Share News

కోర్టు హాలులోకి ప్రవేశించి నిందితుడిని అరెస్ట్‌ చేయడం ఏంటి?

ABN , Publish Date - Jan 28 , 2026 | 05:03 AM

మేజిస్ట్రేట్‌ అనుమతి లేకుండా కోర్టు హాలులోకి ప్రవేశించి నిందితుడిని అరెస్ట్‌ చేసిన వ్యవహారంలో పోలీసుల వైఖరిని హైకోర్టు తప్పుపట్టింది.

కోర్టు హాలులోకి ప్రవేశించి నిందితుడిని అరెస్ట్‌ చేయడం ఏంటి?

  • ఇలాంటి చర్యలను అనుమతిస్తే రేపటి రోజున ఏదైనా చేస్తారు

  • పత్తికొండ కోర్టు ఘటనలో పోలీసుల తీరును తప్పుపట్టిన హైకోర్టు

  • బాధ్యులకు నోటీసులు.. విచారణ వాయిదా

అమరావతి, జనవరి 27(ఆంధ్రజ్యోతి): మేజిస్ట్రేట్‌ అనుమతి లేకుండా కోర్టు హాలులోకి ప్రవేశించి నిందితుడిని అరెస్ట్‌ చేసిన వ్యవహారంలో పోలీసుల వైఖరిని హైకోర్టు తప్పుపట్టింది. పత్తికొండ కోర్టు మేజిస్ట్రేట్‌ అనుమతి తీసుకోకుండా కోర్టు హాలులో ఉన్న నిందితుడిని అరెస్ట్‌ చేయడం ఏంటని ప్రశ్నించింది. హైకోర్టు రిజిస్ట్రార్‌ అనుమతి లేకుండా హైకోర్టులోని నిందితులను కూడా ఇలానే అరెస్ట్‌ చేస్తారా? అని నిలదీసింది. ఇలాంటి చర్యలను అనుమతిస్తే... రేపటి రోజున ఏదైనా చేస్తారని వ్యాఖ్యానించింది. బాధ్యులైన పోలీసులను ఆ స్టేషన్‌ నుంచి మరో చోటుకి మార్చారా? వారిపై ఏం చర్యలు తీసుకున్నారు? అని ఆరా తీసింది. ప్రతివాదులుగా ఉన్న చిప్పగిరి ఎస్‌ఐ బి.సతీ్‌షకుమార్‌, పత్తికొండ ఎస్‌ఐ ఆర్‌.విజయ్‌కుమార్‌ నాయక్‌, కానిస్టేబుళ్లు షబ్బీర్‌, రామోజీలకు వ్యక్తిగత హోదాలో నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ వై.లక్ష్మణరావు మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు.


అసలు ఏం జరిగింది?

కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం డేగులపాడు గ్రామానికి చెందిన శివయ్య గంజాయి సాగు చేస్తున్నాడనే ఆరోపణలతో చిప్పగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. తన న్యాయవాది ద్వారా సరెండర్‌ పిటిషన్‌ వేసిన శివయ్య లొంగిపోయేందుకు గతే డిసెంబరు 24న పత్తికొండ కోర్టుకు రాగా.. మఫ్టీలో ఉన్న చిప్పగిరి ఎస్‌ఐ సతీ్‌షకుమార్‌, పత్తికొండ ఎస్‌ఐ విజయ్‌కుమార్‌, కానిస్టేబుళ్లు షబీర్‌, రామోజీలు ఆయన్ను అరెస్ట్‌ చేశారు. మేజిస్ట్రేట్‌ అనుమతి లేకుండా కోర్టు హాలులోకి ప్రవేశించి.. నిందితుడు శివయ్యను అరెస్ట్‌ చేసిన పోలీసులపై చర్యలు తీసుకొనేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పత్తికొండ న్యాయవాదుల సంఘం జనరల్‌ సెక్రటరీ జి.భాస్కర్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు రాగా, పిటిషనర్‌ తరఫున న్యాయవాది కేవీ రఘువీర్‌ వాదనలు వినిపిస్తూ.. కోర్టు హాలులోకి ప్రవేశించి, నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి వినతిపత్రం అందజేసినా ఎలాంటి స్పందన లే దని పేర్కొన్నారు. ఘటనపై జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ లేదా జిల్లా జడ్జి సూచించిన అధికారి లేదా ఏదైనా స్వతంత్ర సంస్థతో విచారణకు ఆదేశించాలని కోరారు.

ఆ సమయంలో మేజిస్ట్రేట్‌ కోర్టులో లేరు..

హోంశాఖ తరఫున సహాయ ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పోలీసులు ఉద్దేశపూర్వకంగా కోర్టు హాలులోకి వెళ్లలేదన్నారు. సరెండర్‌ పిటిషన్‌ గురించి వారికి అవగాహన లేదన్నారు. పిటిషనర్‌ కోర్టు హాలులోకి పరిగెత్తాడని వివరించారు. మేజిస్ట్రేట్‌ కోర్టు నిర్వహించడం లేదని, కోర్టులో లేరని తెలిసిన తర్వాతే పోలీసులు లోపలికి వెళ్లారని పేర్కొన్నారు. కోర్టు హాలులోకి ప్రవేశించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని పత్తికొండ మేజిస్ట్రేట్‌ ఎస్పీని ఆదేశించారని తెలిపారు. జిల్లా ఎస్పీ సంబంధిత పోలీసులకు ఛార్జ్‌మెమోలు ఇచ్చి, వారి నుంచి వివరణ కోరారన్నారు. పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచేందుకు సమయం ఇవ్వాలని కోరారు.

Updated Date - Jan 28 , 2026 | 05:04 AM