హంద్రీ-నీవా పనుల్లో నిర్లక్ష్యం
ABN , Publish Date - Mar 27 , 2026 | 06:08 AM
రాయలసీమ జీవనాడి హంద్రీనీవా సుజల స్రవంతి(హెచ్‌ఎన్‌ఎ్‌సఎస్) ప్రాజెక్టు 7, 8 ప్యాకేజీ పనులు సకాలంలో పూర్తిచేయని కాంట్రాక్టు సంస్థను తప్పించాలన్న జలవనరుల శాఖ నిర్ణయాన్ని క్యాబినెట్ ఆమోదించింది.
కాంట్రాక్టు సంస్థ తొలగింపు
రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం
అమరావతి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): రాయలసీమ జీవనాడి హంద్రీనీవా సుజల స్రవంతి(హెచ్‌ఎన్‌ఎ్‌సఎస్) ప్రాజెక్టు 7, 8 ప్యాకేజీ పనులు సకాలంలో పూర్తిచేయని కాంట్రాక్టు సంస్థను తప్పించాలన్న జలవనరుల శాఖ నిర్ణయాన్ని క్యాబినెట్ ఆమోదించింది. ఈ రెండు ప్యాకేజీల ద్వారా సిమెంట్ లైనింగ్ వేసేందుకు కాంట్రాక్టు సంస్థకు గతంలో పనులు అప్పగించారు. హెచ్‌ఎన్‌ఎ్‌సఎస్ ప్రధాన కాలువ అభివృద్ధి పనులు రూ.606.03 కోట్లతో చేపట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్యాకేజీ-36 పనులు చేపట్టిన కాంట్రాక్టరు సరిగా పనిచేయకపోవడంతో అతడిని తొలగించారు. ఈ ప్యాకేజీ పూర్తయితే మరో 55,608 ఎకరాలకు సాగునీరు అందుతుంది.
క్యాబినెట్ ఆమోదించిన మరికొన్ని నిర్ణయాలు
పోలవరం నిర్వాసితుల కోసం గంగవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి మండలాల్లో సేకరించిన 4,520.62 ఎకరాలకు.. ఒక్కో ఎకరానికి రూ.12.50 లక్షలు చొప్పున చెల్లించడానికి క్యాబినెట్ ఆమోదించింది.
పుంగనూరు కెనాల్ వద్ద అంచనాకు మించి గట్టి రాయి రావడంతో గట్టును పటిష్ఠపరిచేందుకు 51శాతం అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుందని ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదించారు. గతంలో రూ.112.45 కోట్ల మేర ఖర్చవుతుందన్న అంచనాలను తాజాగా రూ.169.90 కోట్లకు పెంచడానికి అంగీకారం తెలిపింది.
పుంగనూరు బ్రాంచి కెనాల్ 74 కి.మీ. నుంచి 165.80 కి.మీ. వరకూ గత ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులకు గాను రూ.27.44 లక్షలు చెల్లించేందుకు సమ్మతి.
కర్నూలు జిల్లాలో గురు రాఘవేంద్ర ప్రాజెక్టు పరిధిలో ఏడు ఎత్తిపోతల పథకాలకు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) పనులు చేపట్టేందుకు రూ.4.41 కోట్లు మంజూరు చేసేందుకు ఆమోదం.
చర్లోపల్లి రిజర్వాయరు నుంచి కృష్ణా జలాలను తరలించే సమయంలో కాలువ వద్ద గస్తీ కాసేందుకు లస్కర్లను నియమించేందుకు ఆమోదం తెలిపింది.
జల వనరుల అభివృద్ధి సంస్థ ద్వారా కొప్పోలు పంప్డ్ హైడ్రో పవర్ స్టోరేజీ ప్రాజెక్టుకు గండికోట రిజర్వాయరు నుంచి నీటిని కేటాయించేందుకు ఆమోదం.