పరీక్ష కేంద్రంలోనే గుండెపోటు.. హెచ్‌ఎం మృతి
ABN , Publish Date - Mar 17 , 2026 | 05:50 AM
కర్నూలులో జరిగిన పదో తరగతి పబ్లిక్ పరీక్ష కేంద్రంలో అపశ్రుతి చోటుచేసుకుంది. కర్నూలు మండలం నిడ్జూరు ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న...
కర్నూలు ఎడ్యుకేషన్, మార్చి 16(ఆంధ్రజ్యోతి): కర్నూలులో జరిగిన పదో తరగతి పబ్లిక్ పరీక్ష కేంద్రంలో అపశ్రుతి చోటుచేసుకుంది. కర్నూలు మండలం నిడ్జూరు ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న షేక్ అన్వర్‌బాషా గుండెపోటుతో పరీక్ష కేంద్రంలోనే కుప్పకూలి మృతి చెందారు. మాధవనగర్ శ్రీచైతన్య ఇంగ్లీషు మీడియం పాఠశాలలోని పరీక్ష కేంద్రానికి ఆయన్ను చీఫ్ సూపరింటెండెంట్‌గా నియమించారు. సోమవారం ఉదయం విధి నిర్వహణలో ఉండగా గుండె నొప్పి వచ్చింది. సమీపంలోని అమ్మ హాస్పిటల్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయారు. అన్వర్ బాషా కర్నూలులోని అబ్బా్‌సనగర్‌లో నివసిస్తున్నారు. ఆయనకు భార్య హతియాబేగం, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య హతియాబేగం స్టాం టన్‌పురంలోని ప్రాథమిక ఉర్దూ పాఠశాలలో ఎస్‌జీటీగా పని చేస్తున్నారు. అన్వర్ బాషా మృతదేహాన్ని పరీక్షల విభాగం జిల్లా పరిశీలకులు అబ్రహం, జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.సుధాకర్, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు హృదయరాజు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఇస్మాయిల్, మరియానందం, ఏపీ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర నాయకులు ఓంకార్ యాదవ్, నారాయణ సందర్శించి నివాళులర్పించారు.