Share News

ఆ మార్గదర్శకాలపై పోలీసులు, మేజిస్ట్రేట్‌లకు శిక్షణ ఇప్పించండి

ABN , Publish Date - Feb 05 , 2026 | 05:12 AM

ఏడేళ్లలోపు శిక్షకు వీలున్న కేసుల్లో సైతం నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నారని, మేజిస్ట్రేట్‌లు వారికి యాంత్రికంగా రిమాండ్‌ విధిస్తున్నారని...

ఆ మార్గదర్శకాలపై పోలీసులు, మేజిస్ట్రేట్‌లకు శిక్షణ ఇప్పించండి

  • ఏడేళ్లలోపు శిక్షకు వీలున్న కేసుల అంశంపై హైకోర్టులో పిల్‌

  • న్యాయవాది శివప్రసాద్‌రెడ్డి వైఖరిపై ధర్మాసనం మండిపాటు

  • దూకుడు తగ్గించుకోవాలని హితవు.. పిల్‌ కొట్టివేత

అమరావతి, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): ఏడేళ్లలోపు శిక్షకు వీలున్న కేసుల్లో సైతం నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నారని, మేజిస్ట్రేట్‌లు వారికి యాంత్రికంగా రిమాండ్‌ విధిస్తున్నారని, అర్నేష్‌కుమార్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలపై పోలీసులకు, మేజిస్ట్రేట్‌లకు శిక్షణ ఇప్పించాలని దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టివేసింది. బుధవారం పిల్‌పై విచారణ ప్రారంభమైన వెంటనే ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థన మేరకు కౌంటర్‌ వేసేందుకు మరికొంత సమయం ఇస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. ఈ దశలో పిటిషనర్‌ తరఫు న్యాయవాది గుండాల శివప్రసాద్‌ రెడ్డి అనుచితంగా ప్రవర్తించారు. దీంతో ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కోర్టు విచారణలకు అవరోధం కలిగిస్తే చర్యలకు ఆదేశిస్తామని హెచ్చరించింది. దూకుడు తగ్గించుకోవాలని హితవు పలికింది. న్యాయవాది వైఖరితో విసుగెత్తిన ధర్మాసనం పిల్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. తమ ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలని తేల్చిచెప్పింది. బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. న్యాయవాది పామర్తి రత్నాకర్‌ హైకోర్టులో ఈ పిల్‌ దాఖలు చేశారు.

Updated Date - Feb 05 , 2026 | 05:12 AM