వివాదాలకు నిలయం.. హరికృష్ణ ట్రావెల్స్
ABN , Publish Date - Mar 27 , 2026 | 05:22 AM
నెల్లూరు జిల్లాలో కలిగిరి కేంద్రంగా నిర్వహిస్తున్న హరికృష్ణ ట్రావెల్స్ వివాదాలకు నిలయంగా మారింది. ఈ ట్రావెల్స్ యజమాని పాపన హరికృష్ణారెడ్డి స్వగ్రామం కలిగిరి పంచాయతీలోని జిర్రావారిపాలెం.
ఇతర రాష్ట్రాల బస్సులు సెకండ్ హ్యాండ్‌లో కొనుగోలు
తరచూ మరమ్మతులకు గురవుతున్న వైనం
గతంలో వీళ్ల బస్సులోనే మహిళపై డ్రైవర్ అత్యాచారం
కలిగిరి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లాలో కలిగిరి కేంద్రంగా నిర్వహిస్తున్న హరికృష్ణ ట్రావెల్స్ వివాదాలకు నిలయంగా మారింది. ఈ ట్రావెల్స్ యజమాని పాపన హరికృష్ణారెడ్డి స్వగ్రామం కలిగిరి పంచాయతీలోని జిర్రావారిపాలెం. వ్యవసాయంతో పాటు నాలుగైదేళ్ల క్రితం లారీ ట్రాన్స్‌పోర్ట్ నుంచి ఆయన ట్రావెల్స్ బస్సులు నడపడం ప్రారంభించారు. ఆయనకు మొత్తం 14 బస్సులు ఉండగా అవి కలిగిరి, వింజమూరు, పామూరు కేంద్రాలుగా నిత్యం హైదరాబాద్‌కు తిరుగుతూ ఉంటాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన బస్సులు కావడం, సెకండ్ హ్యాండ్‌లో తీసుకోవడం వల్ల తరచూ మరమ్మతులకు గురవుతుంటాయి. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఈ ట్రావెల్స్ బస్సులోనే ఓ మహిళపై డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటనపై అప్పట్లో కేసు కూడా నమోదైంది. కాగా, గురువారం ఉదయం బస్సు ప్రమాదం జరిగిన వెంటనే కలిగిరిలో ఉన్న హరికృష్ణ ట్రావెల్స్ కార్యాలయం మూతపడింది. ప్రమాదంపై సమాచారం తెలుసుకోవాలని కార్యాలయం వద్దకు వచ్చిన అధికారులకు, మీడియా ప్రతినిధులకు సమాచారం ఇచ్చేవారు కరువయ్యారు.
తొమ్మిదేళ్లుగా ఒక్క చలానా లేదు
హరికృష్ణ ట్రావెల్స్ బస్సును ఇంతవరకు రవాణా శాఖ అధికారులు తనిఖీ చేసిన దాఖలాలు లేవు. 2017 మార్చి 31న అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్ అయిన ఈ బస్సు యార్లగడ్డ కోటేశ్వరరావు పేరుతో ఉంది. ఆయనది కృష్ణా జిల్లా కొమరోలు. బస్సులో 34 సీట్లు, 18 బెర్తులకు అనుమతి ఉంది. ఈ బస్సు నిబంధనలకు విరుద్ధంగా తొమ్మిదేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతుంటే ఒక్క చలానా కూడా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
