18, 19 తేదీల్లో హజ్ యాత్ర ప్రారంభం
ABN , Publish Date - Mar 27 , 2026 | 05:03 AM
వచ్చే నెల 18, 19 తేదీల్లో హజ్ యాత్ర ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నామని రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి చిత్తూరి శ్రీధర్ తెలిపారు..
రాష్ట్రం నుంచి బయలుదేరనున్న 2,005 మంది
335 మంది బెజవాడ నుంచే ఎంబార్కేషన్
రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి శ్రీధర్
అమరావతి, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): వచ్చే నెల 18, 19 తేదీల్లో హజ్ యాత్ర ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నామని రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి చిత్తూరి శ్రీధర్ తెలిపారు. 2026 సంవత్సరంలో రాష్ట్రం నుంచి 2,005 మంది హజ్ హజ్ యాత్రకు వెళ్లనున్నట్లు వెల్లడించారు. హజ్ యాత్ర సన్నద్ధతపై గురువారం విజయవాడలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 18, 19 తేదీల్లో విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి 335 మంది, హైదరాబాద్ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి 1,134 మంది, బెంగళూరు ఎంబార్కేషన్ పాయింట్ నుంచి 515 మంది, చెన్నై నుంచి 14 మంది, ముంబై నుంచి ఐదుగురు, ఢిల్లీ నుంచి ఇద్దరు హజ్ యాత్రకు వెళ్లనున్నట్లు తెలిపారు. హజ్ యాత్ర విజయవంతానికి అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు. రాష్ట్రానికి చెందిన హజ్ యాత్రికుల సౌకర్యార్థం విజయవాడను ఎంబార్కేషన్ కేంద్రంగా గుర్తించామని చెప్పారు. ఏర్పాట్లలో సమన్వయం కోసం రాష్ట్ర హజ్ కమిటీ, జిల్లా యంత్రాంగం, విమానాశ్రయ అధికారులు, పోలీస్, వైద్యవిభాగాలకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది క్యాంపును గన్నవరం విమానాశ్రయ సమీపంలో ఏర్పాటుకు పరిశీలిస్తున్నామన్నారు. రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ బాషా మాట్లాడుతూ 18, 19 తేదీల్లో విజయవాడ(గన్నవరం) విమానాశ్రయం నుంచి హజ్ యాత్రికులు బయలుదేరనున్నారని చెప్పారు. సౌదీ ఎయిర్ లైన్స్‌కు చెందిన 2 విమానాలు తొలిసారిగా గన్నవరం నుంచి నేరుగా ప్రయాణించనున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.