అధికారులు పాలకుల్లా వ్యవహరిస్తున్నారు
ABN , Publish Date - Feb 05 , 2026 | 05:25 AM
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో పీజీటీల నియామకానికి సంబంధించి సింగల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేస్తామన్న హామీని అధికారులు ఉల్లంఘించడంపై హైకోర్టు తీవ్రంగా మండిపడింది.
ప్రజా సేవకులమనే విషయాన్ని మరిచిపోతున్నారు: హైకోర్టు
అమరావతి, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో పీజీటీల నియామకానికి సంబంధించి సింగల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేస్తామన్న హామీని అధికారులు ఉల్లంఘించడంపై హైకోర్టు తీవ్రంగా మండిపడింది. ‘‘కోర్టులు ఏం చేస్తాయిలే అనుకునే అధికారులను ఎవరూ కాపాడలేరు.’’ అని హెచ్చరించింది. కొందరు అధికారులు తాము ప్రజా సేవకులమనే విషయాన్ని మర్చిపోయి పాలకుల్లా వ్యవహరిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆదేశాలు అమలు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. తమ ఆదేశాలను దిగువస్థాయి అధికారులు పాటించలేదని చెబితే సరిపోదని, అలాంటి అధికారులపై తీసుకున్న చర్యలను కోర్టు ముందు ఉంచినప్పుడే ఉన్నతాధికారుల వివరణను పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టంచేసింది. సింగిల్ జడ్జి ఆదేశాల అమలుకు తీసుకున్న చర్యలను అఫిడవిట్ రూపంలో తమ ముందు ఉంచాలని సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావును ఆదేశించింది. మరోవైపు కేజీబీవీల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ధర్మాసనం తప్పుపట్టింది. తమ వాటా నిధులు విడుదల చేస్తే సరిపోతుందని కేంద్రం భావిస్తోందని, పథకం అమలు గురించి పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించింది. దీంతో పథకం ఉద్దేశం నెరవేరట్లేదని ఆక్షేపించింది. బాధ్యతల నుంచి ప్రభుత్వాలు తప్పుకున్నా, న్యాయస్థానాలు తప్పుకోవని తేల్చిచెప్పింది. విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ అవధానం హరిహరనాథశర్మతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. కేజీబీవీల్లో పార్ట్‌టైం పీజీటీలుగా పనిచేస్తున్న తమను అర్ధాంతరంగా తొలగించడాన్ని సవాల్ చస్తూ 2023లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు పిటిషనర్లను కొనసాగించాలని ఆదేశిస్తూ 2023, డిసెంబర్ 5న తీర్పు ఇచ్చారు.
ఈ తీర్పును సవాల్ చేస్తూ అధికారులు 2024, జనవరిలో ధర్మాసనం ముందు అప్పీల్ వేశారు. ఈ అప్పీల్ ఇటీవల ధర్మాసనం ముందు విచారణకు రాగా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ హామీ పూర్తిస్థాయిలో అమలుకాకపోవడంతో సర్వశిక్ష అభియాన్ పీడీ శ్రీనివాసరావుపై సుమోటోగా కోర్టుధిక్కరణ చర్యలు ప్రారంభించింది. బుధవారం విచారణ ప్రారంభమైన వెంటనే... సింగిల్ జడ్జి ఆదేశాలు, ధర్మాసనానికి ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయలేదని శ్రీనివాసరావును కోర్టు ప్రశ్నించింది. కింది స్థాయి అధికారులు అమలు చేయలేదని, వారికి నోటీసులు ఇచ్చానని శ్రీనివాసరావు సమాధానం ఇచ్చారు. నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారా? అని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.