన్స్‌-ఆపరేట్‌-ట్రాన్స్‌ఫర్‌ (డీబీఎఫ్‌వోటీ) విధానంలో టెండర్లను ఆహ్వానించింది. సరుకు రవాణా అవసరాలు, రోడ్డు రవాణాపై ఒత్తిడిని తగ్గించటానికి ప్రత్యామ్నాయంగా ఈ భారీ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అలాగే కృష్ణానదిలో వాటర్‌ మెట్రో ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రతిపాదన సిద్ధమైంది. విజయవాడ-అమరావతిని అనుసంధానిస్తూ 30 కిలోమీటర్ల మేర వాటర్‌ మెట్రో ప్రాజెక్టుకు ఏపీ జలరవాణా మండలి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను తయారు చేసింది. ఈ ప్రతిపాదనను కేంద్ర జలరవాణా మంత్రిత్వశాఖకు పంపింది. కోచిలో వాటర్‌ మెట్రో ప్రాజెక్టు విజయవంతం కావటంతో నూతన వాటర్‌ మెట్రో పాలసీ మార్గదర్శకాల ప్రకారం కృష్ణానదిలో వాటర్‌ మెట్రోను జలరవాణా మండలి ప్రతిపాదించింది. విజయవాడ-అమరావతి మధ్య రోడ్డు నెట్‌వర్క్‌పై నెలకొంటున్న ఒత్తిడిని తగ్గించి ప్రాంతీయంగా జలరవాణాను మెరుగుపరిచే లక్ష్యంగా ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. వాటర్‌ మెట్రో ప్రాజెక్టులో భాగంగా ఎలక్ర్టిక్‌, హైబ్రిడ్‌ నౌకలను ఉపయోగించేందుకు సిఫారసులు చేసింది. స్థానికంగా పర్యాటకాన్ని అభివృద్ధి చేయటానికి దోహదపడుతుందని నిర్దేశిస్తోంది. జల రవాణా మార్గం ప్రాజెక్టు స్వరూపం ఇదీ


కృష్ణా నదిలో ముక్త్యాల నుంచి ప్రకాశం బ్యారేజ్‌ వరకు జాతీయ జలమార్గం (ఎన్‌డబ్ల్యూ-4) మొత్తం 82 కి.మీ. మేర విస్తరించి ఉంది. ఈ మార్గంలో జగ్గయ్యపేట సిమెంట్‌ కారిడార్‌తో పాటు రాజధాని అమరావతి ప్రాంతం అనుసంధానమై ఉన్నాయి. ప్రకాశం బ్యారేజ్‌ నుంచి మచిలీపట్నం పోర్టు వరకు బందరు కాల్వ 86 కిలోమీటర్ల పొడవున రాష్ట్ర జలమార్గంగా ఉంది. బందరు కాల్వ లోతు 1.5 మీటర్ల నుంచి 3.5 మీటర్ల వరకు ఉంది.

ప్రాజెక్టు ప్రధాన అంశాలు, ప్రయోజనాలు

ప్రైవేట్‌ భాగస్వామ్య పెట్టుబడి మొత్తం రూ.1,700 కోట్లు కాగా, రాయితీ కాలపరిమితిని 30 ఏళ్లుగా నిర్ణయించారు.

దీనిద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 15 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఏటా 5 మిలియన్‌ టన్నుల సరుకు రవాణాను రోడ్డు మార్గం నుంచి జలమార్గానికి మళ్లించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

జగ్గయ్యపేట పరిసర ప్రాంతాల నుంచి సిమెంట్‌, ఫ్లైయాష్‌, సున్నపురాయి వంటి ముడి సరుకును నేరుగా మచిలీపట్నం పోర్టుకు రవాణా చేస్తారు. మచిలీపట్నం పోర్టుకు పెద్దఎత్తున ఎగుమతి, దిగుమతులు, పొరుగు రాష్ట్రాలకు కోస్టల్‌ కార్గో రాకపోకలు సులభతరం కానున్నాయి.ప్రాజెక్టులో భాగంగా విజయవాడ-అమరావతి మధ్య ప్రయాణికులు, వాహనాల రవాణాకు, రో-పాక్స్‌ సేవలను ఏర్పాటు చేయడం తప్పనిసరి చేశారు. ఇబ్రహీంపట్నం, వెంకటపాలెం, ఏటిమొగ, ఎదురుమొండి మార్గాల్లోనూ రో-రో/రో-పాక్స్‌ టెర్మినళ్ల అభివృద్ధికి ప్రతిపాదించారు.

బిడ్డర్‌ చేయాల్సిన పనులు

ఎంపికైన బిడ్డర్‌ సొంత ఖర్చుతో జలమార్గ డ్రెడ్జింగ్‌ చేపట్టాలి. ఫెయిర్‌వే, టెర్మినళ్లను ఏర్పాటుచేయాలి. నావిగేషనల్‌ లాక్స్‌ను నిర్మించి, నిర్వహించాలి. ఆర్‌అండ్‌బీ మార్గదర్శకాలకు అనుగుణంగా జలరవాణా మార్గంలో కొత్త వంతెనలను అందుబాటులోకి తెచ్చిన తర్వాతే పాత లో-లెవల్‌ వంతెనలను తొలగించాలి. విద్యుత్‌ లైన్ల తరలింపు బాధ్యతలు కూడా బిడ్డర్‌వేనని ఆర్‌ఎ్‌ఫపీలో స్పష్టం చేశారు. ఇరిగేషన్‌, ఆర్‌ఆండ్‌బీ, ఏపీ ట్రాన్స్‌కో, ఐడబ్ల్యూఏఐ శాఖల నుంచి అవసరమైన అనుమతుల కోసం బిడ్డర్‌కు ఏపీఐడబ్ల్యూఏ సాయం అందిస్తుంది. కనీస హామీ వార్షిక రాయితీ రుసుము(కన్సెషన్‌ ఫీజు) రూ.కోటితో ప్రారంభమై, అత్యధిక రుసుము ఆఫర్‌ చేసే హెచ్‌-1 బిడ్డర్‌కు ఈ ప్రాజెక్టు కేటాయిస్తారు. ప్రాజె క్టు ప్రారంభ మైన ఆరో ఏడాది నుంచి కాంట్రాక్టు సంస్థకు చెల్లింపులు ప్రారంభమవుతాయి.


టెర్మినళ్ల అప్పగింతకు ప్రభుత్వం విజ్ఞప్తి

ముక్త్యాల-మచిలీపట్నం పోర్టు ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు, ముక్త్యాల, హరిశ్చంద్రపురం దగ్గర ఇన్లాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఐడబ్ల్యూఏఐ) నిర్మించిన టెర్మినళ్లను నిర్వహణ నిమిత్తం లీజుపై ఏపీ ఇన్‌ల్యాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీ (ఏపీఐడబ్ల్యూఏ)కు అప్పగించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీనివల్ల వ్యయం తగ్గుతుందని, మౌలిక వసతుల సద్వినియోగంతో పనులు వేగంగా మొదలవుతాయని భావిస్తోంది.

వాటర్‌ మెట్రో ప్రాజెక్టు ఇలా

విజయవాడ నుంచి అమరావతి వరకు వాటర్‌ మెట్రో ప్రాజెక్టు జల రవాణా మండలి ప్రతిపాదిస్తున్న ఈ ప్రాజెక్టు నాలుగో నేషనల్‌ వాటర్‌ వే (ఎన్‌డబ్ల్యూ-4) పరిధిలోకి వస్తుంది. విజయవాడ నుంచి అమరావతికి దాదాపు 30కి.మీ. జలమార్గాన్ని అనుసంధానిస్తూ వాటర్‌ మెట్రోను అనుసంధానించారు. అమరావతి నిర్మాణం జరుగుతున్న ప్రాంతం వెంబడే ఈ వాటర్‌ మెట్రో అలైన్‌మెంట్‌ ఉంది. విజయవాడ-అమరావతికి ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థగా ఉంటుంది. ఈ ప్రాజెక్టు కార్యరూపంలోకి వస్తే రాష్ర్టానికే హైలైట్‌గా నిలుస్తుంది. దీనిద్వారా బహుళ ప్రయోజనాలు కలుగుతాయి. కృష్ణానది వెంబడి టెంపుల్‌ టూరిజానికి దోహదపడుతుంది.


రెండు దశలలో ప్రాజెక్టు

ప్రతిపాదిత వాటర్‌ మెట్రో ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేయనున్నారు. మొదటి దశలో విజయవాడ నుంచి రాయపూడి వరకు 15 కి.మీ. దూరంలో ఏర్పాటు చేస్తారు. నావిగేషన్‌ చానల్‌ మొదటి 15 కి.మీ. దూరానికి డ్రెడ్జింగ్‌ చేయాల్సిన అవసరం లేదని తేల్చారు. రాష్ట్ర జల రవాణా మండలి ఇటీవల కార్గో బోట్‌తో ఈ మార్గంలో విజయవంతంగా ట్రయల్‌ రన్‌ నిర్వహించింది. సంవత్సరం పొడవునా ఏ అవరోధాలు లేకుండా జల రవాణాను సాగించవచ్చు. నది ప్రవాహం కూడా చాలా అనువుగా ఉంటుంది. రెండో దశలో రాయపూడి నుంచి అమరావతి వరకు ప్రతిపాదించారు. ఈ మార్గంలో నావిగేషన్‌ చానల్‌ అభివృద్ధి డ్రెడ్జింగ్‌ పనులు నిర్వహించాలి.

రోడ్డు రవాణాకు ప్రత్యామ్నాయం

రోడ్డు రవాణా నుంచి 40శాతం మందిని వాటర్‌ మెట్రోకు తీసుకురావచ్చని జల రవాణా మండలి అధ్యయనం చెబుతోంది. సాధారణ చార్జీల కంటే తక్కువకే వాటర్‌ మెట్రో ప్రయాణం అందుబాటులో ఉంటుంది. విజయవాడ నుంచి అమరావతి రాజధాని ప్రాంత పరిధిలోకి రోజూ 5 వేల నుంచి 6 వేల మంది సందర్శకులు రాకపోకలు సాగిస్తుంటారు. వీరిలో 40 శాతం మందిని జలరవాణా వైపు మరల్చటానికి దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. సచివాలయ ఉద్యోగులు, ఇతర సందర్శకులు రోజూ 4 వేల నుంచి 5 వేల మంది రాకపోకల్లో 60 శాతం మందిని జల రవాణా వైపు మళ్లించవచ్చు. సీఆర్‌డీఏ ఉద్యోగులు, ఇతర సందర్శకులు రోజుకు 2 వేల మంది రాకపోకలు సాగిస్తుంటారని వీరిలో 60 శాతం మందిని వాటర్‌ మెట్రోవైపు తీసుకురావచ్చని అధ్యయనం చెబుతోంది. నదీతీర ప్రాంతంలోని ఆలయాలను సందర్శించుకోవటానికి రోజూ 6 వేల మంది వస్తుంటారని వీరిలో 80 శాతం మందిని వాటర్‌ మెట్రోను ఉపయోగించుకునే అవకాశం ఉందని చెబుతోంది. రోజువారీ విజయవాడ-అమరావతి మధ్య ప్రయాణించే సగటు సందర్శకుల్లో 40 శాతం మంది వాటర్‌ మెట్రోవైపు వచ్చినా ఈ ప్రాజెక్టు విజయవంతమవుతుందని అధ్యయనం చెబుతోంది. విజయవాడ నుంచి రాజధాని వెళ్లే సందర్శకులకే కాకుండా ఇంద్రకీలాద్రిపై కనకదుర ్గమ్మ, వెంకటపాలెం వేంకటేశ్వరస్వామి, తాళ్లాయపాలెం పాత శివాలయం, అమరావతిలోని అమరేశ్వరస్వామి ఆలయాలను అనుసంధానిస్తుంది. అలాగే మధ్యలో భవానీ ఐల్యాండ్‌, పవిత్ర సంగమాలను కలుపుతుంది.


6 టెర్మినళ్లు

వాటర్‌ మెట్రో ప్రాజెక్టుకు మొత్తం ఆరు చోట్ల టెర్మినళ్ల ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఈ టెర్మినళ్ల నిర్మాణ పనులు సీఆర్‌డీఏ చేపడుతుంది. మొదటి టెర్మినల్‌ దుర్గాఘాట్‌ దగ్గర ఉంటుంది. కనకదుర్గమ్మ గుడికి అత్యంత సమీపంలోనే కృష్ణానదికి అనుసంధానంగా ఈ టెర్మినల్‌ను నిర్మిస్తారు. రెండోది భవానీ ఐల్యాండ్‌లో, మూడోది వెంకటపాలెం టీడీడీ ఆలయం సమీపంలో, నాలుగోది ఏపీసీఆర్‌డీఏ-శివాలయానికి దగ్గరగా, ఐదోది రాయపూడిలో ఏపీసీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆరోది ఇబ్రహీంపట్నం దగ్గర కృష్ణానది వెంబడి నిర్మిస్తారు. హైదరాబాద్‌-విజయవాడ రహదారికి ఇది అనుసంధానమవుతుంది.

Updated Date - Sep 28 , 2026 | 03:15 AM