ఆయనంటే హడల్ !
ABN , Publish Date - Apr 06 , 2026 | 12:45 AM
ఆయన జిల్లాలోని ఓ కీలక రెవెన్యూ డివిజన్ కార్యాలయ అధికారి. పరిపాలనాపరమైన అంశాల్లో పూర్తిస్థాయిలో పట్టుంది. క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో కూడా ఆయనకు తెలుసు. అయినా కూడా అయినదానికి, కానిదానికి తన వద్ద పనిచేసే తహసీల్దార్లపై ఆయన తరచూ విరుచుకుపడుతున్నారు. కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు, ప్రజల ముందే తహసీల్దార్లకు చివాట్లు పెడుతున్నారు. పనిచేయడం రాదంటూ పరుష పదజాలంతో అవమానకరంగా మాట్లాడటంతో పాటు వారంలో సస్పెన్షన్ ఆర్డర్ చేతిలో పెడతానంటూ బెదిరింపులకు దిగుతున్నారు. రాత్రి పది గంటల వరకు కార్యాలయంలోనే అందరూ ఉండాలని హకుం జారీ చేయడంపై మహిళా ఉద్యోగులు కంటతడి పెడుతున్నారు. సదరు అధికారి తీరుతో తహసీల్దార్లు చిన్నబుచ్చుకుంటున్నారు.
- జిల్లాలోని ఓ రెవెన్యూ డివిజన్ కార్యాలయానికి రావాలంటేనే భయపడుతున్న అధికారులు
- సిబ్బంది, ప్రజల ముందే తహసీల్దార్లకు చివాట్లు
- వారంలో సస్పెన్షన్ ఆర్డర్ చేతిలో పెడతానంటూ బెదిరింపులు
- బుర్రలో గుజ్జులేదంటూ అవమానకరంగా వ్యాఖ్యలు
- మహిళా ఉద్యోగులతో సహా అందరికీ రాత్రి 10 గంటల వరకు డ్యూటీలు
- కంటతడి పెట్టుకుంటున్న మహిళా ఉద్యోగులు
- చిన్నబుచ్చుకుంటున్న తహసీల్దార్లు
ఆయన జిల్లాలోని ఓ కీలక రెవెన్యూ డివిజన్ కార్యాలయ అధికారి. పరిపాలనాపరమైన అంశాల్లో పూర్తిస్థాయిలో పట్టుంది. క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో కూడా ఆయనకు తెలుసు. అయినా కూడా అయినదానికి, కానిదానికి తన వద్ద పనిచేసే తహసీల్దార్లపై ఆయన తరచూ విరుచుకుపడుతున్నారు. కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు, ప్రజల ముందే తహసీల్దార్లకు చివాట్లు పెడుతున్నారు. పనిచేయడం రాదంటూ పరుష పదజాలంతో అవమానకరంగా మాట్లాడటంతో పాటు వారంలో సస్పెన్షన్ ఆర్డర్ చేతిలో పెడతానంటూ బెదిరింపులకు దిగుతున్నారు. రాత్రి పది గంటల వరకు కార్యాలయంలోనే అందరూ ఉండాలని హకుం జారీ చేయడంపై మహిళా ఉద్యోగులు కంటతడి పెడుతున్నారు. సదరు అధికారి తీరుతో తహసీల్దార్లు చిన్నబుచ్చుకుంటున్నారు.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో సాయంత్రం ఐదు లేదా ఆరు గంటలకు ఉద్యోగులంతా విధులు ముగించుకుని వెళ్లిపోతారు. కానీ జిల్లాలోని ఓ ప్రధాన రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో మాత్రం రాత్రి పూట 9, 10 గంటల వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. మహిళా ఉద్యోగులు సైతం ఆ సమయం వరకు ఉండి పనిచేయాల్సిందేనని అక్కడి రెవెన్యూ డివిజన్ కార్యాలయ అధికారి హుకుం జారీ చేసినట్టు సమాచారం. పనిచేయడానికి ఇబ్బంది లేదని, కానీ దానికి కూడా సమయం ఉంటుంది కదా అని ఉద్యోగులు కన్నీరు పెడుతున్నారు. కుటుంబంలో చిన్నపిల్లలు ఉన్న మహిళలు తాము ఇంటికి వచ్చేవరకు తమ పిల్లలను పక్కింటి వారికో, బంధువులకో అప్పగించాల్సినస్థితి ఏర్పడుతోందని మహిళా ఉద్యోగులు వాపోతున్నారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడేవారితోనూ రాత్రి 9, 10 గంటల వరకు పనిచేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పని ఒత్తిడితో ఉద్యోగులు మరింత అనారోగ్యం బారిన పడితే ఎవరు బాధ్యత వహిస్తారనే ప్రశ్నలు ఉద్యోగులు నుంచి వినిపిస్తున్నాయి.
సిబ్బంది ఎదుట అధికారులకు చీవాట్లు
ఇటీవల కాలంలో ఆయా మండలాల అధికారులను తన కార్యాలయానికి డివిజన్ స్థాయి అధికారి పిలిపిస్తున్నారు. ఏం పని ఉండి పిలుస్తున్నారోననే కారణంతో వారు తమ కార్యాలయంలోని పనులను పక్కనపెట్టి మరీ డివిజన్ కార్యాలయానికి వస్తున్నారు. తీరా వచ్చిన తర్వాత అక్కడ వారికి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయనే రెవెన్యూ అధికారులు చెప్పుకుంటున్నారు. కార్యాలయంలో పనిచేసే సిబ్బంది ఎదుటే తహసీల్దార్ స్థాయి అధికారులపై ఈ డివిజన్ స్థాయి అధికారి కోపంతో ఊగిపోతున్నాడనే విమర్శలు ఉన్నాయి. ఏదైనా సమస్య పరిష్కారంలో లోపాలుచెప్పే ప్రయత్నం చేస్తుంటే వినకుండా మీకేమీ తెలియదంటూ, మీకు పనిరాదంటూ చులకన భావంతో మాట్లాడుతుండటం గమనార్హం. ఈ నెల్లో పదవీ విరమణ చేసే ఓ తహసీల్దార్‌ను వారం రోజుల్లో సస్పెన్షన్ ఉత్తర్వులు నీ చేతిలో పెడతానని, అందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించడంతో సదరు తహసీల్దార్ మనస్థాపానికి గురైనట్లు ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. భూమికి సంబంధించిన ఆర్వోఆర్ విషయంలో గత సోమవారం ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం వచ్చింది. దీంతో ఇద్దరు రెవెన్యూ క్లినిక్‌కు వచ్చారు. ఈ విషయంపై సదరు తహసీల్దార్ వివరించే ప్రయత్నం చేయగా, నీకేం తెలియదని తనదైన శైలిలో ప్రజల ముందే అవమానకరంగా మాట్లాడటంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. మరో తహసీల్దార్‌ను నేను మీ మండలానికి తనిఖీ కోసం వస్తా, అప్పుడు ఏమైనా తప్పులు పట్టుకుంటే నీ సంగతి తేలుస్తా, నీ బుర్రలో గుజ్జులేదు పని సక్రమంగా చేయవంటూ శివాలెత్తిపోవడంతో ఈ విషయం రెవెన్యూవర్గాలలో తీవ్రచర్చకు దారి తీసింది. మరో మండల తహసీల్దార్ డివిజన్ కార్యాలయానికి వచ్చినా సదరు అధికారి డివిజన్ స్థాయి అధికారిని కలవకుండా వెళ్లిపోతుండటం గమనార్హం.
ఆ తహసీల్దార్‌ను సాగనంపుతారా!
ఇటీవల కాలంలో ఇదే డివిజన్‌లో ఓ మండల తహసీల్దార్ కార్యాలయానికి ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు వచ్చింది. ఈ కుటుంబంలోని సభ్యులు విదేశాల్లో ఉంటున్నారు. వారి రాకపోకల ఖర్చులు రూ.10లక్షల వరకు అవుతాయని లెక్కలుగట్టారు. ఈ రూ.10లక్షలు తహసీల్దార్ కార్యాలయంలో ఇచ్చి పని చేయించుకున్నట్టు తెలిసింది. ఈ విషయంలో కొంత ఇబ్బందులు పడటంతో ఎట్టకేలకు పనిచేయించుకున్న తర్వాత స్థానిక ఎమ్మెల్యేకు ఈ విషయం మొత్తం వివరించినట్లు సమాచారం. ఎమ్మెల్యే ఈ విషయంపై కలెక్టర్‌కు ఫోన్ చేసి మరీ తహసీల్దార్‌ను సాగనంపాలని చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వారం రోజుల్లో ఈ అంశంపై చర్యలు తీసుకుంటారని రెవెన్యూవర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.