బోర్డు తిప్పేసిన ‘హార్వెంచర్ ఇన్‌ఫ్రా’
ABN , Publish Date - Oct 05 , 2026 | 06:44 AM
మా ఇన్‌ఫ్రా కంపెనీలో లక్ష రూపాయలు డిపాజిట్ చేయండి. రోజుకు రూ.444 చొప్పున 500 రోజులపాటు తిరిగి చెల్లిస్తాం’ అంటూ ఆశపెట్టాడు.
బోర్డు తిప్పేసిన ‘హార్వెంచర్ ఇన్‌ఫ్రా’
లాభాల ఆశ చూపించి లక్షల్లో డిపాజిట్ల సేకరణ
ఆకస్మికంగా చెల్లింపులు నిలిపేసి అజ్ఞాతంలోకి
ఉత్తరాంధ్ర జిల్లాల్లో వేల మంది బాధితులు
గాజువాక పోలీసుల అదుపులో ఇన్‌ఫ్రా ఎండీ
విశాఖపట్నం, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): ‘మా ఇన్‌ఫ్రా కంపెనీలో లక్ష రూపాయలు డిపాజిట్ చేయండి. రోజుకు రూ.444 చొప్పున 500 రోజులపాటు తిరిగి చెల్లిస్తాం’ అంటూ ఆశపెట్టాడు. మొదట్లో ప్రజలకు నమ్మకం కలిగించేందుకు సక్రమంగా చెల్లింపులు చేస్తూ అదే స్థాయిలో ప్రచారం చేసుకున్నాడు. నిజమేనని నమ్మిన అమాయకులు అప్పులుచేసి మరీ పెట్టుబడులు పెట్టారు. అయితే ఒక్కసారిగా చెల్లింపులు నిలిపేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో కేసులు నమోదుకాగా తాజాగా గాజువాక, పీఎంపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు అందాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన పడాల సోమశేఖర్ చాలాఏళ్ల కిందట విశాఖ నగరానికి వలస వచ్చి గాజువాకలో నివాసం ఉంటున్నాడు. ఎనిమిదేళ్ల కిందట ‘హార్వెంచర్ ఇన్‌ఫ్రా’ పేరుతో మర్రిపాలెంలో ఒక కార్యాలయాన్ని ప్రారంభించాడు. తనను తాను ఎండీగా ప్రకటించుకున్నాడు. రియల్‌ఎస్టేట్ వ్యాపారం పేరుతో ఆకర్షణీయంగా బ్రోచర్లు ముద్రించి ప్రచారం చేశాడు. తమ ఇన్‌ఫ్రా కంపెనీలోపెట్టుబడి పెడితే.. తక్కువ కాలంలోనే అధిక లాభాలు ఇస్తామని నమ్మబలికాడు. రూ.లక్ష డిపాజిట్ చేస్తే.. రోజుకు రూ.444 చొప్పున 500 రోజులపాటు చెల్లిస్తానని, నెలవారీ ఆదాయం కావాలనుకునే వారికి రూ.లక్ష పెట్టుబడి పెడితే నెలకు రూ.15 వేల చొప్పున ఏడాదిపాటు చెల్లిస్తానని చెప్పాడు. ఆరంభంలో పెట్టుబడులు/ డిపాజిట్లు చేసిన వారికి సక్రమంగానే చెల్లింపులు జరపడంతో వారి ద్వారా మరికొందరు పెట్టుబడులు పెట్టారు. సోమశేఖర్ కొద్ది రోజుల్లోనే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా బ్రాంచీలను ప్రారంభించి డిపాజిట్లు సేకరించడం మొదలుపెట్టాడు.
అయితే కొన్ని వారాల తరువాత నుంచి డిపాజిటర్లకు చెల్లింపులు ఆపేశాడు. బాధితులు ఆయా కార్యాలయాలకు వెళ్లి నిలదీయడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. బాధితులకు దిక్కుతోచని స్థితిలో పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. విజయనగరం జిల్లాలో కొందరు బాధితులు అక్కడి ఎస్పీని కలిసి సోమశేఖర్‌పై ఫిర్యాదుచేయడంతో ఆయన ఆదేశాల మేరకు పోలీసులు చర్యలకు ఉపక్రమించినట్టు తెలిసింది. మరోవైపు గాజువాకలో హంసాదేవి అనే బాధితురాలు తాను రూ.1.5 లక్షలు పెడితే ఆరు నెలల్లో రూ.3 లక్షలు ఇస్తానని చెప్పి మోసం చేశాడంటూ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పీఎంపాలెంలో ఐదారుగురు బాధితులు ఫిర్యాదుచేయడంతో రెండుచోట్లా కేసులు నమోదయయ్యాయి. ఇదిలావుండగా కేసు దర్యాప్తు ప్రారంభించిన గాజువాక పోలీసులు.. సోమశేఖర్ ఆచూకీని కొనుగొని ఆదివారం అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. దీనిపై గాజువాక పోలీసులను వివరణ కోరగా... కేసు నమోదు చేసినమాట వాస్తవమేనని, దర్యాప్తు కొనసాగుతున్నందున వివరాలను వెల్లడించడానికి మరికొంత సమయం పడుతుందని చెప్పారు.