జూలై 3వ వారంలో ‘తల్లికి వందనం’
ABN , Publish Date - Jun 17 , 2026 | 04:24 AM
తల్లికి వందనం పథకం నగదును జూలై మూడో వారంలో విడుదల చేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది.
అదే వారంలో మెగా పీటీఎం
ఈ నెల 29న షైనింగ్ స్టార్స్ కార్యక్రమం
అమరావతి, జూన్ 16(ఆంధ్రజ్యోతి): తల్లికి వందనం పథకం నగదును జూలై మూడో వారంలో విడుదల చేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఉండవల్లిలోని నివాసంలో విద్యా శాఖపై సమీక్ష నిర్వహించారు. ప్రతి విద్యార్థికి తల్లికి వందనం నగదు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జూలై మూడో వారంలో విడుదలకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు మంత్రికి తెలిపారు. ఈ పథకం అమలు కోసం తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలో పూర్తవుతుందన్నారు. ఈ నెల 29న షైనింగ్ స్టార్స్, జూలై మూడో వారంలో మెగా పీటీఎం నిర్వహిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఉన్నత విద్యలో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షల ఫలితాలను విడుదల చేసి, నిర్ణీత సమయంలో అడ్మిషన్లు జరిగేలా చూడాలని మంత్రి లోకేశ్ చెప్పారు. జాతీయ స్థాయిలో, ఇతర రాష్ర్టాల్లో జరిగే ప్రవేశ పరీక్షల తేదీలను చూసి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఇక్కడ పరీక్షలు నిర్వహించాలన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీల్లో సీట్ల పెంపునకు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో యూనివర్సిటీల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్న థాపర్ ఇన్‌స్టిట్యూట్, జేమ్స్ కుక్ యూనివర్సిటీ, జేఎ్‌సఎస్ అకాడమీ, మెల్‌బోర్స్ యూనివర్సిటీ, మేధావి స్కిల్ యూనివర్సిటీ విద్యా సంస్థలతో చర్చల పురోగతిపై మంత్రి ఆరా తీశారు. జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. రాష్ర్టానికి స్టేట్ ఎన్‌సీసీ డైరెక్టరేట్‌ను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో ఉన్నతాధికారులు జె.శ్యామలరావు, తమీ మ్ అన్సారియా, భరత్ గుప్తా, బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.