100 కోట్లతో యోగా, ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ
ABN , Publish Date - Aug 05 , 2026 | 04:08 AM
రాష్ట్రంలో యోగా, ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రూ.100 కోట్ల వ్యయంతో గుంటూరు జిల్లాలో ఇది ఏర్పాటు కానుంది.
గుంటూరు జిల్లాలో 15 ఎకరాల్లో ఏర్పాటు
స్థలాన్ని పరిశీలించి ఆమోదం తెలిపిన కేంద్ర బృందం
2028 నాటికి అందుబాటులోకి..: మంత్రి సత్యకుమార్
అమరావతి, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో యోగా, ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రూ.100 కోట్ల వ్యయంతో గుంటూరు జిల్లాలో ఇది ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో 15.03 ఎకరాల స్థలాన్ని మంగళవారం పరిశీలించిన కేంద్ర ఆయుష్ శాఖ బృందం ఇక్కడ సంస్థ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ స్థలాన్ని 3నెలల్లో అభివృద్ధి చేసి కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు జరగనున్నాయి. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘‘సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ యోగా అండ్ నేచురోపతి’’ ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తున్న ఈ కేంద్రం... యోగా, ప్రకృతి వైద్య రంగంలో దేశంలోనే అత్యున్నత పరిశోధనా సంస్థల్లో ఒకటిగా నిలవనుంది. యోగా, ప్రకృతి వైద్య విధానాలపై శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించడం, వైద్యులు, పరిశోధకులకు శిక్షణ ఇవ్వడం, ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలందించడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. ఈ సంస్థ ప్రాంగణంలోనే 100 పడకల యోగా-ప్రకృతి వైద్య ఆస్పత్రిని ఏర్పాటు చేయనున్నారు.
మూడు నెలల్లో స్థలం అప్పగిస్తాం: మంత్రి సత్యకుమార్
యోగా, ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ రాష్ట్రానికి రానుండడంపై ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. నడింపాలెంలోని ప్రతిపాదిత స్థలం.. సంస్థ ఏర్పాటుకు పూర్తిగా అనుకూలమని కేంద్ర బృందం నిర్ధారించిందని మంత్రి తెలిపారు. దీంతో మూడు నెలల్లో స్థలాన్ని చదును చేసి, రోడ్లు, కాలువలు వంటి మౌలిక వసతుల పనులు పూర్తిచేసి కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తామని చెప్పారు. ఈ సంస్థ కార్యకలాపాలు 2028లో ప్రారంభించే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేశామని పేర్కొన్నారు. ప్రతిపాదిత స్థలాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఆయుష్ సంచాలకులు గోపాలకృష్ణ రోణంకి, కేంద్ర యోగా-ప్రకృతి వైద్య పరిశోధన మండలి సంచాలకులు డాక్టర్ జ్యోతి, సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ ప్రమోద్ వర్మ పరిశీలించారు.