గుట్కా మాఫియా.. చీకటి దందా
ABN , Publish Date - Jan 30 , 2026 | 04:47 AM
గుట్కా బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వ్యాపారులు పాన్ మసాలా మాటున రకరకాల పేర్లతో అధికధరలకు గుట్టుగా గుట్కా విక్రయిస్తూ సామాన్యుల్ని దోచుకోవడంతో పాటు వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
పన్నులు ఎగవేస్తూ బ్లాకులో విక్రయం
పాన్ మసాలాల పేరిట దోపిడీ
బిల్లులో బ్యాగ్ ధర 10 వేలు.. మార్కెట్లో 25 వేలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
గుట్కా బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వ్యాపారులు పాన్ మసాలా మాటున రకరకాల పేర్లతో అధికధరలకు గుట్టుగా గుట్కా విక్రయిస్తూ సామాన్యుల్ని దోచుకోవడంతో పాటు వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మరోవైపు ప్రభుత్వానికి కోట్లాది రూపాయల పన్నులు ఎగవేసి మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో విచ్చలవిడిగా సాగుతున్న గుట్కా అక్రమ వ్యాపార నెట్‌వర్క్ వ్యవస్థలకే సవాల్ విసురుతోంది. రూపాయి నుంచి రెండు రూపాయల మధ్యలో ధర ఉన్న ఒక్కో పాన్ మసాలా ప్యాకెట్లను 10 నుంచి 20 రూపాయలకు విక్రయిస్తున్నారు. వాటికితోడు సిగరెట్ల ధరలు ఫిబ్రవరి నుంచి భారీగా పెరుగుతాయంటూ సిగరెట్ వ్యాపారులు బ్లాకులో అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఈ బహిరంగ దోపిడీపై పోలీసులు, విజిలెన్స్, జీఎ్‌సటీ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందనా లేదని వాపోతున్నారు. ఉత్తరాదితో పాటు మన పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, కర్ణాటక నుంచి రాష్ట్రంలోకి గుట్కా, పాన్ మసాలా వస్తోంది. డీలర్లు రూ.25 వేలకు ఉత్పత్తిదారు నుంచి కొనే పాన్ మసాలా బ్యాగు అసలు బిల్లులో మాత్రం రూ.10 వేలు ఉంటుంది. ఉత్పత్తిదారులు పన్నుల ఎగవేత కోసమే బిల్లులో అసలు ధర చూపించడంలేదు. బిల్లులో చూపించినంత వరకూ ఆన్‌లైన్ ద్వారా లావాదేవీలు జరిపి అదనపు డబ్బులు ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, భువనేశ్వర్ తదితర ప్రాంతాల్లో నగదు రూపంలో తీసుకొంటున్నారు. ఇందుకు హవాలా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని కోట్లాది రూపాయల నల్ల డబ్బు దేశం దాటిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక నుంచి వచ్చే పాన్ మసాలా బ్యాగును రూ.23 వేల నుంచి 27 వేల మధ్య ఏపీలో డీలర్లు విక్రయిస్తున్నారు. ఉత్పత్తిదారు చూపించే ధర రూ.11వేలకు అటూ ఇటుగా ఉంటోంది. వంద బ్యాగులు తీసుకొచ్చే వాహన డ్రైవర్ వద్ద రూ.11 లక్షలకు బిల్లు, జీఎ్‌సటీ, సెస్ ఉంటోంది. ఒకే బిల్లుతో నాలుగైదు సార్లు అదే వాహనాన్ని తిప్పుతున్నారు.
బిల్లు వేసిన 72 గంటల వరకూ చెల్లుబాటు అవుతుండటంతో టుంకూరు నుంచి చిత్తూరు, తిరుపతికి వచ్చి గోడౌన్లలో దించేసి, వెంటనే వెనక్కి వెళ్లి అదే బిల్లుతో మరో ట్రిప్పు తెస్తున్నారు. ఇలా ఏటా రూ.120 కోట్ల పన్నులు ఎగవేస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక నుంచి వచ్చే గుట్కా, పాన్ మసాలాలకు చిత్తూరు, నెల్లూరు, అనంతపురం కేంద్రాలుగా ఉంటే.. భువనేశ్వర్ నుంచి వచ్చే వాటికి విశాఖపట్నం, గుంటూరులో గోడౌన్లు ఉన్నాయి. నెల్లూరులోని హరినాథపురం ప్రాంతానికి చెందిన ఒక వ్యాపారి వైసీపీ ప్రభుత్వంలో ‘జై జగన్’ అంటూ వాట్సాప్ డీపీ పెట్టుకుని దందా చేసి కోట్లకు పడగలెత్తాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోని ఒక మంత్రి ఫొటో డీపీగా పెట్టుకుని కొనసాగిస్తున్నాడు. నెల్లూరు సమీప మనుబోలుకు చెందిన మరో వ్యాపారి టీ కొట్టు పెట్టుకుని జీవించే స్థాయి నుంచి 10 కోట్ల ఆస్తికి యజమాని అయ్యాడు. గుంటూరుకు చెందిన ఓ వ్యాపారి ఎన్నికలపుడు తాడేపల్లి ప్యాలె్‌సకు వెళ్లి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే 50 కోట్లు ఖర్చు చేస్తానని అడిగే స్థాయికి చేరుకున్నాడు. అనంతపురం జిల్లాలో ధర్మవరానికి చెందిన ఒక పాల వ్యాపారి రూ.వందల కోట్ల ఆస్తులు పోగు చేసి మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లో ఫ్యాక్టరీ స్థాపించే స్థాయికి చేరాడు. గుట్కా నిషేధం ఉన్న సమయంలో కొందరు వ్యాపారులు కోర్టును ఆశ్రయించి ఆరోగ్య, మున్సిపల్ శాఖల అధికారులు మాత్రమే ఇందులో జోక్యం చేసుకోవాలని, పోలీసుల జోక్యానికి తావులేదని ఆదేశాలు తెచ్చుకున్నారు. జీఎ్‌సటీ అధికారులు వాహనాలను ఆపి తనిఖీ చేసినా.. గోడౌన్లను తనిఖీ చేసే అధికారం లేదని అంటున్నారు. అక్కడక్కడ విజిలెన్స్ అధికారులు సోదాలు చేస్తున్నా నెల మామూళ్ల చాటున తూతూ మంత్రంగా సాగిపోతున్నట్టు ఆరోపణలున్నాయి. పోలీసు, విజిలెన్స్, జీఎ్‌సటీ ఉమ్మడిగా రాష్ట్రవ్యాప్తంగా సోదాలు చేపడితే అక్రమాలను కట్టడి చేయవచ్చని అంటున్నారు.