అంబటి ఆఫీసుపై దాడి.. టీడీపీ ఎమ్మెల్యే మాధవిపై కేసు
ABN , Publish Date - Feb 04 , 2026 | 04:02 AM
సీఎం చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించిన మాజీమంత్రి అంబటి రాంబాబు కార్యాలయంపై దాడిచేసిన ఘటనలో గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఆమె భర్త రామచంద్రరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆమె భర్త, మరికొందరిపైనా నమోదుచేసిన పోలీసులు.. సీఎం ఆదేశాలతో దర్యాప్తు వేగవంతం
అంబటి కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు రికార్డు.. మొత్తం 31 మందిపై అంబటి ఫిర్యాదు
గుంటూరు, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించిన మాజీమంత్రి అంబటి రాంబాబు కార్యాలయంపై దాడిచేసిన ఘటనలో గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఆమె భర్త రామచంద్రరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ కార్పొరేటర్ వేములపల్లి శ్రీరాంప్రసాద్ అలియాస్ ఇసుక బుజ్జితో పాటు మరికొందరిని నిందితులుగా పేర్కొన్నారు. గత నెల 31న పట్టాభిపురం పోలీసుస్టేషన్ పరిధిలోని సిద్ధార్థనగర్‌లో అంబటి కార్యాలయంపై టీడీపీ శ్రేణులు దాడిచేసి ఫర్నిచర్, కార్యాలయ అద్దాలు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడాన్ని ముఖ్యమంత్రి తీవ్రంగా పరిగణించారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి దాడికి పాల్పడిన వారెవరైనా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మంగళవారం పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసు బృందాలు అంబటి ఇల్లు, కార్యాలయాన్ని సందర్శించి దర్యాప్తు చేపట్టాయి. మరోవైపు క్లూస్ టీం రంగంలోకి దిగి ఆధారాలు సేకరించింది. పట్టాభిపురం పోలీసులు అంబటి భార్య విజయలక్ష్మి, ఆయన కుమార్తెలు మౌనిక, మనోజ్ఞతో పాటు ఆయన పీఏలు ఏలూరి అనిల్ రెడ్డి, మద్దూరి రామకృష్ణ, తాళ్లూరి వెంకటరాయుడులను విచారించి వాంగ్మూలాలు రికార్డు చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు తమ ఇంటిపై దాడిచేసి, అద్దాలు ధ్వంసం చేశారని, దీంతో తాము భయంతో బాత్రూంలో తలదాచుకున్నామని వారు పోలీసులకు వివరించినట్లు తెలిసింది. కాగా.. తన కార్యాలయంపై దాడిలో 31 మంది టీడీపీ నేతలు పాల్గొన్నారని అంబటి రాంబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిలో ఎమ్మెల్యేతోపాటు వివిధ రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు, కార్పొరేటర్లు, నేతలు ఉన్నారు. తన ఇల్లు, కార్యాలయంలో ఫర్నిచర్ అద్దాలు, కంప్యూటర్లు, కార్లు ధ్వంసం చేశారని ఆరోపించారు.