Share News

హంద్రీ కబ్జా..!

ABN , Publish Date - Jan 28 , 2026 | 11:45 PM

హంద్రీ నది కబ్జా అవుతున్నది. అప్పట్లో వైసీపీ నాయకులు.. తాజాగా కూటమి నాయకులు నదిని దర్జాగా కబ్జా చేస్తున్నారు.

   హంద్రీ కబ్జా..!
కర్నూలు నగరం ఆనంద్‌ సినీ థియోటర్‌ ఎదురుగా హంద్రీ నదిని కబ్జా చేసి ఏర్పాటు చేసిన ఓ టీ దుకాణం

నదీ స్థలంలో తాత్కాలిక దుకాణం ఏర్పాటు

చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం

మున్సిపల్‌, జలవనరులు శాఖల మధ్య సమన్వయం లోపం

కర్నూలు, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): హంద్రీ నది కబ్జా అవుతున్నది. అప్పట్లో వైసీపీ నాయకులు.. తాజాగా కూటమి నాయకులు నదిని దర్జాగా కబ్జా చేస్తున్నారు. మొదట్లో తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ తరువాత శాశ్వత నిర్మాణాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికే 338 ఆక్రమణలు గుర్తించారు. నది సరిహద్దులు గుర్తించి సిమెంట్‌ కాంక్రీట్‌ పిల్లర్లు ఏర్పాటు చేశారు. ఆక్రమణలు తొలగించకుండానే ఆనంద్‌ థియేటర్‌ ఎదురుగా హంద్రీ నదిని అక్రమించి తాత్కాలిక వ్యాపార దుకాణం ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తోంది. అధికార పార్టీ ముఖ్య నాయకుడి అండతోనే దర్జాగా కబ్జాకు పాల్పడ్డారనే ఆరోపణులు వినిపిస్తున్నాయి. జలవనరుల శాఖ, కార్పొరేషన, రెవిన్యూ అధికారులు సమన్వయంతో అక్రమణలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

జిల్లాలో ప్రవహిస్తున్న నదుల్లో హంద్రీ నది ఒకటి. తుంగభద్రకు ఉప నది. పత్తికొండ మండలంలో మండలంలో మొదలవుతున్న ఈ నది కర్నూలు నగరం శివారున జోహరాపురం బ్రిడ్జి సమీపంలో తుంగభద్రలో నదిలో కలుస్తుంది. నగరం మధ్యలో 5.40 కి.మీల పొడవున ప్రవహించే హంద్రీ నది వివిధ ప్రాంతాలలో 200 నుంచి 300 మీటర్ల వెడల్పు ఉండాలి. గరిష్ఠ వరద ప్రవాహ అంచుల (మ్యాగ్జిమమ్‌ ఫ్లడ్‌ లెవల్‌-ఎంఎఫ్‌ఎల్‌) నుంచి 50 మీటర్లు (150 అడుగులు) వరకు బఫర్‌ జోన ఉంటుందని జలవనరుల శాఖ ఎఫ్‌ఆర్‌ఎల్‌ డివిజన ఇంజనీర్లు తెలిపారు. నగరంలో స్థిరాస్తుల విలువ భారీగా పెరగడంతో అక్రమార్కులు హంద్రీ నది స్థలంపై కన్నేశారు. ఉపాధి పేరిట ఆక్రమణలకు సై అంటున్నారు. అధికార కూటమి ముఖ్య నాయకుల అండతో పెట్రేగిపోతున్నారు. మొదట్లోనే అడ్డుకట్ట వేయాల్సిన జలవనరుల శాఖ, నగరపాలక సంస్థ, రెవిన్యూ అధికారులు కళ్లకు గంతలు కట్టుకోవడంతో అక్రమార్కులు చెలరేగిపోయారు.

దర్జాగా కబ్జా.. తాత్కాలిక దుకాణం:

ఆనంద్‌ థియేటర్‌ ఎదురుగా హంద్రీ నదిపై ఉన్న వంతెన పక్కనే నరగపాలక పారిశుధ్య సిబ్బంది నగరంలోని చెత్తాచెదారం తీసుకొచ్చి నదిలో వేస్తూ వచ్చారు. అప్పట్లో భారీ ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే.. వాహనాల లోడింగ్‌కు వీలుగా ర్యాంప్‌ ఏర్పాటు చేస్తామని, నదిని పూడ్చేయడం లేదంటూ అప్పట్లో కార్పొరేషన అధికారులు వివరణ ఇచ్చారు. అలా నదిని పూడ్చేసిన స్థలం ఆక్రమణకు గురి కాకుండా కార్పొరేషన డబ్బుతో పార్కును అభివృద్ధి చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. తాజాగా హంద్రీ నది, పార్కును మధ్యలో విలువైన నదీ స్థలాన్ని ఆక్రమించి తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేశారు. ఓ రకంగా చెప్పాలంటే శాశ్వత దుకాణాలకు ఏ మాత్రం తీసిపోవడం లేదు. కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉండే ఓ నాయకుడి అండతోనే నది అక్రమించి వాణిజ్య కేంద్రంగా మారుస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. అధికార కూటమి నేతల ఒత్తిళ్ల కారణంగా అధికారులు కూడా చూసి చూడనట్లు వెళ్తున్నారని ప్రజా సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు.

ఫ వరద వస్తే ముంపు తప్పదు:

కర్నూలు నగరం 2009 వరదల్లో పూర్తిగా ముగిపోయింది. ఇంతటి భారీ నష్టానికి నది ఆక్రమణలే కారణమని ఇంజనీర్లు పేర్కొంటున్నారు. 1997లో ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో రెండుసార్లు లక్ష క్యూసెక్కులకు పైగా వరద రావడంతో నదితీర కాలనీలు ముంపుకు గురయ్యాయి. 2007లో మరోసారి వరద వచ్చి కాలనీలను ముంచేసింది. 2009లో ఉహించని వరదకు నగరజీవులు ఊహించని నష్టం.. కష్టాలను చవిచూశారు. నది ప్రవాహానికి అడ్డంగా నదిని పూడ్చేసి ఇలాంటి తాత్కాలిక నిర్మాణాలు చేపట్టడం వల్ల భవిష్యత్తులో వరదలొస్తే ప్రవాహ దిశ మార్చుకొని బంగారుపేట, కేఈ మాదన్న నగర్‌ వంటి కాలనీలు పూర్తిగా ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది.

ఫ ఇప్పటికే 338 ఆక్రమణలు :

గతంలో పని చేసిన జాయింట్‌ కలెక్టర్‌ నవ్య ఆదేశాలతో రెవిన్యూ, సర్వే, ఇరిగేషన అధికారులు క్షేత్రస్థాయిలో చేసిన సర్వేలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూశాయి. కుడిగట్టు (రైట్‌ బ్యాంక్‌) వెంబడి 164, ఎడమ గట్టు (లెఫ్ట్‌ బ్యాంక్‌) వెంబడి 174 ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించారు. కబ్జా స్థలాల్లో మెజార్టీగా ఆర్‌సీసీ భవనాలు నిర్మించారు. నది సరిహద్దులు గుర్తించి రూ.16 లక్షలు కార్పొరేషన నిధులతో సిమెంట్‌ కాంక్రీట్‌ పిల్లర్లు ఏర్పాటు చేశారు. గుర్తించిన ఆక్రమణలు ఇప్పటికీ తొలగించలేదు. తాజాగా కొత్తగా ఆక్రమణలు పాల్పడడం, కబ్జా స్థలాల్లో తాత్కాలిక వాణిజ్య దుకాణాలు ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తుంది. ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు కబ్జాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఫ కార్పొరేషన అధికారులకు లేఖ రాశాం:

హంద్రీ ఆక్రమణలపై జలవనరుల శాఖ ఎఫ్‌ఆర్‌ఎల్‌ ఈఈ విజయరాజ్‌ దృష్టికి ఆంధ్రజ్యోతి తీసుకెళ్లగా.. ఆనంద్‌ సినీ కాంప్లెక్స్‌ ఎదురుగా హంద్రీ నది స్థలంలో తాత్కాలిక దుకాణం ఏర్పాటుపై తక్షణ చర్యలు తీసుకోవాలని కర్నూలు అర్బన మండలం తహసీల్దార్‌, నగర పాలక సంస్థ అధికారులకు లేఖలు రాశామని వివరించారు. ఈ విషయాన్ని కార్పొరేషన కమిషనర్‌ విశ్వనాథ్‌ దృష్టికి తీసుకెళ్లగా ఆ స్థలం ఇరిగేషన శాఖకు చెందినది, ఆ శాఖ ఇంజనీర్లు ఆక్రమణలు తొలగించేందుకు ముందుకు వస్తే సహాయం కోసం తమ సిబ్బందిని పంపుతామని వివరించారు.

Updated Date - Jan 28 , 2026 | 11:45 PM