ఆదర్శ గురువులు
ABN , Publish Date - Jun 25 , 2026 | 03:11 AM
నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం మద్దూరు మోడల్ ప్రాథమిక పాఠశాల విద్యాబోధనలోనే కాదు.. అభివృద్ధిలోనూ ప్రత్యేకత చాటుకుంటోంది.
బోధనలోనే కాదు.. పాఠశాల అభివృద్ధికీ చేయూత
పనిచేసే ప్రభుత్వ బడిలోనే ఉపాధ్యాయుల పిల్లలు
హెచ్‌ఎం సొంత నిధులు 3లక్షలతో పాఠశాల అభివృద్ధి
గోడలపై ఆకట్టుకునే చిత్రాలు, సూక్తులతో విద్యార్థుల్లో స్ఫూర్తి
ఇదీ మద్దూరు మోడల్ పాఠశాల ప్రత్యేకత
(చాగలమర్రి-ఆంధ్రజ్యోతి)
నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం మద్దూరు మోడల్ ప్రాథమిక పాఠశాల విద్యాబోధనలోనే కాదు.. అభివృద్ధిలోనూ ప్రత్యేకత చాటుకుంటోంది. ఇక్కడ ఒకటి నుంచి 5వ తరగతి వరకు 90 మంది విద్యార్థులు ఉండగా.. ఉపాధ్యాయులు ఏదో మొక్కుబడిగా విధులు నిర్వహించడం కాకుండా.. పాఠాల బోధన నుంచి సామాజిక అంశాల వరకు విద్యార్థులను ఆకట్టుకునేలా.. వినూత్న రీతి బోధన సాగిస్తున్నారు. ప్రధానంగా టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్‌తో బోధిస్తూ విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా తెలుగు అక్షరాలు, పదాలగౌను, అక్షరమాల, పదజాలంతో కూడిన షర్టు, లైబ్రరీ పుస్తకాలు రూపొందించారు. బోధన ఉపకరణాలపట్ల విద్యార్థులు ఆకర్షితులై పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. మరోవైపు పాఠశాల హెచ్‌ఎం రవీంద్రారెడ్డి రూ.3 లక్షలు సొంత నిధులతో పాఠశాల అభివృద్ధికి చేయూతనందించారు. ‘మనబడి-మన భవిష్యత్తు’ నిధులు విడుదల కాకపోయినా.. గత సంవత్సరం పాఠశాల ప్రహరీ నిర్మాణానికి రూ.30 వేలు, రంగులు, బొమ్మలు వేయడానికి రూ.50 వేలు, స్టేజి నిర్మాణానికి రూ.45 వేలు, స్పీకర్‌కు రూ.16 వేలు ఖర్చు చేసి ఆదర్శంగా నిలిచారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఉచితంగా గుర్తింపు కార్డులు తయారు చేయించారు. సొంత ఖర్చుతోనే పాఠశాలలో గదుల గోడలపై సూక్తులు, పలు పాఠ్యాంశాల పెయింటింగ్స్ వేయించారు. లెక్కలు, ఎక్కాలు, సైన్స్ చిత్రాలు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా ఉండడం గమనార్హం.
ఆదర్శం.. ఆచరణీయం
ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లలను వేలాది రూపాయలు ఫీజులు చెల్లించి ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చేర్పించి చదివించడం సర్వసాధారణం. కానీ.. మద్దూరు మోడల్ పాఠశాలలో పని చేస్తున్న ఎస్‌జీటీ సురేశ్‌బాబుతమ ఇద్దరు పిల్లలను(ఒకటి, ఐదో తరగతులు) అదే పాఠశాలలో చేర్పించారు. తెలుగు పండిట్ మాబు షరీఫ్ కూడా తన చిన్న కుమారుడు జునైద్‌ను ఇదే మోడల్ స్కూల్‌లో చేర్చి, మరో కుమారుడిని ఇదే ప్రాంగణంలోని మద్దూరు హైస్కూల్‌లో ఆరో తరగతిలో చేర్పించారు. ఇలా తాము బోధన చేసే ప్రభుత్వ పాఠశాలలోనే తమ పిల్లలను చేర్పించి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.

పాఠశాలలో గోడలపై విద్యార్థులను ఆలోచింపజేసే సూక్తులు.. ఆట సమయంలోనూ మననం చేసుకునేలా చిత్రాలు.. అన్నిటికీ మించి పాఠశాలలో టీచింగ్.. లెర్నింగ్ మెటీరియల్‌తో ఆకట్టుకునే బోధన.. సామాజిక అంశాలపై అవగాహన.. అంతేనా.. అక్కడ పనిచేసే పలువురు ఉపాధ్యాయులు సైతం తమ పిల్లలను అదే బడిలో చేర్చి ఆదర్శంగా నిలుస్తున్నారు! ఇక్కడి వరకు ఒకెత్తయితే.. ప్రభుత్వ నిధులు మంజూరు కాకపోయినా ప్రధానోపాధ్యాయుడు తన సొంత నిధులు 3 లక్షలు ఖర్చు చేసి.. పాఠశాల అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. ఇదీ నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం మద్దూరు మోడల్ ప్రాథమిక పాఠశాల ప్రత్యేకత!!
పాఠశాల అభివృద్ధే లక్ష్యం
పాఠశాల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నాం. మనబడి-మన భవిష్యత్తు పథకం నిధులు మంజూరు కాలేదు. విద్యార్థుల కోసం రూ.3 లక్షలు వరకు నేనే సొంతంగా ఖర్చు చేశాను. విద్యార్థులను ఆకట్టుకునేలా రంగులు వేయించి బొమ్మలతో విజ్ఞానాన్ని పెంచేలా కృషి చేస్తున్నా. ఇది పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు కూడా దోహదపడుతోంది. భవిష్యత్తులో విద్యార్థులను ఆకట్టుకునేలా మరెన్నో చేయాలని ప్లాన్ చేస్తున్నాం. తల్లిదండ్రులు కూడా ఆలోచించి అన్ని వసతులు, నాణ్యమైన బోధనా టీచర్లు ఉన్న ప్రభుత్వ పాఠశాలలకే పంపించాలని విజ్ఞప్తి చేస్తున్నా. - బి.రవీంద్రారెడ్డి, హెచ్‌ఎం