Share News

హంద్రీ - నీవాకు52 టీఎంసీలు

ABN , Publish Date - Mar 24 , 2026 | 04:39 AM

‘రాయలసీమ పల్లెల్లో కరువు, వలసలను నివారించాలంటే చెరువులు, జలాశయాలు నింపాలి. హంద్రీ-నీవా కాలువ ద్వారా ఈ ఏడాది 50 టీఎంసీలకు పైగా ఎత్తిపోసి సీమ పల్లెలను సస్యశ్యామలం చేయాలి.

హంద్రీ - నీవాకు52 టీఎంసీలు

  • 250 రోజుల్లోనే రికార్డు స్థాయిలో కృష్ణా జలాల ఎత్తిపోత

  • ఫలించిన సీఎం చంద్రబాబు సంకల్పం

  • నిండుకుండలా జలాశయాలు, చెరువులు

  • అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య

  • చిత్తూరు జిల్లాల్లో పెరిగిన భూగర్భ జలాలు

  • ఈ ఏడాది పెరిగిన సాగు విస్తీర్ణం

  • (కర్నూలు-ఆంధ్రజ్యోతి)

‘రాయలసీమ పల్లెల్లో కరువు, వలసలను నివారించాలంటే చెరువులు, జలాశయాలు నింపాలి. హంద్రీ-నీవా కాలువ ద్వారా ఈ ఏడాది 50 టీఎంసీలకు పైగా ఎత్తిపోసి సీమ పల్లెలను సస్యశ్యామలం చేయాలి. ఆ దిశగా ఇంజనీర్లు సమష్టిగా ముందుకెళ్లాలి’.. 2025 జూలై 17న నంద్యాల జిల్లా మాల్యాల వద్ద హంద్రీ-నీవా పంపులు ఆన్‌ చేస్తూ సీఎం చంద్రబాబు చెప్పిన మాటలివి. ముఖ్యమంత్రి సంకల్పం కేవలం 240 రోజుల్లోనే నెరవేరింది. సోమవారం నాటికి 250 రోజుల్లో 52.023 టీఎంసీల కృష్ణా జలాలు ఎత్తిపోసి రికార్డు నమోదు చేశారు. ఇంజనీర్లు రికార్డు స్థాయిలో కాలువ విస్తరణ పనులు పూర్తి చేసి ఈ దిశగా కృషి వేశారు. హంద్రీ-నీవా కాలువ ద్వారా సీమ జలాశయాలు, చెరువులు నింపారు. అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు కృష్ణా జలాలు చేరుకున్నాయి. భూగర్భ జలాలు పెరిగి సాగు విస్తీర్ణం పెరిగింది. సోమవారం హంద్రీనీవా ప్రాజెక్టుకు కృష్ణా జలాల ఎత్తిపోతలు నిలిపేశారు. శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ 834.60 అడుగుల్లో 54.548 టీఎంసీలకు పడిపోయింది. దీంతో నంద్యాల జిల్లా నందికొట్కూరు మం డలం మాల్యాల సమీపంలోని హంద్రీనీవా పంపింగ్‌ స్టేషన్‌ (పీఎస్‌)-1 వద్ద 12 పంపులు ఆపేశారు.

Untitled-4 copy.jpg


కూటమి వచ్చాక ప్రత్యేక దృష్టి

సీఎం చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక హంద్రీ-నీవా కాలువ విస్తరణ పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. రూ.3,800 కోట్లతో నంద్యాల జిల్లా మాల్యాల నుంచి చిత్తూరు జిల్లా కుప్పం వరకు ప్రధాన కాలువ, పుంగనూరు, కుప్పం బ్రాంచ్‌ కాలువల విస్తరణ, సీసీ లైనింగ్‌ పనులకు శ్రీకారం చుట్టారు. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేశారు. గత ఏడాది జూలై 17న సీఎం చంద్రబాబు మాల్యాల వద్ద హంద్రీ-నీవా పంపులు ఆన్‌ చేసి కృష్ణా జలాల ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టారు. 2019-20లో 260 రోజుల్లో 40.01 టీఎంసీలు ఎత్తిపోస్తే.. ఈ ఏడాది కేవలం 250 రోజుల్లోనే 52.023 టీఎంసీలు ఎత్తిపోసి సరికొత్త రికార్డు నమోదు చేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాలకు 9.777 టీఎంసీల జలాలు కేటాయించగా, మిగిలిన 42.246 టీఎంసీలు అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని వివిధ జలాశయాలు, చెరువులు, బ్రాంచ్‌ కెనాల్స్‌ ద్వారా రైతులకు అందించారు. హంద్రీ-నీవా ప్రాజెక్టు ద్వారా 250 రోజుల్లో 52.023 టీఎంసీల కృష్ణా జలాలు ఎత్తిపోయడం ప్రాజెక్టు చరిత్రలో సరికొత్త రికార్డు అని ఆ ప్రాజెక్టు ఈఈ ప్రసాద్‌ రావు ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. ప్రధాన కాలువ కింద రెండో దశలో 299 చెరువులు నింపారు. అనంతపురం జిల్లాలోనే ఫేజ్‌-1 కింద 17 చెరువులు, ఫేజ్‌-2 కింద 25 చెరువులు కృష్ణా జలాలతో నింపారు. శ్రీసత్యసాయి జిల్లాలో ఫేజ్‌-2 కింద 159 చెరువులు నింపినట్లు ఇంజనీర్లు తెలిపారు. భూగర్భ జలాలు పెరగడంతో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో బోరుబావులు, చెరువుల కింద ఉద్యాన, వరి వంటి ధాన్యం పంటలు సాగు చేస్తున్నారు.


ఎన్టీఆర్‌ పునాది రాయి

శ్రీశైలం ఎగువన మాల్యాల నుంచి 40 టీఎంసీల కృష్ణా జలాలు ఎత్తిపోసి ఉమ్మడి కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో సాగు, తాగునీరు అందించాలని మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ సంకల్పించారు. ఈ మేరకు హంద్రీ-నీవా ప్రాజెక్టుకు పునాది రాయి వేశారు. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులుగా చంద్రబాబు, వైఎస్‌ రాజశేఖర రెడ్డి కూడా హంద్రీ-నీవా కాలువ పనులు శరవేగంగా జరగడానికి కృషి చేశారు. 2012-13లో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి హయాంలో తొలిసారిగా ట్రయల్‌ రన్‌ చేసి 2.95 టీఎంసీలు ఎత్తిపోశారు. 2013-14 నుంచి హంద్రీ-నీవా కాలువ ద్వారా కృష్ణా జలాలు ఎత్తిపోసి సీమ జిల్లాలకు అందిస్తున్నారు. అయితే 3,850 క్యూసెక్కులు ఎత్తిపోయాల్సి ఉండగా.. 2 వేల క్యూసెక్కులు కూడా ఎత్తిపోయలేని పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత 3,850 క్యూసెక్కులు ఎత్తిపోయడమే లక్ష్యంగా అప్పటి సీఎం చంద్రబాబు కాలువ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. అయితే 2019లో అధికారం చేపట్టిన వైసీపీ విస్తరణ పనులను ఆపేసింది. గతేడాది కూటమి ప్రభుత్వం రావడంతో పనుల్లో వేగం పెంచారు.

ఇంజనీర్ల సంబరాలు

హంద్రీ-నీవా ప్రాజెక్టు ప్రారంభం తర్వాత తొలిసారిగా 50 టీఎంసీలకు పైగా ఎత్తిపోసి రికార్డు నమోదు చేయడంతో ఇటీవల ఇంజనీర్ల్చు సంబరాలు చేసుకున్నారు. హంద్రీ-నీవా కర్నూలు సర్కిల్‌-1 ఎస్‌ఈ రాజన్‌ బాబు, ఈఈలు ప్రసాదరావు, చంద్రశేఖర్‌ రెడ్డి, గుణాకర్‌ రెడ్డి, డీఈ చెన్నయ్య తదితరులు కేక్‌ కట్‌ చేసి సంతోషం వ్యక్తం చేశారు.

Updated Date - Mar 24 , 2026 | 05:58 AM