Share News

అసెంబ్లీ ఆవరణలో చేనేత స్టాళ్లు

ABN , Publish Date - Feb 19 , 2026 | 05:32 AM

కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేనేత రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. తాజాగా బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో చేనేత స్టాళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

అసెంబ్లీ ఆవరణలో చేనేత స్టాళ్లు

  • బడ్జెట్‌ సమావేశాలు ముగిసే వరకూ నిర్వహణ

అమరావతి, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేనేత రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. తాజాగా బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో చేనేత స్టాళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో అసెంబ్లీకి, మండలికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఆప్కో ఆధ్వర్యంలో 12 స్టాళ్లను అధికారులు ఏర్పాటు చేయనున్నారు. బడ్జెట్‌ సమావేశాలు ముగిసే వరకూ ఈ స్టాళ్లను కొనసాగించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తయారవుతున్న ప్రఖ్యాతిగాంచిన చేనేత ఉత్పత్తులను ఇక్కడ విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నారు. పొందూరు చొక్కాలు, పంచెలు, కుండువాలు, మాధవరం, వెంకటగిరి, ధర్మవరం, రాజమండ్రి, ఉప్పాడ, బందరు మానపల్లి పట్టు, సాధారణ చీరలతోపాటు రెడీమేడ్‌ దుస్తులను అమ్మకానికి ఉంచనున్నారు. ఈ స్టాళ్లను చేనేత జౌళిశాఖ మంత్రి సవిత బుధవారం పరిశీలించారు. ఏయే వస్త్రాలు విక్రయించనున్నారో అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చేనేత వస్త్రాలను, పట్టు చీరలను అమ్మకానికి పెట్టాలని ఆదేశించారు. చేనేత స్టాళ్లతోపాటు ఫొటో స్టాల్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌ దంపతులు, సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ సహా పలువురు ప్రముఖులు చేనేత ఎగ్జిబిషన్లను సందర్శించిన, చేనేత వస్త్రాలు కొనుగోలు చేసిన, ధరించిన దృశ్యాలను ఈ ఫొటోస్టాల్‌లో ప్రదర్శనకు ఉంచారు. నేతన్నలతో సీఎం చంద్రబాబు సంభాషిస్తున్న దృశ్యాలు కూడా ప్రదర్శనకు పెట్టారు.

నేతన్నకు ఆర్థిక భరోసా: సవిత

చేనేత దుస్తుల వినియోగం పెంచడమే లక్ష్యంగా ఈ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. బడ్జెట్‌ సమావేశాలకు వచ్చినవారంతా చేనేత వస్త్రాలు కొనుగోలు చేయడం ద్వారా నేతన్నలకు ఆర్థిక భరోసా లభిస్తుందన్నారు. ప్రజలంతా వారంలో ఒక రోజు చేనేత దుస్తులు ధరించడం ద్వారా సంప్రదాయమైన చేనేత వృత్తికి వెన్నుదన్నుగా నిలిచినవారవుతారని తెలిపారు.

Updated Date - Feb 19 , 2026 | 05:33 AM