Share News

ఠారెత్తించిన ఎండలు

ABN , Publish Date - Apr 06 , 2026 | 04:38 AM

రాష్ట్రంలో ఆదివారం భిన్నమైన వాతావరణం నెలకొంది. ఒకవైపు కోస్తా, రాయలసీమలో ఠారెత్తించే ఎండలతో వడగాడ్పులు వీయగా.. మరోవైపు పలు చోట్ల ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది.

ఠారెత్తించిన ఎండలు

  • కోస్తా, సీమలో వడగాడ్పులు

  • నెల్లూరుపాలెం, వీరఘట్టంలో 42.4 డిగ్రీలు

  • రేణిగుంటలో 42.3 నమోదు

  • పలుచోట్ల పిడుగులతో వర్షం

  • రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం

  • నేడూ అదే పరిస్థితి

  • శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపాటుకు తల్లీకుమార్తె మృతి

విశాఖపట్నం, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆదివారం భిన్నమైన వాతావరణం నెలకొంది. ఒకవైపు కోస్తా, రాయలసీమలో ఠారెత్తించే ఎండలతో వడగాడ్పులు వీయగా.. మరోవైపు పలు చోట్ల ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. దక్షిణ కోస్తాను ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం, రాయలసీమలో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు ఆవరించాయి. రాయలసీమలో ఆవర్తనం నుంచి తమిళనాడు మీదుగా గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ వరకు ఉపరితలద్రోణి విస్తరించింది. దీంతో సముద్రం నుంచి తేమగాలులు భూ ఉపరితలంపైకి వీస్తున్నాయి. ఇదే సమయంలో ఎండ తీవ్రత నెలకొంది. వాతావరణ అనిశ్చితి ఏర్పడి రాష్ట్రంలో పలుచోట్ల ఈదురుగాలులు, పిడుగులతో వర్షాలు కురిశాయి. పార్వతీపురం మన్యం జిల్లా చిలకలపల్లిలో 40.75 మిల్లీమీటర్లు, నెల్లూరు జిల్లా ఉదయగిరిలో 29.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు అనేక ప్రాంతాల్లో ఎండతీవ్రతతో వడగాడ్పులు వీయడంతో ప్రజలు ఠారెత్తిపోయారు.


పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం, నెల్లూరు జిల్లా నెల్లూరుపాలెంలో 42.4 డిగ్రీలు, తిరుపతి జిల్లా రేణిగుంటలో 42.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కోస్తా, రాయలసీమలో ఎండతీవ్రత కొనసాగుతుందని పేర్కొంది.


  • నెల్లూరులో అకాల వర్షం...నేలకొరిగిన వరిపైరు

ఉదయగిరి/కలువాయి, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లా ఉదయగిరి, కలువాయి మండలాల్లో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా కొన్ని ప్రాంతాల్లో కోత దశలో ఉన్న వరిపైరు నేలమట్టమైంది. మామిడి కాయలు నేలరాలాయి. అలాగే కలువాయిలో ఆదివారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. ప్రస్తుతం వరి కోతలు ముమ్మరంగా జరుగుతుతుండడంతో ధాన్యాన్ని కాపాడుకునేందుకు అన్నదాతలు అవస్థలు పడ్డారు.

Untitled-6 copy.jpg


  • పిడుగుపాటుకు తల్లీకుమార్తె మృతి

హరిపురం, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా మందస మండలం పెద్ద కేసుపురంలో ఆదివారం పిడుగుపడి తల్లీకుమార్తె మృతిచెందారు. గ్రామానికి చెందిన మడియా కృష్ణకుమారి(36), తన కుమార్తె యోగేశ్వరి(15)తో కలిసి ఆదివారం మధ్యాహ్నం తోటలో ఉన్న ఆవులకు నీరు పెట్టేందుకు వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తుండగా.. ఉరుములు, మెరుపులతో వర్షంతోపాటు పిడుగుపడి ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

Untitled-7 copy.jpg

Updated Date - Apr 06 , 2026 | 04:46 AM