Share News

కరకట్ట కనికట్టు!

ABN , Publish Date - Jan 30 , 2026 | 12:51 AM

సముద్ర విపత్తుల నుంచి తీర ప్రాంతాన్ని రక్షించేందుకు నిర్మించిన కరకట్ట (రక్షణ కవచం) మరమ్మతుల వ్యవహారంపై అనేక విమర్శలు వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో పనులు చేయకుండానే చేసినట్టు చూపి ఓ అధికారి తన బినామీ ద్వారా సుమారు రూ.15 లక్షలకుపైగా బిల్లులు చేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధికి బిల్లులో 15 నుంచి 20 శాతం కమీషన్‌ ఇచ్చినట్టు తెలిసింది. ఈ విషయమై ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు వెళ్లడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. దీంతో నాటి తప్పులను కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పనుల వెనుక నాడు ఇక్కడ పనిచేసిన ఓ అధికారి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది.

కరకట్ట కనికట్టు!

- 30 ఏళ్ల కిందట రూ.33 కోట్లతో కరకట్ట నిర్మాణం

- కొన్నేళ్ల తర్వాత ఏర్పడిన రంధ్రాలు

- వైసీపీ ప్రభుత్వంలో రూ.15 లక్షలతో మరమ్మతులు!

- పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్నారని ఓ అధికారిపై ఆరోపణలు

- అప్పటి నియోజకవర్గ ప్రజాప్రతినిధికి కమీషన్‌ అందినట్టు సమాచారం

- ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు

- అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న రైతులు, స్థానికులు

సముద్ర విపత్తుల నుంచి తీర ప్రాంతాన్ని రక్షించేందుకు నిర్మించిన కరకట్ట (రక్షణ కవచం) మరమ్మతుల వ్యవహారంపై అనేక విమర్శలు వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో పనులు చేయకుండానే చేసినట్టు చూపి ఓ అధికారి తన బినామీ ద్వారా సుమారు రూ.15 లక్షలకుపైగా బిల్లులు చేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధికి బిల్లులో 15 నుంచి 20 శాతం కమీషన్‌ ఇచ్చినట్టు తెలిసింది. ఈ విషయమై ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు వెళ్లడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. దీంతో నాటి తప్పులను కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పనుల వెనుక నాడు ఇక్కడ పనిచేసిన ఓ అధికారి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం/కృత్తివెన్ను:

కృత్తివెన్ను మండలంలో పెదలంక డ్రెయిన్‌ నుంచి ఇంతేరు వరకు సుమారు 13 కిలోమీటర్లు పొడవున తీర ప్రాంత గ్రామాలు, ఆయా గ్రామాల పంట భూములు, చెరువులను సముద్ర విపత్తుల నుంచి రక్షించేందుకు ఎన్‌సీఆర్‌ఎంపీ నిధుల నుంచి రూ.33కోట్ల వ్యయంతో రక్షణ కవచంగా సుమారు 30 ఏళ్ల కిందట కరకట్టను నిర్మించారు. సుమారు 100 సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతంలో వచ్చిన తుఫానులు, సునామీలు వంటి సముద్ర విపత్తులను దృష్టిలో పెట్టుకుని నాలుగు మీటర్ల ఎత్తు, అడుగున 20 మీటర్ల వెడల్పు, పైన 3.5 మీటర్ల వెడల్పు ఉండేలా అత్యంత పటిష్టంగా కరకట్ట నిర్మాణం చేసినట్లు నాటి అధికారులు స్పష్టం చేశారు.

నిర్మించిన కొన్నాళ్లకే రంధ్రాలు

కరకట్ట నిర్మించిన కొన్ని సంవత్సరాల తర్వాత కృత్తివెన్ను, పీతలావ గ్రామాల సమీపంలో డ్రెయిన్‌లు వెళ్లే తూముల దగ్గర భారీ రంధ్రాలు ఏర్పడ్డాయి. దీంతో కరకట్ట నాణ్యతపై స్థానిక రైతులు, ప్రజల అప్పట్లో అనుమానాలు వ్యక్తం చేశారు. విపత్తుల సమయంలో ప్రజలకు, గ్రామాలకు, భూములకు రక్షణగా నిలవాల్సిన కరకట్టకే రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రెయిన్‌ సముద్రంలో కలిసే చోట కరకట్ట కింద కల్వర్టులు నిర్మించకుండా తూములు ఏర్పాటు చేయటం వల్లే కరకట్టకు రంధ్రాలు ఏర్పడ్డాయని, ఆ రంధ్రాలకు మరమ్మతులు చేయించి, కల్వర్టులు నిర్మించాలని కోరుతూ స్థానిక రైతులు, నీటి సంఘాల అధ్యక్షులు, డీసీ చైర్మన్‌లు నాటి నుంచి ఉన్నతాధికారులతో పాటు కలెక్టర్‌కు వినతిపత్రాలను అందిస్తున్నారు.

వైసీపీ హయాంలో పనులు చేయకుండానే..

కరకట్టకు ఏర్పడ్డ రంధ్రాలను పూడ్చేందుకు నాటి అధికారులు అంచనాలు వేసి, ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం నుంచి అంగీకారం వచ్చిందని, కాంట్రాక్టర్లు రావటం లేదని అప్పట్లో అధికారులు తెలిపారు. కానీ ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి ఓ ఫిర్యాదు వెళ్లింది. ఆ ఫిర్యాదులో గత వైసీపీ హయాంలో కరకట్టకు ఏర్పడిన రంధ్రాలను పూడ్చకుండానే పనులు చేసినట్లు చూపి, ప్రభుత్వం నుంచి బిల్లులు పొందినట్లు ఉంది. ఓ అధికారి తన బినామీ పేరుతో పనులు పూర్తి చేసినట్లు చూపి, సుమారు రూ.15 లక్షలకుపైగా బిల్లులు పొందారని, అందుకు సహకరించిన నాటి నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధికి 15 నుంచి 20 శాతం వాటా కూడా ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణ జరిపిన అధికారులు ప్రభుత్వాన్ని పదేపదే పక్కదారి పట్టిస్తూ, నిజాన్ని దాస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగు చూస్తాయని ప్రజలు, రైతులు అంటున్నారు.

కలెక్టర్‌కు విన్నవించాం

కరకట్టకు ఏర్పడ్డ రంధ్రాలకు మరమ్మతులు చేసి, తూముల స్థానంలో కల్వర్టులు నిర్మించాలని ఉన్నతాధికారులతో పాటు, కలెక్టర్‌కు విన్నవించాం. ఇది చాలా అత్యవసరమైన పనిగా తెలిపాం. దీని వల్ల భవిష్యత్తులో సముద్ర విపత్తుల వల్ల తీరానికి భారీ నష్టం జరిగే ప్రమాదం పొంచి ఉంది. తుఫానుల సమయంలో తీరప్రాంత ప్రజలు వణికిపోతున్నారు. కరకట్టకు ఇప్పటి వరకు ఎటువంటి మరమ్మతులు జరగలేదు. పనులు జరిగింది లేనిది పూర్తిస్థాయి విచారణ జరపాలి.

- నెక్కంటి భాస్కరరావు, డీసీ చైర్మన్‌

విచారణ చేస్తాం

కరకట్ట రంధ్రాలకు మరమ్మతులు చేయకుండా బిల్లుల చెల్లింపు జరిగిందని ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు అందాయి. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఆ అభియోగాలపై విచారణ కూడా చేశాం. అది వేరే కరకట్టకు చెందిన ఫిర్యాదుగా భావిస్తున్నాం. ఈ కరకట్టకు ఎటువంటి మరమ్మతు పనులు జరగలేదు. బిల్లుల చెల్లింపు కూడా నాకు తెలిసి చేయలేదు. మరింతగా పూర్తిస్థాయిలో విచారణ జరుపుతాం. ప్రస్తుతం కరకట్ట పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదించి, అంచనాలు పంపించాం. త్వరలోనే మరమ్మతులు చేసేందుకు కృషి చేస్తాం.

- కిరణ్‌బాబు, డ్రైనేజీ ఈఈ

Updated Date - Jan 30 , 2026 | 12:51 AM