ఆర్టీసీ గ్రేడ్-2 మెకానిక్‌లకు ఉపశమనం
ABN , Publish Date - Feb 08 , 2026 | 04:42 AM
ఆర్టీసీలో 12 ఏళ్ల సర్వీసు పూర్తిచేసిన గ్రేడ్-2 మెకానిక్‌లు లీడ్ హ్యాండ్ స్కేల్‌కు అర్హులు కాదంటూ ప్రజా రవాణాశాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధించింది.
లీడ్ హ్యాండ్ స్కేల్‌కు అర్హులు కాదంటూ ఇచ్చిన నోటిఫికేషన్‌పై స్టే
మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు
అమరావతి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీలో 12 ఏళ్ల సర్వీసు పూర్తిచేసిన గ్రేడ్-2 మెకానిక్‌లు లీడ్ హ్యాండ్ స్కేల్‌కు అర్హులు కాదంటూ ప్రజా రవాణాశాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు పిటిషనర్ల జీతాల నుంచి సొమ్ము రికవరీ చేయవద్దని అధికారులకు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డి. రమేశ్ ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఏఏఎస్ కింద లీడ్ హ్యాండ్ స్కేల్‌కు తమను అనర్హులుగా ప్రకటిస్తూ గతేడాది డిసెంబరు 23న ప్రజా రవాణాశాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(అడ్మిన్) జారీచేసిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ ఏపీఎ్‌సఆర్టీసీ ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు చిత్తూరు జిల్లాలోని వివిధ డిపోల్లో గ్రేట్-2 మెకానిక్‌లుగా పనిచేస్తున్న పలువురు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. సదరు నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరారు. వీరి తరఫున న్యాయవాది వేగి మురళీ కృష్ణారావు వాదనలు వినిపించారు. ఆర్టీసీ తరఫు స్టాండింగ్ కౌన్సిల్ వాదనలు వినిపిస్తూ... ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇచ్చిన నోటిఫికేషన్‌పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.