ఏసీ రూముల్లో కూర్చొని నిర్ణయాలు!
ABN , Publish Date - Jan 24 , 2026 | 05:19 AM
మాంసం, చేపల దుకాణాల కేటాయింపునకు ఈ-వేలం నిర్వహించడంపై హైకోర్టు శుక్రవారం మండిపడింది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు పరిగణనలోకి తీసుకోకుండా...
మాంసం, చేపల దుకాణాల కేటాయింపునకు ఈ-వేలమా?
విజయవాడ కార్పొరేషన్ అధికారులపై హైకోర్టు ఆగ్రహం
నోటిఫికేషన్ నిలుపుదల.. విచారణ మార్చి 3కి వాయిదా
అమరావతి, జనవరి 23(ఆంధ్రజ్యోతి): మాంసం, చేపల దుకాణాల కేటాయింపునకు ఈ-వేలం నిర్వహించడంపై హైకోర్టు శుక్రవారం మండిపడింది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు పరిగణనలోకి తీసుకోకుండా, అధికారులు ఏసీ గదుల్లో కూర్చొని నిర్ణయాలు తీసుకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసింది. మాంసం, చేపల దుకాణాలు నిర్వహించే వారికి కంప్యూటర్ ఎలా పనిచేస్తుందో కూడా అవగాహన ఉండదని పేర్కొంది. వేలంలో పాల్గొనేందుకు పలు పత్రాలు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని, అలాంటివారు ఈ వేలంలో ఎలా పాల్గొంటారని ప్రశ్నించింది. అలాగే ఈ-వేలం టెండర్‌ను తెలుగు పత్రికల్లో ఇంగ్లి్‌ష్‌లో ప్రచురించడంపైనా న్యాయస్థానం విస్మయం వ్యక్తం చేసింది. చిరువ్యాపారాల విషయంలో సాంప్రదాయ టెండర్ విధానాన్ని అనుసరిస్తే, మరింత మంది వేలంలో పాల్గొనేందుకు వెసులుబాటు ఉంటుందని వ్యాఖ్యానించింది. విజయవాడలోని మహంతి మార్కెట్‌లో మాంసం, చేపల దుకాణాల కేటాయింపు కోసం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఈ నెల 6న ఇచ్చిన ఈ-వేలం నోటిఫికేషన్‌ను సస్పెండ్ చేసింది. తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 3కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు. విజయవాడలోని మహంతి మార్కెట్‌లో మాంసం, చేపల దుకాణాల కేటాయింపు కోసం అధికారులు ఈ-వేలం నోటిఫికేషన్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ శంకరరావు అనే చేపల వ్యాపారి పిటిషన్ వేశారు. ఈ-వేలం గురించి ప్రచారం నిర్వహించలేదని, తెలుగు పత్రికల్లో సైతం ఆంగ్లంలో ప్రకటన ఇచ్చారని వివరించారు. విజయవాడ కార్పొరేషన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.... ఈ-వేలంపై షాపు యజమానులకు అవగాహన కల్పించామన్నారు.
మండలి చైర్మన్ మోషేన్ రాజుపై కోర్టు ధిక్కరణ వ్యాజ్యం విచారణ వచ్చే నెల 13కి వాయిదా
ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ తాను ఇచ్చిన రాజీనామా లేఖపై 4 వారాల్లో నిర్ణయం వెల్లడించాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలను శాసనమండలి చైర్మన్ మోషేన్‌రాజు ఉల్లంఘించారంటూ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ హైకోర్టులో కోర్టుఽ దిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. వెంకటరమణ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... రాజీనామా లేఖపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఇచ్చిన ఆదేశాలపై మోషేన్‌రాజు దాఖలు చేసిన అప్పీల్ సీజే ధర్మాసనం ముందు ఫిబ్రవరి 12న విచారణకు ఉందన్నారు. దీంతో అప్పీల్ పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో విచారణను ఫిబ్రవరి 13వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ ప్రకటించారు.