Share News

పౌల్ట్రీ పరిశ్రమకు వడదెబ్బ

ABN , Publish Date - May 22 , 2026 | 06:14 AM

పౌల్ట్రీ పరిశ్రమకు వేసవి దెబ్బ తగిలింది. ఎండ వేడికి తట్టుకోలేక ప్రతిరోజు లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు రోజులుగా సుమారు పది లక్షల కోళ్లు మృత్యువాత పడినట్లు పౌల్ర్టీ రైతులు చెబుతున్నారు.

పౌల్ట్రీ  పరిశ్రమకు వడదెబ్బ

  • రెండు రోజుల్లో పది లక్షల కోళ్లు మృత్యువాత

  • ఎండ తీవ్రతకు పడిపోయిన గుడ్ల ఉత్పత్తి

  • ఆందోళన చెందుతున్న నిర్వాహకులు

(తణుకు-ఆంధ్రజ్యోతి)

పౌల్ట్రీ పరిశ్రమకు వేసవి దెబ్బ తగిలింది. ఎండ వేడికి తట్టుకోలేక ప్రతిరోజు లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు రోజులుగా సుమారు పది లక్షల కోళ్లు మృత్యువాత పడినట్లు పౌల్ర్టీ రైతులు చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత కారణంగా భారీ సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా లేయర్‌ ఫారాల్లో వేడి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. గాలి వెళ్లే మార్గాలు లేకపోవడం, తాగునీటి కొరత, విద్యుత్‌ అంతరాయం కూడా కోళ్ల మరణాలకు కారణంగా భావిస్తున్నారు. వేసవిలో కోళ్లు బరువు తగ్గడం, మేత తినకపోవడం, గుడ్ల ఉత్పత్తి తగ్గడం తదితర కారణాలతో పరిశ్రమ నష్టాల బారిన పడిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కోళ్ల ఫారాల్లో సుమారు కోటీ 20 లక్షల కోళ్లు ఉన్నాయి. వాటిలో 90 లక్షల వరకు గుడ్డు ఉత్పత్తి అవుతుంది. ఎక్కువగా గుడ్లు ఉత్పత్తి చేసే కోళ్లు చనిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రత ప్రభావం బర్డ్‌ఫ్లూ కంటె ఎక్కువగా నష్టం కలిగిస్తోందని వాపోతున్నారు. చనిపోయిన కోళ్లను గొయ్యితీసి పాతిపెడుతున్నారు. కోళ్లకు బీమా చేయించుకునే పరిస్థితి ఉండేది. బీమా చేసే కంపెనీల ఆంక్షలు, భారీ ప్రీమియంతో రైతులు ఆసక్తి చూపడంలేదు. కోట్లు పెట్టుబడి పెట్టి బీమా చేయించినా అవసరమైనపుడు బీమా కంపెనీలు పలు కొర్రీలతో క్లెయిమ్‌ ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు.

వేసవిలో అదనపు ఖర్చు

వేసవిలో పౌల్ట్రీ నిర్వహణకు సాధారణ రోజులకంటే అదనపు ఖర్చు అవుతోంది. షెడ్డులకు చల్లని వాతావరణం కల్పించడానికి స్పింక్లర్లు, షెడ్డులపై గడ్డి, చల్లని నీరు, షెడ్డుల చుట్టు గోనె సంచుల ఏర్పాటు, వాటిని తడపడం, విద్యుత్‌, జనరేటర్‌లు, రిపేర్లకు అధిక మొత్తం వెచ్చించాల్సి వస్తోంది.


ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..

ఫారాల్లో ఎగ్జాస్ట్‌ ఫ్యాన్లు, కూలింగ్‌ ప్యాడ్లు ఏర్పాటు చేసుకోవాలి. పైకప్పులకు నీటిని చల్లడం ద్వారా ఉష్ణోగ్రతలు తగ్గించాలి. కోళ్లకు చల్లటి తాగునీరు ఎప్పటికప్పడు అందుబాటులో ఉంచాలి. ఎలాకోట్రలైట్సు, విటమిన్‌ సప్లిమెంట్స్‌ ఇవ్వాలి. మధ్యాహ్న వేళల్లో మేత తగ్గించి, ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే మేత వేయాలి. ఫారాల్లో గాలి ప్రసరణ మెరుగుపర్చాలి. విద్యుత్‌ అంతరాయం లేకుండా చూసుకోవాలి. జనరేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలి.

ప్రభుత్వం ఆదుకోవాలి

వేసవి తీవ్రతతో నష్టపోతున్న పౌల్ట్రీ రైతులకు ప్రభుత్వం ప్రత్యేక సాయం ప్రకటించాలి. విద్యుత్‌ రాయితీలు, మేత సబ్సిడీ, అత్యవసర వైద్య సేవలు అందించాలి. వేలాది కుటుంబాలు పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి.

- కొమాట్లపల్లి వెంకట సుబ్బారావు,

గోదావరి పౌలీ్ట్ర పెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు

Updated Date - May 22 , 2026 | 06:17 AM