Share News

‘గ్రోయర్‌’కు ఎండదెబ్బ

ABN , Publish Date - May 03 , 2026 | 04:45 AM

గ్రోయర్‌ (కోడి పిల్లలు)కు ఎండదెబ్బ తగులుతోంది. పౌల్ట్రీలలో ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేసి, రైతులు కోడి పిల్లలను పెంచుతారు. ఆ పిల్లలు 17 నెలల తర్వాత గుడ్లు పెట్టేందుకు తయారవుతాయి.

‘గ్రోయర్‌’కు ఎండదెబ్బ

  • వందల్లో మృత్యువాత పడుతున్న కోడి పిల్లలు

తణుకు, మే 2(ఆంరధజ్యోతి): గ్రోయర్‌ (కోడి పిల్లలు)కు ఎండదెబ్బ తగులుతోంది. పౌల్ట్రీలలో ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేసి, రైతులు కోడి పిల్లలను పెంచుతారు. ఆ పిల్లలు 17 నెలల తర్వాత గుడ్లు పెట్టేందుకు తయారవుతాయి. తర్వాత వాటిని పౌల్ట్రీ షెడ్లలోకి మారుస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లోని తణుకు, వేల్పూరు, కాల్దరి, వేలివెన్ను, తాడేపల్ల్లిగూడెం, ఉండ్రాజవరం, నిడదవోలు, బాదంపూడి తదితర చోట్ల పౌల్ట్రీలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో కోటి 30 లక్షల కోళ్లు ఉన్నాయి. 250 నుంచి 300 మంది వరకు రైతులు ఉన్నారు. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉండడం, నిర్వహణ లోపాల కారణంగా ప్రతిరోజూ వందల సంఖ్యలో కోడిపిల్లలు మృత్యువాత పడుతున్నాయి. రైతులకు భారీగా నష్టం వాటిల్లుతోంది. సాధారణంగా వేసవిలో పౌల్ట్రీ పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. గుడ్ల ఉత్పత్తి తగ్గడం, కోళ్లు మేత సరిగా తినకపోవడం, నీరు మాత్రమే తాగడం వంటి కారణాలు గుడ్ల ఉత్పత్తిపై ప్రభావం చూపుతాయి. వేసవిలో గుడ్లు పెట్టే కోళ్లు కూడా చనిపోతుంటాయి. దీన్ని తట్టుకోడానికి షెడ్లపై స్ర్పింకర్లు ఏర్పాటు చేసి, రెండు పూటలా నీరు స్ర్పే చేస్తూ.. ఎండ తగలకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.

పడిపోయిన కోడి పిల్లల బుకింగ్‌లు

సాధారణంగా ఉమ్మడి గోదావరి నెక్‌జోన్‌ పరిధిలో ఉన్న పౌల్ట్రీ పాపులేషన్‌ బట్టి గ్రోయర్‌ పిల్లల్ని రైతులు హేచరీల నుంచి బుక్‌ చేసుకుంటారు. సాధారణ రోజుల్లో నెలకు కనీసం ఎనిమిది లక్షల పిల్లలు బుక్‌ చేసుకునేవారు. ప్రస్తుత వేసవితో బుక్కింగ్‌లు ఐదారు లక్షలకు పడిపోయాయి.

Updated Date - May 03 , 2026 | 04:46 AM