ఆయనదే పెత్తనం!
ABN , Publish Date - Feb 04 , 2026 | 01:09 AM
కలెక్టరేట్‌లో నెంబర్-3 అధికారి అంటేనే జిల్లా అధికారులు, కలెక్టరేట్‌లో పనిచేసే అధికారులు హడలిపోతున్నారు. జిల్లాలో అధికారులు, ఉద్యోగుల బదిలీల్లో ఆయన చెప్పిందే వేదం. కీలక విభాగం నుంచి నగదు డ్రా చేయడంలో సిద్ధహస్తుడు. జిల్లాస్థాయిలో పరిపాలనాపరమైన అంశాలలో తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ, జిల్లా అధికారులను సైతం పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు ఈయనపై బాహటంగానే వినిపిస్తున్నాయి. ఇక మండలస్థాయి, కలెక్టరేట్‌లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు బదిలీల ప్రక్రియ ప్రారంభమైతే ఈ అధికారికి పండుగేనని, ప్రతిపనికి ఒకరేటు నిర్ణయించి మరీ వసూలు చేస్తాడని చెప్పుకుంటున్నారు.
- కలెక్టరేట్‌లో నెంబర్-3 అధికారి హవా!
- అధికారులు, ఉద్యోగుల బదిలీల్లో ఆయన చెప్పిందే వేదం
- కీలక విభాగం నుంచి నగదు డ్రా చేయడంలో సిద్ధహస్తుడు!
- అనేక అంశాల్లో తీవ్ర అవినీతి ఆరోపణలు!
- తమపై తప్పుడు నివేదికలు ఇస్తున్నారంటూ వివిధ శాఖల జిల్లా అధికారుల గగ్గోలు
- ఈ అధికారి వేధింపులు భరించలేక సెలవుపై వెళ్లిన ఒక ఉద్యోగి
కలెక్టరేట్‌లో నెంబర్-3 అధికారి అంటేనే జిల్లా అధికారులు, కలెక్టరేట్‌లో పనిచేసే అధికారులు హడలిపోతున్నారు. జిల్లాలో అధికారులు, ఉద్యోగుల బదిలీల్లో ఆయన చెప్పిందే వేదం. కీలక విభాగం నుంచి నగదు డ్రా చేయడంలో సిద్ధహస్తుడు. జిల్లాస్థాయిలో పరిపాలనాపరమైన అంశాలలో తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ, జిల్లా అధికారులను సైతం పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు ఈయనపై బాహటంగానే వినిపిస్తున్నాయి. ఇక మండలస్థాయి, కలెక్టరేట్‌లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు బదిలీల ప్రక్రియ ప్రారంభమైతే ఈ అధికారికి పండుగేనని, ప్రతిపనికి ఒకరేటు నిర్ణయించి మరీ వసూలు చేస్తాడని చెప్పుకుంటున్నారు.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:
జిల్లాలోని కీలకమైన అంశాలన్నీ కలెక్టరేట్‌లో నెంబర్-3 అధికారి పరిశీలించిన తర్వాతనే పైఅధికారుల వద్దకు పంపాలి. దీన్ని అనుకూలంగా మలచుకున్న సదరు అధికారి పైఅధికారులను సైతం బురిడీ కొట్టించి తనదైన శైలిలో పరిపాలనను కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ అధికారి పనితీరుపై వివరాలు సేకరించి జిల్లా నుంచి బదిలీచేశారు. అయినా పైరవీలు చేసుకుని కలెక్టరేట్‌లోనే తిష్టవేయడం గమనార్హం.
కీలక నిర్ణయాల్లో ఈయనదే పైచేయి!
జిల్లా నుంచి ఒకసారి బదిలీపై వెళ్లి మళ్లీ తిరిగివచ్చిన ఈ అధికారి జిల్లాలో రెవెన్యూ, ఇతర విభాగాల్లో తీసుకునే పరిపాలనాపరమైన నిర్ణయాల్లో తనమాటే చెల్లుబాటు అయ్యేలా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. తహసీల్దార్‌లు, డిప్యూటీ తహసీల్దార్‌లు, ఇతర విభాగాలలో బదిలీలకు సంబంధించి ఈయన్ను ప్రసన్నం చేసుకున్నవారికి కీలక మండలాల్లో పోస్టింగ్‌లు వేయడం ఈ అధికారికి వెన్నతోపెట్టిన విద్య అని జిల్లాలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది చెప్పుకుంటున్నారు. తన చేతికి మట్టి అంటకుండా తనకు నమ్మకస్తులైన ఉద్యోగుల ద్వారా తెరవెనుక బేరసారాలు చక్కబెట్టేలా చక్రం తిప్పడంలో ఈ అధికారిని మించినవారు లేరని సమాచారం. జిల్లాలో ఇతర విభాగాల్లోనూ పరిపాలనాపరమైన అంశాలలో జోక్యం చేసుకుని వివిధ విభాగాల జిల్లాస్థాయి అధికారులపై తప్పుడు నివేదికలు ఇచ్చి, వారిని ఇబ్బందులపాలు చేస్తున్నాడనే ఆరోపణలు లేకపోలేదు.
వడ్డీ నగదు మాయం చేయడంలో దిట్ట!
జిల్లాకు సంబంధించి వివిధ పథకాల అమలు కోసం కోట్లాది రూపాయల నగదు కలెక్టరేట్‌కు వస్తుంది. ఈ నగదును వివిధ బ్యాంకుల్లో ఉంచుతారు. బ్యాంకుల్లో ఉన్న నగదుకు నెలనెలా లక్షలాది రూపాయలు వడ్డీ రూపంలో జమ అవుతుంది. వడ్డీ రూపంలో వచ్చిన నగదు వాడకంలో తనదైన శైలిలో లెక్కలు రాసి డ్రా చేయడంలో ఈ అధికారి పనితీరు అమోఘమని కలెక్టరేట్‌లో పనిచేసే అధికారులంతా చెప్పుకుంటున్నారు. ఇటీవల జిల్లాకు వచ్చిన ఒక అధికారి పలు ఫైళ్లను పరిశీలించి ఈ అంశంపై గట్టిగానే ప్రశ్నించినట్లు సమాచారం. కొంతకాలం పాటు మిన్నకుండిపోయిన ఈయన తనను ప్రశ్నించిన అధికారికంటే పైఅధికారితో మంచిగా ఉంటూ తప్పుడు లెక్కలు బయటకు రాకుండా తెరవెనుక చక్రం తిప్పాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కలెక్టరేట్‌లో పనిచేసే ఉద్యోగికి, ఈ నెంబర్-3 అధికారికి వాటాల్లో తేడాలు రావడంతో సంబంధిత ఉద్యోగి సెలవులో వెళ్లిపోవడం గమనార్హం.
అర్హత లేకున్నా పలువురికి అందలం!
జిల్లాలో 25 మండలాలు ఉండగా 10 మండలాలకు పైగా డిప్యూటీ తహసీల్దార్ హోదా ఉన్న అధికారులను అడ్డగోలుగా తహసీల్దార్‌లుగా నియమించడంలో ఈ అధికారి తనదైన శైలిలో వ్యవహరించాడనే ఆరోపణలున్నాయి. తమకు అన్యాయం జరిగిందని, సరిచేయాలని కొందరు డిప్యూటీ తహసీల్దార్‌లు ఈ అధికారి చుట్టూ తిరుగుతున్నా చూద్దాం, చేద్దామంటూ కాలయాపన చేయడం తప్ప సరిచేసింది లేదని డిప్యూటీ తహసీల్దార్‌లు వాపోతున్నారు. ఇటీవల డిప్యూటీ తహసీల్దార్‌లకు పదోన్నతి ఇవ్వాలని కోర్టు అదేశాలు జారీ చేసింది. తమకు పదోన్నతులు వస్తాయని డిప్యూటీ తహసీల్దార్‌లు ఆశించారు. కానీ కీలక సమయంలో ఈ అధికారి సెలవులో వెళ్లడంతో ఇన్‌చార్జి అధికారి ఈ ఫైలుపై సంతకం పెట్టేందుకు అవకాశం లేకపోవడంతో ఈప్రక్రియ నిలిచిపోయిందని డిప్యూటీ తహసీల్దార్‌లు అంటున్నారు. కీలక సమయంలో ఈ అధికారి కావాలని లేదా యాదృచ్చికంగా సెలవు పెట్టారో తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడు తున్నామని పదోన్నతిపై ఆశపెట్టుకున్న డిప్యూటీ తహసీల్దార్‌లు వాపోతున్నారు.
కీలక ఉద్యోగులను చెప్పుచేతల్లో పెట్టుకుని..
రెవెన్యూ విభాగానికి సంబంధించి కలెక్టరేట్, డివిజన్ స్థాయి యూనియన్ ప్రతినిధులు కలెక్టరేట్‌లోనే ఉంటున్నారు. వీరు వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తిగా వైసీపీ నాయకులకు అనుకూలంగా పనిచేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. డివిజన్ స్థాయి రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిఽధిగా ఉన్న ఒక ఉద్యోగి గతంలో మచిలీపట్నంలో గృహాలకు సంబంధించి దొంగపట్టాలు ఇవ్వడంలో కీలకపాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వ ఏర్పడిన తర్వాత ఈ ఉద్యోగిని అవనిగడ్డ నియోజకవర్గానికి బదిలీ చేశారు. యూనియన్ నాయకుడి పదవిని అడ్డుపెట్టుకుని ఈ ఉద్యోగి అవనిగడ్డకు వెళ్లకుండా నిత్యం కలెక్టరేట్‌లోనే ఉండిపోతున్నారు. ఆయన కలెక్టరేట్‌లో పనిచేస్తున్నారో, అవనిగడ్డలో పనిచేస్తున్నారో తెలియని పరిస్థితి. అసోసియేషన్‌కు చెందిన మరో ప్రతినిధిపైనా పలు ఆరోపణలున్నాయి. అసోసియేషన్ ప్రతినిధులను, కొందరు ఉద్యోగులను తన చెప్పుచేతల్లో పెట్టుకున్న నెంబర్-3 అధికారి తనదైన శైలిలో పరిపాలను కొనసాగిస్తుండటంతో కలెక్టరేట్‌లో ఏం జరుగుతుందోననే అంశంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. నెంబర్-3 అధికారి, ఆయన చెప్పుచేతల్లో పనిచేసే ఉద్యోగుల పనితీరుపై నిఘా ఉంచి, వారి దూకుడుకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉందని కలెక్టరేట్‌లో పనిచేసే అధికశాతం మంది ఉద్యోగులు బాహటంగానే చెప్పుకుంటున్నారు.