కావలిలో40 డిగ్రీల ఉష్ణోగ్రత
ABN , Publish Date - Mar 07 , 2026 | 04:48 AM
రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరిగింది. దక్షిణ కోస్తాలోని పలు జిల్లాల్లో శుక్రవారం వడగాడ్పులు వీచాయి.
ఈ సీజన్‌లో తొలిసారిగా నమోదు
రాష్ట్రంలో పెరిగిన ఎండల తీవ్రత
దక్షిణ కోస్తా జిల్లాల్లో వడగాడ్పులు
విశాఖపట్నం, మార్చి 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరిగింది. దక్షిణ కోస్తాలోని పలు జిల్లాల్లో శుక్రవారం వడగాడ్పులు వీచాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు నుంచి ఏడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. ఈ సీజన్‌లో తొలిసారిగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నెల్లూరు జిల్లా కావలిలో నమోదైంది. ఒంగోలులో 39.8, నెల్లూరు, కర్నూలుల్లో 39.6, అమరావతిలో 39.4, తిరుపతి, కడప, నంద్యాలలో 39 డిగ్రీలు నమోదైంది. మధ్య భారతంలో కొనసాగుతున్న అధిక పీడనం ప్రభావంతో ఉత్తరాది నుంచి వేడిగాలులు దక్షిణ భారతంపైకి వీస్తున్నాయని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. ఉత్తరాది గాలులతో రాష్ట్రంలో వేడి వాతావరణం, ప్రధానంగా దక్షిణ కోస్తాలో వడగాడ్పులు వీస్తున్నాయన్నారు. మార్చి తొలి వారంలో రాయలసీమలో కొనసాగే వాతావరణం ఈ ఏడాది దక్షిణ కోస్తాలో నెలకొందని, ఇందుకు ఉత్తరాది నుంచి వీస్తున్న గాలులే కారణమని పేర్కొన్నారు. కాగా, శుక్రవారం ఉత్తర కోస్తాలో పలుచోట్ల ఉదయం సమయంలో పొగమంచు కురిసింది. రానున్న 48 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో వేడి వాతావరణం కొనసాగుతుందన్నారు. ఎండ తీవ్రత ప్రభావంతో వాతావరణ అనిశ్చితి నెలకొని, ఈ నెల 8న కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.